ప్రభుత్వంపై టీడీపీ గోబెల్స్‌ ప్రచారం: సజ్జల రామకృష్ణారెడ్డి | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంపై టీడీపీ గోబెల్స్‌ ప్రచారం: సజ్జల రామకృష్ణారెడ్డి

Published Thu, Mar 31 2022 7:22 PM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వంపై టీడీపీ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా ప్రజలపై భారం వేయాలనుకోదు. ప్రజలపై రూ.42 వేల కోట్లు ఎక్కడ భారం మోపాం? అని  ప్రశ్నించారు.

‘‘విద్యుత్ ఛార్జీలు స్వల్పంగా పెంచుతూ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడేళ్లుగా పెంచలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో స్వల్పంగా పెంచాల్సి వచ్చింది. ఒక హేతుబద్ధతతో కూడిన పెంపు చేశాం. దీన్ని టీడిపి విష ప్రచారం చేస్తోంది. ప్రజల మీద బరువు వేయాలని ఏ ప్రభుత్వం కోరుకోదు. సంక్షేమానికే డబ్బు ఖర్చు పెట్టాలి, ఎవర్నీ ఇబ్బంది పెట్టకూడదని సీఎం జగన్ ఎప్పుడూ ఆలోచిస్తారు. గతంలో చంద్రబాబు చేసిన అప్పులు ఇబ్బంది పెడుతున్నాయి. తన హయాంలో ఎప్పుడూ కరెంటు ఛార్జీలు పెంచలేదనీ, ఎప్పుడూ కరెంటు కోతలు కూడా లేవని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. మరోవైపు మాపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

చదవండి: AP: ఆ వాదనలో నిజం లేదు: ట్రాన్స్‌ కో ఎండీ

ఈ మూడేళ్లలో ఈ రోజు తప్ప ఇంతకుముందు ఎప్పుడూ పెంచలేదు. 19 వేల కోట్లు ట్రూఅప్ ఛార్జీలు చంద్రబాబు హయాం నాటివి. వాటిని‌ మేము సరిచేశాం. రూ.60 వేల కోట్ల చంద్రబాబు అప్పులు ఇప్పటికి 85 వేల కోట్లకు చేరింది. ఇలాంటి భారాలు మాపై మోపి చంద్రబాబు వెళ్లిపోయారు. కొద్దిగా పెంచక తప్పటం లేదంటూ చంద్రబాబు అసెంబ్లీలోనే ప్రకటించారు. తక్కువ రేటుకు కరెంటు కొనుగోలు చేయటం ఎలా? వినియోగదారులకు ఎలా అందించాలనే ఆలోచనే చేయలేదు. అవసరం లేకపోయినా చంద్రబాబు కరెంటును అడ్డగోలుగా కొనుగోలు చేశారు. కానీ మేము మార్కెట్ లో తక్కువ ధరకి మాత్రమే కొనుగోలు చేస్తున్నాం‌. చంద్రబాబు లాగ మేము విచ్చలవిడిగా కరెంటు కొనుగోలు చేయటం లేదు. పెట్రోలు ధరలు విపరీతంగా పెంచుతున్నా టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?. దీనిపై పోరాటం చేయాలని ఎందుకు అనిపించటం లేదని’’ సజ్జల ప్రశ్నించారు.

‘‘పోలవరంలో భజన పాటలు పాడించటానికే వంద కోట్లు ఖర్చు చేశారు. అలాంటి దుబారా ఖర్చు మేము చేయటం లేదు. పెట్రోలు, డీజిల్ ధరలు పది రోజుల్లో తొమ్మిది సార్లు పెంచినా చంద్రబాబు ఎందుకు నోరెత్తి మాట్లాడటం లేదు. చంద్రబాబు, జనసేన, బీజేపి ముగ్గురూ కలిసి ఒకేపాట పాడతారు. ఎందుకు కరెంటు ఛార్జీలు పెంచామో ప్రజలకు వివరిస్తాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.  

Advertisement
Advertisement