ఆ మాజీ సీఎం చెప్పారనే.. 60 ఏళ్ల వయసులో పెళ్లి! | Sakshi
Sakshi News home page

ఆ మాజీ సీఎం చెప్పారనే.. 60 ఏళ్ల వయసులో పెళ్లి!

Published Thu, Mar 21 2024 7:48 AM

EX CM Suggest Gangster Ashok Mahto Marries At 60 Age - Sakshi

‘‘లాలూజీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాం. ఆ భార్యాభర్తలు మనస్పూర్తిగా ఆయన మమ్మల్ని ఆశీర్వదించారు.. అది చాలూ..’’ అంటూ సంతోషంగా మీడియా ముందు మాట్లాడారు 60 ఏళ్ల అశోక్‌ మహతో. ఈ వయసులో పెళ్లా.. దానికి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ లాంటి దిగ్గజ నేత ఆశీర్వాదం ఎందుకు అనుకుంటున్నారా?.. ఎన్నికలు వస్తున్నాయి కదా.. అందుకేనట!

నవాదా జిల్లాకు చెందిన అశోక్‌ మహతో.. మాజీ గ్యాంగ్‌స్టర్‌. సంచలన కేసుల్లో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గతేడాదే విడుదలయ్యాడు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరాడు. అందుకోసం ముంగేర్‌ స్థానం ఎంచుకున్నాడు. ఇదే స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ, జేడీయూ నేత లాలన్‌ సింగ్‌ పోటీ చేస్తున్నారు. ఎలాగూ.. ఆర్జేడీ మద్దతు ఉంది. టికెట్‌ దక్కే అవకాశం లేకపోలేదు. కానీ.. అన్నేళ్లు జైలు శిక్ష అనుభవించి రావడం, కొన్ని కేసులు పెండింగ్‌లో ఉండడంతో చట్టపరంగా సాధ్యం కావడం లేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో బీహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను కలిశారు. ఇక్కడే లాలూ తన మార్క్‌ రాజకీయం చూపించారు.  ‘వివాహం చేసుకుని నీ భార్యను పోటీ చేయించు’ అని లాలూ సలహా ఇచ్చారు. అంతే.. 

ఢిల్లీకి చెందిన కుమారి అనిత(46) అనే మహిళను మంగళవారం రాత్రి పాట్నా శివారులో ఉన్న ఓ గుడిలో కుటుంబ సభ్యులు, తన మద్దతుదారుల మధ్య పెళ్లి చేసుకున్నారు. బుధవారం ఉదయం ఆ నవవధువు, వరుడు లాలూ ఇంటికి వెళ్లారు. మాజీ సీఎం జంట లాలూ-రబ్రీదేవీల ఆశీర్వాదం తీసుకున్నారు. బయటకు వచ్చిన ఆయన వాహనాన్ని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి.. ఆర్జేడీ టికెట్‌ ఇస్తుందా? లాలూ హామీ ఇచ్చారా? మీ భార్యను ఎన్నికల బరిలో దింపబోతున్నారా?.. హడావిడిగా వివాహం చేసుకోవడానికి కారణాలేంటి?.. ఇలా ప్రశ్నలతో ఆ పెళ్లి కొడుకును ఉక్కిరి బిక్కిరి చేశారు.  అయితే అశోక్‌ మాత్రం తెలివిగా ‘ ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా ఆర్జేడీ నుంచి పోటీ చేస్తాం’ అని  అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

VIDEO Credits: FirstBiharJharkhand

షేక్‌పురా జేడీయూ ఎమ్మెల్యే రణధీర్‌ కుమార్‌ సోనీపై హత్యాయత్నం ఆరోపణలతోపాటు నవాదా జైలు బద్దలుగొట్టిన కేసులో నేరస్థుడిగా అశోక్‌ మహతో 17ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 2023లో జైలు నుంచి ఆయన విడుదలయ్యాడు. ఇక.. 1997లో దాణా కుంభకోణంలో లాలూ రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు తన భార్య రబ్రీదేవిని బీహార్‌కు ముఖ్యమంత్రిని చేసింది తెలిసిందే.

Advertisement
Advertisement