టీఆర్‌ఎస్‌ సర్కార్‌ దేశంలోనే అవినీతిమయం.. రాహుల్‌ ఫైర్‌ | Sakshi
Sakshi News home page

Rahul Gndhi: టీఆర్‌ఎస్‌ సర్కార్‌ దేశంలోనే అవినీతిమయం.. రాహుల్‌ ఫైర్‌

Published Fri, Oct 28 2022 1:16 AM

Rahul Gandhi Fires On TRS And BJP At Bharat Jodo Yatra - Sakshi

భారత్‌జోడో యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: టీఆర్‌ఎస్, బీజేపీలు రాజకీయ పార్టీలుగా కాకుండా కవల పిల్లల్లా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు. ఈ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుతున్నాయని... ప్రజాసంక్షేమంకన్నా ప్రజలను దోచుకోవడమే ఆ రెండు పార్టీల పని అని ఆరోపించారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా గురువారం ఆయన నారాయణపేట జిల్లా మక్తల్‌ నుంచి ఎలిగండ్ల వరకు 26 కి.మీ. మేర పాదయాత్ర చేశారు. ఉదయం మక్తల్‌ నుంచి బొందలకుంట స్టేజి వరకు నడిచిన ఆయన... అక్కడ సాయంత్రం వరకు విరామం తీసుకున్నారు.

మధ్యాహ్న సమయంలో రైతులతో సమావేశమై సాయంత్రం 4 గంటలకు యాత్రను మళ్లీ ప్రారంభించి ఎలిగండ్ల దగ్గర ముగించారు. ఈ సందర్భంగా ఎమ్నోనిపల్లి స్టేజి వద్ద ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఎక్కడ దొంగతనం చేసే వీలుంటే అక్కడ దొంగతనం చేశారని, రూ. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆయన దుయ్యబట్టారు. తన యాత్రలో తెలంగాణ ప్రజలు చూపుతున్న అభిమానం, అందిస్తున్న శక్తి చాలా పెద్దదని, ఈ శక్తిని కశ్మీర్‌ వరకు తీసుకెళ్తానని రాహుల్‌ చెప్పారు.

రెండోరోజు పాదయాత్రలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు ఎస్‌. సంపత్‌ కుమార్, వంశీచందర్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, గాలి అనిల్‌ కుమార్, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాహుల్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 
‘హింస, ద్వేషాన్ని రూపుమాపుతూ స్వచ్ఛమైన ప్రేమ కనబర్చి దేశాన్ని ఏకం చేయాలనే ఆలోచనతోనే భారత్‌ జోడో యాత్ర చేపట్టా. అందులో భాగంగానే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీలను దాటి తెలంగాణకు వచ్చా. టీఆర్‌ఎస్, బీజేపీలు నాణేనికి బొమ్మబొరుసు లాంటివి. ఈ రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయి. ఇరు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేసే పనిలో పడ్డాయి.

మోదీ ప్రభుత్వం ఏం చేసినా, పార్లమెంటులో ఏ చట్టం చేసినా అందుకు టీఆర్‌ఎస్‌ పూర్తిస్థాయిలో మద్దతిచ్చింది. రైతులకు నష్టం కలిగేలా మూడు నల్ల చట్టాలను తెచ్చినప్పుడు కూడా టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించలేదు. కానీ రైతుపక్షపాతిగా కాంగ్రెస్‌ మాత్రం రైతుల తరఫున నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో, బయట పోరాడింది. ఆ రెండు పార్టీలకు కాంగ్రెస్‌ సమదూరంలోనే ఉంటుంది.’

ఆ పార్టీలు దోచుకుంటున్నాయి..
‘దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ది. మియాపుర్‌ భూముల్లో రూ. 15 వేల కోట్ల కుంభకోణం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీలు సంక్షేమాన్ని మర్చిపోయి ప్రజల సొమ్మును దోచుకోవడానికే పని చేస్తున్నాయి.

దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోంది. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు లాంటి తప్పుడు నిర్ణయాల ద్వారా దేశంలో ఎక్కువ ఉపాధి కల్పించే చిన్న, మధ్యతరహా వ్యాపారులు ఎక్కువ ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగాలు, ఉపాధి కావాలని దేశ ప్రజలు అడుగుతున్నారు. ఇది వాస్తవ పరిస్థితి. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపు, గ్యాస్‌ సిలిండర్‌ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసేందుకే భారత్‌ జోడో యాత్ర సాగిస్తున్నా’  

Advertisement
Advertisement