చంద్రబాబు లూటీకి పాన్‌ ఇండియా ప్రచారం | TDP Self Goal With Campaign At Delhi Over Chandrababu Naidu Arrest In Skill Development Scam - Sakshi
Sakshi News home page

టీడీపీ మూడు ప్రయత్నాలు.. చంద్రబాబు లూటీకి పాన్‌ ఇండియా ప్రచారం

Published Thu, Sep 21 2023 3:37 PM

TDP Self Goal With Skill Scam CBN Arrest Campaign At Delhi - Sakshi

స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో ఆధారాలతో సహా దొరికిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకెళ్లారు. పార్టీ ఇమేజ్ ఢమాల్ మని పడిపోయింది. దీన్నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి టిడిపి నేతలు  పాలక వైఎస్సార్‌సీపీపై విషం చిమ్ముతున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న కుట్రతో ఢిల్లీ సాక్షిగా టీడీపీ నేతలు తవ్వుకున్న గోతుల్లో వారే పడ్డారు. ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పార్టీ గ్రాఫ్  అమాంతం పడిపోయింది. టీడీపీ నేతలు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు.

చంద్రబాబు నాయుడి అరెస్ట్‌తో టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. తప్పు చేశారు కాబట్టే చంద్రబాబును జైలుకు పంపారని వారికి అర్ధమైంది. మరిన్ని కేసుల్లోనూ చంద్రబాబు పాత్రకు ఆధారాలు ఉన్నాయని తేలడంతో  టీడీపీ నాయకత్వానికి ఏం చేయాలో పాలు పోవడం లేదు. చంద్రబాబు నాయుణ్ని ఏపీ ప్రభుత్వమై వేధించుకు తింటోందని జాతీయ మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా ప్రచారం చేసి.. వైఎస్సార్‌సీపీ ప్రతిష్ఠ దెబ్బతీయాలని టీడీపీ నేతలు  స్కెచ్ గీశారు.

✍️చంద్రబాబు నాయుడి ఆదేశాలతోనే నారా లోకేష్ అమాంతం ఢిల్లీ వెళ్లారు. అక్కడ జాతీయ మీడియాలో మాట్లాడుతూ  స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో  తన తండ్రిని  అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. అయితే టీడీపీకి ఎప్పుడూ అనుకూలంగా వ్యవహరించే ఆ జాతీయ ఛానెల్ లోనూ..   షో రన్ చేసే ప్రెజంటర్ అడిగిన ప్రశ్నలు లోకేష్‌కు ముళ్లల్లా గుచ్చుకున్నాయి.

ప్రైవేటు కంపెనీతో  ఒప్పందం చేసుకున్న   చంద్రబాబు ప్రభుత్వం ముందస్తుగా రూ. 371 కోట్లు ఎందుకు విడుదల చేసింది? అది అక్రమమే కదా అని  అర్నబ్ గోస్వామి  ప్రశ్నిస్తే లోకేష్ నీళ్లు నమిలారు. అసలు ఈ ఒప్పందం చూస్తోంటే   ఇది సజావుగా  చేసుకున్నట్లు కనపడ్డం లేదని అర్నబ్ గోస్వామి అనేసరికి లోకేష్‌కు ముచ్చెమటలు పట్టాయి. అనవసరంగా ఢిల్లీ వచ్చి అర్నబ్ ఛానెల్ లో డిబేట్ లో పాల్గొన్నానేమో అని లోకేష్  కుమిలిపోవలసి వచ్చింది.

✍️ఈ భంగపాటు చాలదన్నట్లు  అవినీతిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన చంద్రబాబు తనయుడే ఢిల్లీ వెళ్లి తమని వేధిస్తున్నారని యాగీ చేయడంతో.. ఏపీ సీఐడీ కూడా ఈ కుంభకోణంలో చంద్రబాబు  ఎంత స్కిల్ చూపించారో జాతీయ మీడియా ద్వారా దేశమంతటికీ తెలిసేలా చేయాలని నిర్ణయించుకున్నారు. సీఐడీ చీఫ్ తో పాటు ఈ కేసులో సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్  పొన్నవోలు సుధాకర రెడ్డి కూడా ఢిల్లీలో   ప్రెస్‌ మీట్ పెట్టి  జాతీయ మీడియా కు   మొత్తం కుంభకోణాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించారు. చంద్రబాబు నాయుడు ఎలా షెల్ కంపెనీల ద్వారా డబ్బులు తన ఇంటికి రప్పించుకున్నారో  ఆధారాలతో సహా వివరించారు.

అప్పటిదాకా ఒకటీ అరా ఆంగ్ల పత్రికల్లోనే  వచ్చిన స్కిల్ కార్పొరేషన్  లూటీ గురించి..  ఈ ప్రెస్ మీట్ ద్వారా దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరికీ  స్పష్టంగా అర్దమయ్యేలా చెప్పారు. దీంతో టీడీపీ పరువు యమునా నదిలో  కలిసిపోయింది. టీడీపీ నేతలు ఒకటి తలిస్తే  దైవం ఇంకొకటి తలచినట్లు..   ఏపీ ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనుకుంటే.. చేసిన రెండు ప్రయత్నాలూ టీడీపీ ప్రతిష్ఠనే మసకబారేలా చేశాయి.

✍️ఇక పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్  అనవసరంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాంను కెలికి.. చంద్రబాబు నాయుణ్ని  అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. దానికి  వైఎస్సార్‌ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డి గట్టి కౌంటర్ ఇవ్వడమే కాకుండా చంద్రబాబు నాయుడు ఏవిధంగా అవినీతికి పాల్పడ్డారో షెల్ కంపెనీల ద్వారా ఎలా దోచుకున్నారో వివరించారు. గల్లా జయదేవ్ కొన్ని సెకన్లు మాట్లాడితే.. చంద్రబాబు దోపిడీ గురించి  మిథున్ రెడ్డి  నిముషానికి పైగా  వివరించడంతో టీడీపీ పరువు పోయింది. చంద్రబాబు అక్రమాల గురించి జనంలోకి బాగా వెళ్లింది. ఈ మూడు  నిర్ణయాలూ కచ్చితంగా సెల్ఫ్ గోల్సే .

:::CNS యాజులు, సీనియర్‌ జర్నలిస్టు

Advertisement
Advertisement