బోగస్ విజనరీ బాబుకు, డెడికేటెడ్ పర్సన్ జగన్‌కు ఉన్న తేడా అదే! | Sakshi
Sakshi News home page

బోగస్ విజనరీ బాబుకు, డెడికేటెడ్ పర్సన్ జగన్‌కు ఉన్న తేడా అదే!

Published Wed, Jan 3 2024 2:55 PM

Kommineni Analysis On APEducation System, Govt Schools - Sakshi

కొద్ది రోజుల క్రితం యూట్యూబ్‌లో ఒక ఆసక్తికరమైన వీడియో చూశాను. అది ఒక ప్రొఫెసర్ చేసిన వీడియో! ఆయన ఎవరో తెలియదు. కానీ ఆయన అనుభవం వింటుంటే మాత్రం గొప్ప అనుభూతి కలుగుతుంది.ఎందుకంటే ఏపీలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన అద్బుతమైన మార్పులను ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు. పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి స్కూళ్లలో నేర్పుతున్న విద్యను ఏపీకి ఎలా తీసుకు వస్తున్నది ఆయన చెబుతుంటే ఇది కదా అభివృద్ది అంటే అనిపిస్తుంది.

ఎల్‌కేజీకి రెండు లక్షలు
ఫ్రొఫెసర్ రమేష్ అనే ఈయన కొన్నేళ్ల  క్రితం తన పిల్లలను చేర్చడం కోసం హైదరాబాద్ ఒక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్‌కు వెళ్లాడట. అక్కడ ఎల్‌కేజీకి తీసుకునే ఫీజు సుమారు రెండు లక్షల రూపాయలని తెలుసుకున్నాడు. ఏం సదుపాయాలు ఉన్నాయో కూడా ఆయన గమనించారు. ప్రత్యేకించి స్కూల్ ఆంబియన్స్ అంటే చూడగానే పిల్లలు ఆకర్షితులయ్యే విధంగా భవనాలు, రంగులు, బొమ్మలు, క్లాస్ రూమ్స్ ,బల్లలు, డిజిటల్ బోదన ఉంటాయి. అలాగే సీబీఎస్‌ఈ సిలబస్ ఉంది. దానికి తోడు అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగిన ఐబీ సిలబస్ కూడా మరికొన్ని చోట్ల ఉంది. వారు పిల్లలకు బస్ రవాణా సదుపాయం, ఇతర వసతులు కల్పిస్తారు. దీనికి గాను వారికి అంత మొత్తం ఫీజ్ కావచ్చు.

ఆంగ్ల మాద్యమం అవసరం
కానీ ఏపీలో ఇలాంటి వసతులతో కూడిన స్కూల్‌లో ఒక్క పైసా ఖర్చు కాకుండా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు అమోఘం అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక పిల్లలకు డ్రెస్‌లు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం తదితర అన్ని ఏర్పాట్లను జగన్ ప్రభుత్వం చేస్తోంది. ఇది మరి గొప్ప విషయం కాదా! ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టడాన్ని ఆ ఫ్రొఫెసర్ స్వాగతించడమే కాకుండా, అంతర్జాతీయంగా ఎక్కడకు వెళ్లాలన్నా ఆంగ్ల మాద్యమం అవసరం అని ఆయన అబిప్రాయపడ్డారు.

దివంగత నటి సావిత్రి సాయం 
ఈ మద్య నేను కూడా రేపల్లె వద్ద వడ్డివారి పాలెం అని ఒక ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లడం జరిగింది. ఆ స్కూల్‌ను అభివృద్ది చేయడానికి ప్రముఖ నటి, దివంగత సావిత్రి నాలుగైదు దశాబ్దాల క్రితం ఆర్దిక సాయం చేశారు. ఆ గ్రామం ఆమె అమ్మమ్మగారి గ్రామం కావడంతో ఆమె శ్రద్ద చూపించారు. అందుకు కృతజ్ఞతగా ఆ గ్రామస్తులు స్కూల్ ఆవరణలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆమె జయంతి సందర్భంగా ముఖ్య అతిధిగా వెళ్లినప్పుడు అక్కడ ఉన్న సదుపాయాలు గమనించాను.

