లోక్‌సభలో గరంగరం  | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో గరంగరం 

Published Wed, Aug 9 2023 1:14 AM

Debate in Parliament on No Confidence Motion - Sakshi

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వాడీవేడిగా చర్చ జరిగింది. మణిపూర్‌ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనవ్రతాన్ని విచ్ఛిన్నం చేయ డానికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని ప్రతిపక్షాలు వెల్లడించాయి. ప్రజల సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్న పేదల బిడ్డ నరేంద్ర మోదీపై విశ్వాసం లేదంటూ సభలో ఓటు వేస్తారా? అని అధికార బీజేపీ సభ్యులు ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

మణిపూర్‌ హింసాకాండకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ తక్షణమే రాజీనామా చేయాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సహా పలువురు విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. దేశంలో సమాఖ్య వ్యవస్థను ప్రధాని మోదీ ధ్వంసం చేస్తున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సౌగతారాయ్‌ ఆరోపించారు. శివసేన ఎంపీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు శ్రీకాంత్‌ షిండే సభలో కాసేపు హనుమాన్‌ చాలీసా పఠించారు.

అవిశ్వాస తీర్మానంపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్‌ యాదవ్, సీపీఎం నేత ఎ.ఎం.అరీఫ్, బీజేపీ సభ్యుడు నారాయణ్‌ రాణే, కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ తదితరులు మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్‌ తరపున మాట్లాడేవారి జాబితాలో తొలుత రాహుల్‌ గాంధీ పేరును చేర్చారు. కానీ, చివరి క్షణంలో తొలగించారు. తీర్మానంపై కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు బుధవారం మాట్లాడనున్నారు.  
 
మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించండి  

మణిపూర్‌లో హింస, సరిహద్దుల్లో చైనా సైనికుల చొరబాట్లపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు నోరువిప్పడం లేదని కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ఆ పార్టీ పక్ష ఉపనేత గౌరవ్‌ గొగోయ్‌ నిలదీశారు. ప్రధాని మౌనం వీడేలా చేయడానికే కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పారు. మంగళవారం సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను గౌరవ్‌ గొగోయ్‌ ప్రారంభించారు.

‘‘ప్రధాని మోదీ మణిపూర్‌ను ఇప్పటిదాకా ఎందుకు సందర్శించలేదు? రాష్ట్రంలో హింసాకాండపై కేవలం 30 సెకండ్లపాటు స్పందించడానికి 80 రోజులదాకా ఎందుకు వేచిచూశారు? మణిపూర్‌ ముఖ్యమంత్రిని పదవి నుంచి ఎందుకు తొలగించలేదు?’’అంటూ మూడు ప్రశ్నలు సంధించారు. మోదీ తక్షణమే మణిపూర్‌లో పర్యటించాలని, అఖిలపక్ష బృందాన్ని వెంట తీసుకెళ్లాలని, రాష్ట్రంలోని ప్రజా సంఘాలతో చర్చించి, శాంతిని పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గౌరవ్‌ గొగోయ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే... 
 
తప్పులను అంగీకరించడం మోదీకి ఇష్టం లేదు  
‘‘మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణను, హింసను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర హోంశాఖ, జాతీయ భద్రతా సలహాదారు ఘోరంగా విఫలమయ్యారు. చేసిన పొరపాట్లను అంగీకరించడానికి ప్రధాని మోదీ ఇష్టపడడం లేదు. మణిపూర్‌ ప్రభుత్వం విఫలమైందని బహిరంగంగా చెప్పలేకపోతున్నారు. తప్పులను అంగీకరించడం కంటే మౌనం ఉండడానికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాదు, కేవలం మణిపూర్‌కు న్యాయం చేకూర్చాలన్న ఆశయంతోనే ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం.

మణిపూర్‌లో విభజన జరిగితే దేశంలో విభజన జరిగినట్లే. అందుకే ఈ అంశంపై ప్రధానమంత్రి పార్లమెంట్‌లో మాట్లాడాలని డిమాండ్‌ చేస్తున్నాం. కానీ, ఆయన మౌనవ్రతం కొనసాగిస్తున్నారు. ప్రధాని మౌనం వీడాలన్నదే అవిశ్వాస తీర్మానం అసలు ఉద్దేశం. మణిపూర్‌లో పర్యటించడానికి అభ్యంతరం ఏమిటో మోదీ చెప్పాలి. మణిపూర్‌ అంశంపై కేంద్ర మంత్రులు మాట్లాడితే సరిపోదు, ప్రధానమంత్రి మాట్లాడాలి. మంత్రుల అధికారాలు, ప్రధానమంత్రి అధికారాలు సరిసమానం కాదుకదా! మణిపూర్‌లో శాంతి కోసం మోదీ కనీసం పిలుపు కూడా ఇవ్వకపోడం విచారకరం.

ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు మోదీ అధికారం కోసం ఓట్ల వేట సాగించారు. దేశం కంటే అధికారమే ముఖ్యమనుకున్నారు. ఇదేనా జాతీయవాదం? ఒకే దేశం(వన్‌ ఇండియా) అని చెబుతున్న మోదీ ప్రభుత్వం రెండు మణిపూర్‌లను సృష్టిస్తోంది. 2002లో గుజరాత్‌లో మత కలహాలు చెలరేగినప్పుడు అప్పటి ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి అక్కడ పర్యటించారు. ఇప్పటి ప్రధాని మోదీ మాత్రం కల్లోల మణిపూర్‌కు దూరంగా ఉంటున్నారు. సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడల్లా మోదీ మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.

మణిపూర్‌లో శాంతి కోసం చొరవ తీసుకోవాల్సిన ప్రధానమంత్రి విపక్ష కూటమిపై విమర్శలు చేయడంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడానికి విద్వేషం ఒక ఆయుధంగా మారడం దురదృష్టకరం. మీ ‘విద్వేష దుకాణం’ముందు మా ‘ప్రేమ దుకాణాన్ని’తెరుస్తాం. దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని మీరు పెద్దపెద్ద మాటలు చెబుతున్నారు, అదే మాట ఒక నిరుపేద కూరగాయల విక్రేత ఎదుట చెప్పగలరా?’’అని గౌరవ్‌ గొగోయ్‌ ప్రశ్నించారు.  
 
రాజధర్మం పాటించడం లేదు  
‘‘దివంగత ప్రధాని వాజ్‌పేయి ‘రాజధర్మానికి’మద్దతుగా నిలిచారు. కానీ, ఇప్పుడు మహిళలను నగ్నంగా ఊరేగించినా మనం రాజధర్మం పాటించడం లేదు. మణిపూర్‌లో జరిగిన అకృత్యాలను ప్రపంచమంతా ఖండించింది. దీనిపై యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌లోనూ చర్చ జరిగింది. ప్రధాని మోదీ వైఖరిని బ్రిటిష్‌ పార్లమెంట్‌ సైతం తప్పుపట్టింది. చెడును సంహరించాలన్నదే మా లక్ష్యం. అందుకే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నాం’’  – టి.ఆర్‌.బాలు, డీఎంకే సభ్యుడు  
 
అవిశ్వాసానికి ఇది సమయం కాదు 
‘‘ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతగా ఎదిగారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ మారబోతోంది. అందుకే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇప్పుడు అవసరం లేదు. ప్రతిపక్షాలు ఇకనైనా ఇలాంటి తీర్మానాలను పక్కనపెట్టి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో పాల్గొనాలి. తప్పుడు సమయంలో అవిశ్వాసం పెట్టినందుకు కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు చింతించడం తథ్యం.

బీజేపీని, మోదీని ఇష్టపడకపోయినా సరే దేశానికి మాత్రం మద్దతు ఇవ్వండి. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ఈశాన్యం గ్రోత్‌ ఇంజిన్‌గా మారాలని ఆశిస్తోంది. వాస్తవానికి మణిపూర్‌లో ఇప్పటి సమస్యలకు గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల నిర్వాకాలే కారణం. మణిపూర్‌ను సందర్శించేందుకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మాతోపాటు వస్తారా?’’  కిరణ్‌ రిజిజు, కేంద్ర మంత్రి  
 

విపక్షాలు ఇక ఇంటికే..  
‘‘ఇండియా అని పేరుపెట్టుకున్న విపక్ష కూటమిలో జగడాలు ముదురుతున్నాయి. విపక్ష నేతలు తమలో తాము కలహించుకుంటున్నారు. పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీ జైలు శిక్షపై సుప్రీంకోర్టు కేవలం స్టే ఇచ్చింది. ఆయనను నిర్దోషిగా తేల్చలేదు. క్షమాపణ చెప్పడానికి సావర్కార్‌ను కాదని రాహుల్‌ దురుసుగా మాట్లాడారు. నిజానికి ఆయన ఎప్పటికీ సావర్కార్‌ కాలేరు.

ఒకప్పుడు కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలే ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో నిస్సిగ్గుగా చేతులు కలిపాయి. పేదలకు మంచి చేసిన నాయకుడికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానమిది. వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత విపక్షాలు మళ్లీ సభలో అడుగుపెట్టవు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 400కు పైగా సీట్లు లభించడం ఖాయం’’  – నిషికాంత్‌ దూబే, బీజేపీ ఎంపీ   

Advertisement
Advertisement