గజ్వేల్‌ మీ జాగీరా? | Sakshi
Sakshi News home page

గజ్వేల్‌ మీ జాగీరా?

Published Sun, Sep 3 2023 4:28 AM

Kishan Reddy fires on kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘గజ్వేల్‌ ఏమైనా మీ (కేసీఆర్‌) జాగీరా? మీకు నిజాం రాసిచ్చాడా లేక ఒవైసీ రాసిచ్చాడా? ఇంత బరితెగింపు ఎందుకు? ’అంటూ ముఖ్యమంత్రిపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బీజేపీ నేత, నిజామాబాద్‌మాజీ జెడ్పీ చైర్మన్‌ వెంకట రమణారెడ్డి, ఇతర నేతలు గజ్వేల్‌లోఅభివృద్ధి జరిగిందో లేదో చూస్తామంటూ ‘చలో గజ్వేల్‌’కు పిలుపునిస్తే పోలీసులు ఆయన్ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావుల సమక్షంలో జహీరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, విశ్వకర్మ సంఘం నాయకులు బీజేపీలో చేరారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్‌ జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. 

పాలన చివర్లో రుణమాఫీయా? 
గజ్వేల్‌లో నిజంగా రైతు ఆత్మహత్యలు లేకపోతే.. నియోజకవర్గంలోని దళితులందరికీ ప్రభుత్వం దళితబంధు పథకం అమలు చేయడంతోపాటు అర్హులందరికీ డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇచ్చి ఉంటే ఆ అభివృద్ధిని చూడాలనుకున్న బీజేపీ నేతలను ఎందుకు చూసి కేసీఆర్, బీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు భయపడుతున్నారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తమ నేతలపై కక్షపూరితంగా, దౌర్జన్యంగా వ్యవహరిస్తే బీఆర్‌ఎస్, కల్వకుంట్ల కుటుంబం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, బీసీలకు ఆర్థిక సాయం పథకాలు విఫలమయ్యాయన్నారు. నాలుగున్నరేళ్లపాటు రైతులను మోసం చేసి చివరి నిమిషంలో వారికి రుణమాఫీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. వచ్చే ఎన్నికల్లో రైతులు కేసీఆర్‌కు సరైన బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. త్వరలోనే వెనుకబడిన వర్గాలు, వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరబోతున్నారని చెప్పారు. కాగా, ఈ నెల 17 నుంచి ప్రధాని మోదీ జన్మదిన ఉత్సవాలను నిర్వహిస్తామని, తెలంగాణ విమోచన దినోత్సవాలను గ్రామగ్రామాన నిర్వహిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. 

భారీగా చేరికలు: ఈటల 
జహీరాబాద్, పటాన్‌చెరు, సంగారెడ్డి, నారాయణ్‌ఖేడ్‌ నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు త్వరలో తమ పార్టీలో భారీ స్థాయిలో చేరనున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ తెలిపారు. కొందరు కాంగ్రెస్‌ పార్టీని కృత్రిమంగా పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆ పార్టీ లేదన్నారు.  

Advertisement
Advertisement