Sakshi News home page

సీఎం ముందు చూపు వల్లే ఈ ఫలితాలు

Published Tue, Mar 16 2021 4:41 AM

Sajjala Ramakrishna Reddy Comments About CM Jagan Rule - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్పొరేషన్లు, మునిసిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి.. మేయర్, చైర్మన్‌ స్థానాలు ఆశిస్తున్న ఆశావహులందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముందు చూపుతో అడుగులు వేయటంతోనే కనీ వినీ ఎరుగని ఫలితాలు సాధ్యం అయ్యాయని తెలిపారు. మునిసిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అద్భుత ఫలితాలు సాధించడాన్ని పురస్కరించుకొని సోమవారం పలువురు నేతలు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలి వచ్చారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ సూచించిన మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని, మంచి భవిష్యత్తు ఉంటుందని సజ్జల చెప్పారు. చైర్మన్, మేయర్‌ పదవులు ఎవరికి వచ్చినా, అందరూ సహకరించి.. సమష్టిగా అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. 

పారదర్శక పాలనకు ఓట్లు 
సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ, అభివృద్ధి పాలనకు ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని సజ్జల చెప్పారు. పారదర్శక పాలనకు ప్రజలు ఓట్లు వేశారని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలకు మించిన విజయం మునిసిపల్‌ ఎన్నికల్లో దక్కిందన్నారు. ఈ ఎన్నికల్లో రికార్డు విజయాన్ని ప్రజలు అందించారని చెప్పారు. ప్రజలే చంద్రబాబును పీకి పక్కన పడేశారన్నారు. ఇంతటి భారీ విజయం అదృష్టవశాత్తు వచి్చంది కాదని స్పష్టం చేశారు. గత ఇరవై నెలలుగా సీఎం జగన్‌ అవిరళ కృషితో, రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాల్లో కనిపించిన పెరుగుదల కారణంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఓటర్లు ఒక కృతనిశ్చయంతో సీఎం జగన్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ ఇచ్చిన తీర్పు అన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయం అని, ప్రజల విజయం అని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నేతలు సజ్జల, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డిలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సుధాకర్‌ బాబు, ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ చల్లా మధు, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షుడు మేడపాటి వెంకట్‌ పాల్గొన్నారు.  

Advertisement

What’s your opinion

Advertisement