Sakshi News home page

జోరుగా క్రాస్‌ ఓటింగ్‌ 

Published Wed, Feb 28 2024 3:29 AM

Rajya Sabha polls: Cross voting by SP MLAs gives BJP stunning UP win - Sakshi

రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ జాక్‌పాట్‌

పోలింగ్‌ జరిగిన 15 సీట్లలో 10 కైవసం 

కాంగ్రెస్‌కు హిమాచల్‌లో అనూహ్య షాక్‌ 

ఆరుగురి క్రాస్‌ ఓటింగ్, సింఘ్వి ఓటమి 

యూపీలో బీజేపీకి 8 సీట్లు, ఎస్పీకి రెండే 

ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేల క్రాస్‌ ఓటింగ్‌! 

బెంగళూరు/లఖ్‌నవూ/సిమ్లా/న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో జోరుగా క్రాస్‌ ఓటింగు సాగింది. దాంతో సంఖ్యాబలం ప్రకారం 8 స్థానాలు నెగ్గాల్సిన బీజేపీ మరో రెండు చోట్ల అనూహ్య విజయం సాధించింది! యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి, హిమాచల్‌ప్రదేశ్‌లో పాలక కాంగ్రెస్‌కు గట్టి షాకిచ్చింది. ఏప్రిల్లో ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ స్థానాలకు గాను 41 చోట్ల ఎన్నిక ఇప్పటికే ఏకగ్రీవం కావడం తెలిసిందే. యూపీలో 10, కర్ణాటకలో 4, హిమాచల్‌లో ఒకటి చొప్పున మిగతా 15 స్థానాలకు మంగళవారం ఓటింగ్‌ జరిగింది. అసెంబ్లీల్లో సంఖ్యాబలం మేరకు యూపీలో బీజేపీ 7, ఎస్పీ 3; కర్ణాటకలో కాంగ్రెస్‌ 3, బీజేపీ 1; హిమాచల్‌లో ఏకైక స్థానంలో కాంగ్రెస్‌ గెలవాల్సి ఉంది.

కానీ బీజేపీ హిమాచల్‌లో పోటీకి దిగడమే గాక యూపీలో 8వ అభ్యర్థిని రంగంలోకి దించింది. కర్ణాటకలో కూడా ముగ్గురు కాంగ్రెస్, ఒక బీజేపీ అభ్యర్థితో పాటు దాని మిత్రపక్షం జేడీ(ఎస్‌) నుంచి ఐదో అభ్యర్థీ పోటీకి దిగారు. యూపీలో ఏడుగురు ఎస్పీ, ఒక బీఎస్పీ ఎమ్మెల్యేలు; హిమాచల్‌లో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. దాంతో హిమాచల్‌లోని ఏకైక సీటుతో పాటు యూపీలో 8వ రాజ్యసభ స్థానమూ బీజేపీ కైవసమయ్యాయి. కర్ణాటకలో మాత్రం బీజేపీ ఎత్తులు పారలేదు. సంఖ్యాబలానికి అనుగుణంగా కాంగ్రెస్‌ 3, బీజేపీ ఒక స్థానంలో నెగ్గాయి. అయితే ఒక బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేయడమే గాక మరొకరు ఓటింగ్‌కు దూరంగా ఉండి పార్టీకి షాకిచ్చారు! మూడు పార్టీలూ క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై చర్యలకు తమ సిద్ధమవుతున్నాయి! 

హిమాచల్‌లో టాస్‌ 
హిమాచల్‌ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలకు గాను పాలక కాంగ్రెస్‌కు 40 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీకి 25 మందే ఉన్నారు. అయితే ముగ్గురు స్వతంత్రులతో పాటు ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థి హర్‌‡్ష మహాజన్‌కు ఓటేశారు. దాంతో కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ మను సింఘ్వి అనుహ్య ఓటమి చవిచూశారు. అభ్యర్థులిద్దరికీ సమానంగా చెరో 34 ఓట్లు రావడంతో టాస్‌ ద్వారా హర్‌‡్షను విజేతను తేల్చారు. ఇక యూపీలో హైడ్రామా చోటుచేసుకుంది. ఓవైపు పోలింగ్‌ జరుగుతుండగానే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ మనోజ్‌ పాండే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు.

పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ నిర్వహించిన సమావేశానికి ఆయనతో పాటు మరో ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వీరిలో కనీసం ఏడుగురు బీజేపీకి అనుకూలంగా ఓటేసినట్టు తేలింది. ఒక బీఎస్పీ ఎమ్మెల్యే కూడా బీజేపీకి ఓటేశారు. దాంతో ఆ పార్టీ అభ్యర్థులు ఆర్‌పీఎన్‌ సింగ్, తేజ్‌వీర్‌సింగ్, అమర్‌పాల్‌ మౌర్య, సంగీతా బల్వంత్, సుధాన్షు త్రివేది, సాధనాసింగ్, నవీన్‌ జైన్, సంజయ్‌ సేథ్‌ విజయం సాధించారు. సమాజ్‌వాదీ నుంచి జయాబచ్చన్, రాంజీలాల్‌ సుమన్‌ నెగ్గగా అలోక్‌ రంజన్‌ ఓటమి పాలయ్యారు. కర్ణాటకలో మాత్రం ఊహించిన ఫలితాలే దక్కాయి.

కాంగ్రెస్‌ అభ్యర్థులు అజయ్‌ మాకెన్, సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్, బీజేపీ అభ్యర్థి నారాయణ కె.బాండే గెలుపొందగా జేడీ(యూ) అభ్యర్థి కుపేంద్రరెడ్డి ఓటమి చవిచూశారు. అయితే యశవంతపుర బీజేపీ ఎమ్మెల్యే ఎస్‌.టి.సోమశేఖర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటేయగా యల్లాపుర బీజేపీ ఎమ్మెల్యే శివరాం హెబ్బార్‌ పోలింగ్‌కు దూరంగా ఉన్నారు! వారిద్దరూ కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. వారిపై చర్యలకు బీజేపీ సిద్ధమైంది.  క్రాస్‌ ఓటింగ్‌ నేపథ్యంలో హిమాచల్‌లో సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు సర్కారు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వాలను కూల్చేయడం మోదీ సర్కారుకు అలవాటుగా మారిందంటూ కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు.

Advertisement

What’s your opinion

Advertisement