మధ్యప్రదేశ్ ఎన్నికల బరిలో రాజకీయ ఉద్ధండులు.. సీఎంకు అవమానం.. 

27 Sep, 2023 19:38 IST|Sakshi

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు 79 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. కానీ అందులో ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చోహాన్ పేరు లేకపోవడం ఆయనకు ఘోర అవమానమన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ.  

మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అక్కడ సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగుతోంది. స్థానిక నాయకత్వాన్ని పక్కన పెట్టి కేంద్ర నాయకత్వానికి పెద్దపీట వేస్తోంది. తలపండిన రాజకీయ ఉద్దండులను రంగంలోకి దించుతోంది. అందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం 79 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజీపీ అధిష్టానం. మొత్తం రెండు విడతల్లో ప్రకటించిన జాబితాల్లో సీఎం పేరు లేకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ కాస్త ఘాటుగానే స్పందించారు. ఇది ఆయనకు ఘోర అవమానానికి పరాకాష్ట అని అన్నారు.

బీజేపీ సరికొత్త ప్రణాళికలో భాగంగా కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో ఉన్న సీనియర్ నాయకులకు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించింది. రెండో జాబితాలో ఇండోర్-1 నుంచి స్థానం దక్కించుకున్న కైలాష్ విజయవర్గీయ తనకు పోటీచేసే ఉద్దేశ్యం లేదన్నారు. తివారీ దీనిపై స్పందిస్తూ.. కైలాష్ విజయవర్గీయకు తన మానసిక ఆరోగ్యం సహకరించడం లేదని చెబుతున్నా సరే వినకుండా పోటీచేయాల్సిందేనని అధిష్టానం ఆయనపై ఒత్తిడి చేస్తోంది. ప్రస్తుతం కైలాష్ పరిస్థితి నీళ్లలోంచి బయటపడ్డ చేపలా తయారైందన్నారు. 

39 మంది అభ్యర్థులతో బీజేపీ ప్రకటించిన ఈ రెండో జాబితాలో విజయవర్గీయ తోపాటు ముగ్గురు కేంద్ర మంత్రులు నలుగురు ఎంపీలు కూడా ఉన్నారు. వీరిలో నరేంద్ర సింగ్ తొమార్, ఫగ్గాన్ సింగ్ కులాస్తే, ప్రహ్లాద్  సింగ్ పటేల్ కూడా ఉన్నారు. 

ఇది కూడా చదవండి: మణిపూర్‌ను 'కల్లోలిత ప్రాంతం'గా ప్రకటించిన ప్రభుత్వం

మరిన్ని వార్తలు