‘కేసీఆర్‌ ఇంజనీర్‌గా మారి కట్టడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి’ | Kishan Reddy Slams BRS KCR On Kaleshwaram Project Damage, Details Inside - Sakshi
Sakshi News home page

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి: కిషన్‌ రెడ్డి

Published Fri, Nov 3 2023 5:51 PM

Kishan Reddy Slams KCR On Kaleshwaram Project Damage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండగా మారిందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లలోనే ప్రాజెక్టు కుంగిపోయిందని, నాణ్యత లేని నాసిరకం నిర్మాణం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్‌లో శుక్రవారం కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగుబాటుపై ప్రభుత్వం కనీసం సమాధానం చెప్పలేదని పరిస్థితి నెలకొందనన్నారు. కాళేశ్వరంపై పాదదర్శకత లేదని దుయ్యబట్టారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతుకు వచ్చేది రూ.40 వేలు అయితే.. ప్రాజెక్టు  నిర్వహణకు ఎకరాకు రూ. 85 వేలు ఖర్చవుతుందని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఇంత వ్యత్యాసం ఉందంటే.. ఈ ప్రాజెక్టును కమీషన్ల కోసం కట్టినట్లా? కాంట్రాక్టర్ల కోసం కట్టినట్లా అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి కోసం కట్టారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మీద ఆర్థిక భారం మోపే ప్రాజెక్టు అని విమర్శించారు. డ్యాం సేఫ్టీ అధికారులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని దుయ్యబటారు. ప్రాజెక్టుపై 9 అంశాలకు సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇంజనీర్‌గా మారి కట్టడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. 
చదవండి: పప్పు వ్యాఖ్యలపై కేటీఆర్‌కు రేవంత్‌ రెడ్డి కౌంటర్‌..

‘కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా కట్టినట్లు బీఆర్ఎస్ చెప్పుకుంది. డిస్కవరీ ఛానల్లో కూడా ప్రచారం చేసుకున్నారు. ప్రజాధనం మొత్తం రాళ్లు, నీళ్ల పాలయింది. కాంగ్రెస్ హయాంలో 30 వేల కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ కేసీఆర్ రీడిజైన్ పేరిట 1.30 లక్షల కోట్లతో కాళేశ్వరం నిర్మించారు. ఇంజినీరింగ్ మార్వల్ అని గొప్పలు చెప్పుకున్నారు. జబ్బలు చరుచుకున్నారు. కేసీఆర్ ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకున్నారు. అలాంటి ప్రాజెక్టు కట్టిన నాలుగేళ్ళకే పిల్లర్లు కుంగిపోయాయి.

ఆ పిల్లర్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. లేదంటే ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. కాంట్రాక్టు ఎవరికిచ్చారు? ఎంత ఖర్చయింది అనే అంశాలపై కూడా స్పష్టత ఇవ్వలేదు. ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిన జలశాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక డాక్యుమెంట్లు ఇవ్వలేని పరిస్థితి. లో క్వాలిటీ సాండ్ మెటీరియల్ వాడారని నిపుణుల నివేదికలో తేలింది. 

ముఖ్యమంత్రి కేసీఆర్ నిపుణులు, ఇంజినీర్ల మాటలు పక్కనపెట్టి తానే ఇంజినీర్ లాగా వ్యవహరించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కేసీఆర్ నిర్ణయాల వల్ల ప్రాజెక్టు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉంది. పిల్లర్లు కుంగిపోవడంపై కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. కేసీఆర్ కమీషన్లు తీసుకోవడంలో, తెలంగాణ సొమ్ము దోచుకోవడంలో సక్సెస్ అయ్యారు.. కానీ ప్రాజెక్టు విషయంలో ఫెయిలయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతాం. బాధ్యులు ముఖ్యమంత్రి అయినా, కాంట్రాక్టర్లు అయినా వందకు వంద శాతం చర్యలు తీసుకుంటాం. శనివారం కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళతాం’ అని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.
చదవండి: 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ ఏం చేసింది : సీఎం కేసీఆర్‌

Advertisement
Advertisement