షాడో నిఘా! లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రయత్నాలు | Sakshi
Sakshi News home page

షాడో నిఘా! లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రయత్నాలు

Published Fri, Apr 19 2024 4:58 AM

Reconnaissance to know the strategies of opponents - Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రయత్నాలు 

ఎత్తులకు పైఎత్తు వేసేందుకు పరస్పర వ్యూహాలు 

నిఘా పెట్టేందుకు అనుచరులతో ‘ప్రత్యేక’బృందాలు 

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలు ఏవైనా.. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఎత్తులు.. దానికి ప్రత్యర్థుల పైఎత్తులు మామూలే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల అభ్యర్థులు ఈ ఎత్తులు, పైఎత్తుల విషయంలో తిప్పలు పడుతున్నారు. ఓ వైపు తమ ప్రచారం కొనసాగిస్తూనే.. ప్రత్యర్థుల వ్యూహాలేమిటో తెలుసుకునేందుకు నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగా కొందరు ఏకంగా ‘కోవర్ట్‌ ఆపరేషన్లు’ కూడా చేయిస్తున్నట్టు రాజకీయవర్గాలు చెప్తున్నాయి. 

ఎత్తులు తెలిస్తేనే పైఎత్తులు..
అసెంబ్లీ ఎన్నికలు జరిగాక ఆరు నెలల్లోపే లోక్‌సభ ఎన్నికలు రావడం ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రతి అభ్యర్థి కూడా.. ఎదుటి పార్టీలో, పోటీలో ఉన్న అభ్యర్థులు ఏం చేస్తున్నారనేది తెలుసుకోవడంపై దృష్టిపెట్టారు. వారు ఎవరిని ఎలా కలుస్తున్నారు? ఏ హామీలిస్తున్నారు? ప్రలోభాల ఘట్టం ప్రారంభించారా? డంప్‌లు ఎక్కడ ఏర్పాటు చేశారు? వంటి అంశాలు తెలుసుకుని తిప్పికొట్టాలని.. ఓటర్లు వారి వైపు ఆకర్షితులు కాకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని అవకాశాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

అనుచరులకు ‘ప్రత్యేక’బాధ్యతలు 
ప్రత్యర్థులపై నిఘాకు, వ్యూహాలు తెలుసుకునేందుకు అభ్యర్థులు కొందరు నమ్మకస్తులైన అనుచరులను ప్రత్యేకంగా రంగంలోకి దింపుతున్నారు. వారు తమ అభ్యర్థి తరఫున పనిచేసినా, చేయకున్నా.. ఎదుటి అభ్యర్థి ఏం చేస్తున్నారనేది తెలుసుకోవడమే పని. వారు మరికొందరిని సమీకరించుకుని ‘షాడో టీమ్స్‌’మాదిరిగా పనిచేస్తూ.. ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు, వారి వ్యూహాలేమిటన్నది తెలుసుకుని.. అభ్యర్థులకు సమాచారమిస్తున్నారు. కొందరు అభ్యర్థులైతే మరో అడుగు ముందుకేసి ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీలనూ ఆశ్రయిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇందుకోసం అభ్యర్థులు భారీగానే ఖర్చుపెడుతున్నారట.

డంప్‌ల డేటా ‘లీక్‌’చేసేందుకు.. 
ప్రతి అభ్యర్థి తన ప్రత్యర్థులను వీలైనన్ని ఎక్కువ కోణాల్లో దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. కేవలం ప్రచార వ్యూహాలు మాత్రమేకాదు.. వారి ప్రలోభాల ‘డంప్స్‌’ల సమాచారం సేకరించడంపై దృష్టి పెడుతున్నారు. మద్యం, నగదును ఎక్కడ దాచి ఉంచుతున్నారు? ఆ కోణంలో వీరికి సహకరిస్తున్నది ఎవరు? అనే అంశాలను తెలుసుకునే యత్నం చేస్తున్నారు. పోలీసులకు, ఎన్నికల సంఘానికి వాటి సమాచారం ఇప్పించడం ద్వారా ప్రత్యర్థులను దెబ్బతీయాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తమ్మీద లోక్‌సభ ఎన్నికల ‘సిత్రాలు’ఎన్నో..
 
కోవర్టు 
ఆపరేషన్లకూ ప్లాన్‌! అభ్యర్థులు తాము ఎవరితో నిఘా పెట్టినదీ ప్రత్యర్థి పార్టీవారు గుర్తించకుండా ఉండాలి, లేకుంటే బెడిసికొట్టే అవకాశాలు ఎక్కువు. పూర్తిగా కొత్తవారిని రంగంలోకి దింపితే వారికి స్థానిక రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండే అవకాశం తక్కువ. దీంతో కొందరు అభ్యర్థులు.. కోవర్ట్‌ ఆపరేషన్లు ప్రారంభించారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ప్రత్యర్థుల వెంట ఉండేవారికి ఎర వేసి, వారి నుంచే సమాచార సేకరణ చేస్తున్నట్టు చెప్తున్నాయి. ఇలా కోవర్ట్‌ ఆపరేషన్లకు సహకరించే వారికి భారీగానే నజరానాలు ఇస్తున్నట్టు వివరిస్తున్నాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement