బీజేపీ తొలి జాబితాపై నేతల్లో అసంతృప్తి? | Sakshi
Sakshi News home page

Karnataka: బీజేపీ తొలి జాబితాపై నేతల్లో అసంతృప్తి?

Published Wed, Mar 20 2024 9:16 AM

Disconnect in Karnataka BJP After 1 List of Candidates - Sakshi

2024 లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటక నుంచి పోటీచేసే 20 మంది అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. అదిమొదలు బీజేపీలోని కొందరు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారని, వారంతా కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. 

మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప  పార్టీపై తిరుగుబాటు ప్రకటించారు. వారం రోజుల క్రితం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో తన కుమారుడు కేఈ కాంతేష్‌కు చోటు దక్కకపోవడంతో ఆయన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్‌ యడియూరప్పపై తీవ్రంగా మండిపడ్డారు. కర్నాటకలో 28 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ తన కుమారునికి హవేరీ లోక్‌సభ సీటును కేటాయించాలని కేఎస్ ఈశ్వరప్ప కోరారు. అయితే ఆ పార్టీ అక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని పోటీకి దింపింది.

తన కుమారుడికి టికెట్ రాకపోవడంతో కలత చెందిన ఈశ్వరప్ప అందుకు నిరసనగా యడియూరప్ప పెద్ద కుమారుడు బీవై విజయేంద్రపై శివమొగ్గ నుంచి తాను పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు. కర్ణాటకలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉందని మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈశ్వరప్ప వ్యాఖ్యానించారు. కర్ణాటక బీజేపీ ఒక కుటుంబం ఆధీనంలో ఉందని, దానిని అందరూ వ్యతిరేకించాలన్నారు. 

ఇదిలావుండగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తొలుత విముఖత చూపిన మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడ కూడా హఠాత్తుగా ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేస్తానని ఆయన తెలిపారు. మరోవైపు కొప్పల్‌ నుంచి రెండుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన కారడి సంగన్నకు టికెట్‌ దక్కకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి డాక్టర్ బసవరాజ్‌ను పోటీకి దింపాలని పార్టీ నిర్ణయించింది. తాను కూడా కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నానని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంగన్న మీడియాకు తెలిపారు.

తుమకూరు నుంచి వి సోమన్నను బీజేపీ పోటీకి దింపడంతో కర్ణాటక మాజీ మంత్రి జేసీ మధుస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన (యడ్యూరప్ప) తనకు అండగా నిలవకపోవడం, తన అభ్యర్థిత్వానికి మద్దతివ్వకపోవడం బాధగా ఉందని, దీంతో పార్టీలో ఉండాలా వద్దా? అనే ఆలోచనలో పడ్డానని అన్నారు. కాంగ్రెస్‌లోకి వెళ్లడం కూడా సేఫ్ జోన్ కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా కర్ణాటకలో ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.

Advertisement
Advertisement