ప్రభుత్వ పాఠశాలకు బస్‌ సౌకర్యం
స్కూల్ ఆంబియన్స్ మార్చారు. స్కూల్ లోపల కూడా రోడ్డు వేశారు. ఒకప్పుడు వంద మంది కూడా లేని స్కూల్‌లో ఇప్పుడు మూడు వందల మందికి పైగా ఉన్నారని గ్రామస్తులు, స్కూల్ టీచర్లు వివరించారు. వారు సొంతంగా పాఠశాల తరపున ఒక బస్‌ను నడిపి సమీప గ్రామాలకు పంపి పిల్లలను రప్పిస్తున్నారు. బహుశా ఒక ప్రభుత్వ పాఠశాల ఇలా బస్ నడుపుతుండడం అరుదైన విషయమే కావచ్చు.

ఏపీలో మారుతున్న సంస్కృతికి నిదర్శనం
స్కూల్ గోడలపై మంచి రంగు, రంగుల బొమ్మలతో ఆకర్షణీయంగా కనిపించాయి. ఒకప్పుడు స్కూళ్లలో మంచి నీటి సదుపాయమే ఉండేది కాదు. కాని ఇప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. టాయిలెట్లలో స్టార్ హోటళ్లలో మాదిరి పరికరాలుపెట్టారు. అయితే అక్కడ మాత్రం కాస్త నిర్వహణ లోపం కనిపించింది. నేను చూసిన మరికొన్ని స్కూళ్లలో మాత్రం టాయిలెట్లు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. అయినా పిల్లల కోసం అలాంటి సదుపాయం ఏర్పాటు చేయడమే ఏపీలో మారుతున్న సంస్కృతికి నిదర్శనం.

డిజిటల్ విద్యాబోధనకు అవసరమైన సదుపాయాలు
ఈ మద్య తెలంగాణలో ఉన్న స్కూళ్ల పరిస్థితిని, ఏపీ స్కూళ్ల స్థితిని పోల్చుతూ కొన్ని వీడియోలు వచ్చాయి. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో ఒక స్కూల్‌కు వెళ్లినప్పుడు పిల్లలతో పాటు తాను కూడా కింద కూర్చోవలసి వచ్చింది. మరి అదే ఇప్పుడు మంచి, మంచి బల్లలు ఏర్పాటు చేశారు. క్లాస్ రూమ్‌లో భారీ టెలివిజన్‌లు ఏర్పాటై కనిపించాయి. డిజిటల్ విద్యాబోధనకు అవసరమైన అన్ని అక్కడ ఉన్నాయి.

అమ్మ ఒడి కింద పదిహేను వేలు
ఒక్క బైజూస్ కంటెంట్‌తో కూడిన టాబ్ కావాలంటే ప్రైవేట్ స్కూళ్లలో 35 వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుందట. ఈ రకంగా చూస్తే ప్రవేటు స్కూళ్లలో ఎల్‌కేజీకే రెండున్నర లక్షల రూపాయల వ్యయం చేయవలసి వస్తుంది. కాని ఏపీలో పేద పిల్లల విద్యాబ్యాసానికి ఇంత ఖరీదైన విద్యను కాణీ ఖర్చు లేకుండా ఇస్తున్నారు. పైగా అమ్మ ఒడి కింద పదిహేనువేల రూపాయలు ఇస్తున్నారు.

