ఎమ్మెల్యేల కొనుగోలుపై జీఎస్టీ వేయండి మేడం

27 Aug, 2022 02:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎనిమిది రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల కూల్చివేతకు అన్ని రకాల వ్యవస్థలను ఉపకరణాలుగా వాడుకోవడం సరిపోలేదనుకుంటా.. అదే తరహా తప్పును జార్ఖండ్, ఢిల్లీలోనూ పునరావృతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. నిర్మలా సీతారామన్‌ గారూ.. బీజేపీ చేస్తున్న బేరసారాలపై జీఎస్టీ విధించేందుకు ఇదే సరైన సమయం’అని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘బీజేపీ ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాల్లో 277 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. అంటే ఎమ్మెల్యేల కొనుగోలుపై దాదాపు రూ.6,300 కోట్లు వెచ్చించింది.

ఈ ధనమంతా ఎక్కడి నుంచి వస్తున్నట్లు’అని ఢిల్లీ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ చేసిన ప్రసంగాన్ని కేటీఆర్‌ రీ ట్వీట్‌ చేశారు. కర్ణాటకలో అమర సైనికుల కుటుంబాలకు ఇచ్చే పరిహారంలో అక్కడి ప్రభుత్వం కోత విధించనుందంటూ వస్తున్న వార్తలపై కేటీఆర్‌ మరో ట్వీట్‌లో స్పందించారు. ‘జాతీయత మీద పెద్దగా మాట్లాడే పార్టీ నుంచి ఈ తరహా నిర్ణయం రావడం బాధాకరం. దేశం కోసం ప్రాణాలు అర్పించే వీర సైనికుల త్యాగాలను ఆర్థిక భారంగా పరిగణించకూడదు. కర్ణాటక ప్రభుత్వం విచక్షణతో వ్యవహరించి ఈ నిర్ణయం వెనక్కి తీసుకుంటుందని అశిస్తున్నా’అని వ్యాఖ్యానించారు. అలాగే ‘జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు ఎన్నో కోణాల్లో మెరుగ్గా పనిచేస్తున్నాయి. జనాభా సంఖ్య ఆధారంగా పార్లమెంటు స్థానాలను పునర్వ్యవస్థీకరిస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలుగుతుందనే వాదన వింటున్నా. అదే జరిగితే ఇంతకంటే అపహాస్యం మరొకటి ఉండదు’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు