Minister KTR Interesting Comments On CM KCR Telangana Jobs Notifications Announcement - Sakshi
Sakshi News home page

KTR On Jobs Notification: ఇది కొలువుల కుంభమేళా

Published Fri, Mar 11 2022 4:20 AM

CM KCR Job Announcement Not Koluvula Jatara But Koluvala Khumb: KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ‘‘ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఏ సీఎం చేయని విధంగా జిల్లాలు, జోన్లు, శాఖల వారీగా 91 వేల పోస్టుల భర్తీ చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఇది కొలువుల జాతర అని పత్రికలు రాశాయి. వాస్తవానికి ఇది కొలువుల కుంభమేళా..’’అని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని.. ఈ 91 వేల కొలువులు భర్తీ చేస్తే మొత్తం 2.23 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు అవుతుందని తెలిపారు.

రాష్ట్ర పారిశ్రామిక విధానం‘టీఎస్‌–ఐపాస్‌’కింద 19,145 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా.. ప్రైవేటు రంగంలో 16.43 లక్షల పైచిలుకు ఉద్యోగాలు వచ్చా యని చెప్పారు. పరిశ్రమలు, ఐటీ శాఖల పద్దులపై గురువారం శాసనసభలో జరిగిన చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. నిరుద్యోగుల కోసం ప్రతి నియోజకవర్గం లో ఉచిత కోచింగ్‌ సెంటర్లు పెట్టాలని తమ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్‌ సూచించారు.

ఇందుకు కావాల్సిన ఇన్‌స్ట్రక్టర్లను సమకూరుస్తామని చెప్పారు. టీ–శాట్‌ చానళ్ల ద్వారా పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇస్తామని ప్రకటించారు. కొలువులపై సీఎం ప్రకటనను నమ్మబోమని రాష్ట్రంలోని రెండు ప్రధాన ప్రతిపక్షాల నాయకులు అంటున్నారని.. నమ్మేవాళ్లు కొలువుల కోసం దరఖాస్తు చేసుకోవాలని, నమ్మనివాళ్లు ప్రధాని మోదీ హామీ ఇచ్చిన సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. 

అయితే జుమ్లా.. లేకుంటే హమ్లా.. 
కేంద్రం చాలా అంశాల్లో రాష్ట్రానికి మొండిచేయి చూపిందని కేటీఆర్‌ మండిపడ్డారు. ‘‘నిమ్జ్‌ హోదా లభించడంతో జహీరాబాద్‌ పారిశ్రామికవాడ, హైదరాబాద్‌ ఫార్మాసిటీకి కేంద్రం నుంచి రూ.వేల కోట్లు వస్తాయనుకున్నాం. కానీ గత ఆరేళ్లలో జహీరాబాద్‌కు రూ.3 కోట్లు, ఫార్మాసిటీకి ఐదేళ్లలో రూ.5 కోట్లను మాత్రమే మోదీ ప్రభుత్వం ఇచ్చింది.

ఇంత కంటే సిగ్గుచేటు ఉంటుందా? కోవిడ్‌ సంక్షోభంలో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైంది? ఒక్కరైనా లాభపడ్డారా? కేంద్రానికి అయితే జుమ్లా లేకుంటే హమ్లా (అయితే అబద్ధం.. లేకుంటే దాడి) చేయడమే వచ్చు. అచ్చే దిన్‌ అన్నరు. పరిశ్రమలకు సచ్చేదిన్‌ వచ్చాయి’’అని మండిపడ్డారు. హైదరాబాద్‌–వరంగల్, హైదరాబాద్‌–విజయవాడ, హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–నాందేడ్‌ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయాలని కోరితే.. కేంద్రం నుంచి ఉలుకూపలుకూ లేదని విమర్శించారు. డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ కారిడార్‌ను హైదరాబాద్‌లో పెట్టాలని కోరితే.. యూపీ ఎన్నికల కోసమని ఏ సదుపాయాలూ లేని బుందేల్‌ఖండ్‌లో పెట్టారని మండిపడ్డారు. 

కేటీఆర్‌ వర్సెస్‌ భట్టి 
గురువారం శాసనసభలో మంత్రి కేటీఆర్‌కు, కాంగ్రెస్‌పక్ష నేత భట్టి విక్రమార్కకు మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. మొదట మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..‘‘బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌పై ఆ పార్టీ అధ్యక్షుడి కంటే కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎక్కువ బాధపడుతుండు. ఇద్దరూ అవిభక్త కవలల్లా తయారయ్యారని బయట మాట్లాడుతున్నరు. హుజూరాబాద్, కరీంనగర్‌ ఎన్నికల్లో వారు కుమ్మక్కయ్యారు’’అని ఆరోపించగా.. దీనిపై భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారు.

అయినా తగ్గని కేటీఆర్‌.. ‘‘కాంగ్రెస్‌ పార్టీలో మంచివాడైన భట్టిది నడుస్తలేదు. అక్కడ గట్టి అక్రమార్కులున్నరు. వారిదే నడుస్తోంది’’అని వ్యాఖ్యానించారు. అయితే సస్పెండ్‌ చేసిన ప్రక్రియ సరిగా లేదని మాత్రమే తమ పార్టీ అధ్యక్షుడు విమర్శించారని, కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించాలని భట్టి డిమాండ్‌ చేశారు. దీంతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కల్పించుకుంటూ.. ‘‘సీఎం పుట్టినరోజున పిండాలు పెట్టాలంటూ మాట్లాడిన వ్యక్తి గురించా మీరు మాట్లాడేది? ఆయనకు సంస్కారం ఉందా? అలాంటి అధ్యక్షుడిని కలిగి ఉండటం దురదృష్టకరం’’అని రేవంత్‌ను ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు.

అదే సమయంలో కేటీఆర్‌ కూడా స్పందిస్తూ.. ‘‘రాహుల్‌ గాంధీ తండ్రి ఎవరు అని నేనేమైనా అడిగానా? అంటూ అస్సాం బీజేపీ సీఎం దారుణంగా చిల్లర మాటలు మాట్లాడిండు. అస్సాం సీఎం తప్పుడు మాటలు మాట్లాడిండు, క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేసిన సంస్కారవంతమైన నాయకుడు మా ముఖ్యమంత్రి. అలాంటి మా ముఖ్యమంత్రి బర్త్‌డేను మేమేదో చేసుకుంటే.. సంతాప దినాలు చేసుకోవాలని ఇక్కడి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మాట్లాడుతడా? ఇదా సంస్కారం?’’అని మండిపడ్డారు.  

జీనోమ్‌ వ్యాలీని విస్తరిస్తాం 
రాష్ట్రంలో జీనోమ్‌ వ్యాలీని మరో 200–250 ఎకరాల్లో విస్తరించనున్నామని, మరో 200 బయోటెక్‌ కంపెనీలు వస్తున్నాయని కేటీఆర్‌ తెలిపారు. రైతుబీమా తరహాలో లక్ష మంది చేనేత కార్మికులకు చేనేత బీమా ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ప్రైవేటు రంగంలో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే విధానం తెస్తే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావని పేర్కొన్నారు. అయితే స్థానికులకు అవకాశమిచ్చే పరిశ్రమలకు అదనపు రాయితీలు ఇస్తున్నామని వివరించారు. మామిడిపల్లిలో హార్డ్‌వేర్‌ పార్క్, మలక్‌పేటలోని ఆర్‌అండ్‌బీశాఖకు చెందిన 10 ఎకరాల స్థలంలో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.  

Advertisement
Advertisement