చంద్రబాబు పిట్టలదొర కబుర్లు నమ్ముతారా?
పిల్లలకు చిన్న క్లాస్‌ల నుంచే టోఫెల్, ఐబీ వంటివాటిలో శిక్షణ ఇవ్వాలని తలపెట్టారు. మాతృభాషకు విఘాతం కలగకుండా ఇంగ్లీష్‌తో పాటు, మరికొన్ని ఇతర విదేశీ భాషలు నేర్పాలన్న తలంపుతో జగన్ ప్రభుత్వం ఉంది. అలాంటి మార్పులు వస్తున్నందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంతోషపడడం లేదు. పైగా పేదల చదువును అవహేళన చేసేలా మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియంను అడ్డుకునే యత్నం చేశారు. బైజూస్‌ను జగన్ జ్యూస్ అంటూ అసభ్యంగా మాట్లాడడానికి కూడా సిగ్గు పడలేదు. పైగా ఇప్పుడు కుప్పంలో తిరుగుతూ మీ పిల్లల భవిష్యత్తుకు, మీకు పుట్టబోయే పిల్లల భవిష్యత్ కోసరం తాను పనిచేస్తానని పిట్టలదొర కబుర్లు చెబుతున్నారు. దీనిని ఎవరైనా నమ్ముతారా?

35 ఏళ్లుగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సెంటర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఆయన ఎందుకు బాగు చేయించలేకపోయారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆ స్కూల్‌ను నాడు-నేడు కింద బాగు చేయించారు. దానిని చంద్రబాబు కాదనగలరా! ఆయన ప్రభుత్వం నడిపిన రోజుల్లో ఏమనేవారో గుర్తుకు చేసుకోండి! విద్య అన్నది ప్రభుత్వ బాద్యత కాదని, ప్రైవేటు రంగం పని అని చెప్పేవారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక ఆయన ఏమన్నారో చూడండి. 

ఈనాడు నీచ రాతలు
‘మన పిల్లలకు మనం ఇచ్చే సంపద విద్యే. ప్రతి ఒక్కరిని చదివించాలి. అందుకోసం ఎంతవరకైనా వెళతాం’ అని అంటారు. బోగస్  విజనరీ  చంద్రబాబుకు, డెడికేటెడ్ పర్సన్ జగన్‌కు ఉన్న తేడా అది! ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబును భుజాన ఎక్కించుకుని తిరిగే ఈనాడు మీడియా అయితే ఏకంగా పిల్లలకు టాబ్‌లు ఇస్తే వారు ఏవేవో చూసి పాడైపోతున్నారని నీచంగా రాసింది.

దారుణమైన రీతిలో అసత్యాలు 
నిజానికి ఆ టాబ్ లలో విద్యకు సంబంధించిన కంటెంట్ తప్ప మరొకటి ఓపెన్ కావు. అయినా పచ్చి అబద్దాలతో, లేదా అజ్ఞానంతో ఈనాడు పేపర్ అలాంటి దిక్కుమాలిన రాతకు పాల్పడింది. అందుకే జగన్ ఒక సభలో ఈనాడు పత్రికను ప్రజలకు చూపించి ఛీ అంటూ విసిరికొట్టి బుద్ది చెప్పే యత్నం చేశారు. అయినా ఆ పత్రిక యాజమాన్యం తన వైఖరి మార్చుకోకపోగా, ఇంకా రెచ్చిపోయి దారుణమైనరీతిలో అసత్యాలు రాసి ప్రజల మీదకు వదులుతోంది. వాటిని తట్టుకుని జగన్ ముందుకు వెళుతున్నారు.

విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యం ఇచ్చి ప్రజలకు, ముఖ్యంగా పేదలకు వాటిని అందుబాటులోకి తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే అతిశయోక్తి కాదు. ప్రత్యేకించి ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్నవారు అత్యధికం బలహీనవర్గాల పిల్లలు, ఇతర వర్ణాలలోని పేదలు మాత్రమే. వారికి విద్య రావాలని తపన పడడం జగన్ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. అందుకే ఇంత గొప్పగా విద్యా వ్యవస్థను తీర్చి దిద్దుతున్న జగన్ ప్రభుత్వాన్ని కాదనుకుంటే ఏపీలో విద్యారంగం వందేళ్లు వెనుకబడిపోతుందని ఫ్రొఫెసర్ రమేష్ అంటున్నారు. ఏపీ ప్రజలు విజ్ఞులే కాబట్టి తమ కోసం తపిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని కాదనబోరని సర్వేలు కూడా చెబుతున్నాయి.

కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement

తప్పక చదవండి

Advertisement