వ్యూహకర్తలు హ్యాండ్సప్‌.. జారిన జాకీలు! | Sakshi
Sakshi News home page

వ్యూహకర్తలు హ్యాండ్సప్‌.. జారిన జాకీలు!

Published Thu, Apr 18 2024 3:51 AM

TDP strategist Robin Sharma decide Chandrababu Not Have Stregnth In Public - Sakshi

విశ్వసనీయత లేని చంద్రబాబుకు జనాదరణ లేదని తేల్చిన రాబిన్‌ శర్మ బృందం 

జనసేన, బీజేపీతో అసహజ పొత్తు వల్ల నష్టమే కానీ లాభం లేదు 

మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కష్టమేనన్న సర్వేలు 

సీట్లు అమ్ముకుంటే ఎన్నికల్లో ఎలా గెలుస్తారని రాబిన్‌ నిర్వేదం.. సర్వేలు, స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా సీట్లిచ్చారు 

పార్టీ కోసం పని చేసిన వారిని పక్కనపెట్టి.. ధనవంతులకే సీట్లు 

క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించినా పట్టించుకోనప్పుడు మేమెందుకు? 

తమ ప్రయత్నాలు అంతా వృథా అయ్యాయని ఆక్రోశం 

రాబిన్‌ శర్మ చేతులెత్తేయడంతో పీకేని రంగంలోకి దించిన బాబు 

పీకే మధ్యవర్తిత్వంతో అయిష్టంగా పనిచేస్తున్న రాబిన్‌ బృందం  

 సాక్షి, అమరావతి:  ఎన్ని ఎత్తుగడలు వేసినా.. ఎంత హైప్‌ ఇచ్చినా.. జాకీల నుంచి పొక్లెయిన్ల దాకా అన్నీ వాడి చూసినా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గ్రాఫ్‌ ఏమాత్రం పెరగడం లేదని పార్టీ వ్యూహకర్తలు తేల్చేశారు! తాము చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదని, ఎన్నికల్లో టీడీపీ గెలుపు దుర్లభమని పార్టీ ప్రధాన వ్యూహకర్త రాబిన్‌ శర్మ చేతులెత్తేశారు. టీడీపీ ముఖ్య నేతల్లో ఇప్పుడు ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. చంద్రబాబుకు ఏమాత్రం విశ్వసనీయత లేకపోవడమే అసలు సమస్య అని రాబిన్‌ బృందం తేల్చింది.

ప్రజలు ఆయన చెప్పే మాటలను నమ్మడం లేదని, అందువల్లే ఆరు నెలల ముందే విడుదల చేసిన శాంపిల్‌ మేనిఫెస్టో నిష్ఫలంగా మారిందనే అంచనాకు వచ్చారు. ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి ఎంత ఊదరగొట్టినా, ఇంటింటికీ తిరిగి రిజిస్ట్రేషన్ల కోసం వేడుకున్నా జనం పట్టించుకోలేదని వారి సర్వేల్లో తేలింది.

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం, మాట నిలబెట్టుకోకపోవడం వల్లే చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీలు నమ్మదగ్గవి కావనే అభిప్రాయం ప్రజల్లో నెలకొన్నట్లు గుర్తించారు. మరోవైపు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన అన్ని పనులను సీఎం అయ్యాక చేయడం, 99 శాతం హామీలను అమలు చేయడంతో ప్రజల్లో ఆయన పట్ల విశ్వసనీయత బలంగా నాటుకుందని నిర్థారించుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఎంత గొప్ప పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నమ్మబలికినా జనం నమ్మే అవకాశాలు లేవనే అంచనాకు వచ్చారు.  
 
పొత్తు బెడిసికొట్టింది.. ఓట్ల బదిలీ అసాధ్యం  
బీజేపీ, జనసేనతో టీడీపీ కుదుర్చుకున్న అవకాశవాద పొత్తు బెడిసికొట్టినట్లు రాబిన్‌ శర్మ సర్వేలు తేల్చినట్లు సమాచారం. రాజకీయ అవసరాల కోసం కుదుర్చుకున్న అసహజ పొత్తుగా ప్రజలు దీన్ని గుర్తించినట్లు గ్రహించారు. పొత్తులతో సీట్ల సర్దుబాటు కూడా ఆశాజనకంగా లేదని వెల్లడైంది. దీంతో ఏ రకంగా చూసినా టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఓట్ల బదలాయింపు సాధ్యం కాదని తేలింది. నియోజకవర్గాల స్థాయిలో మూడు పార్టీలు కలవలేదని, జనసేన ఓట్లు టీడీపీకి వచ్చే అవకాశాలు చాలా స్వల్పమేనని అంచనా వేశారు.

పొత్తు కుదిరాక పవన్‌ కళ్యాణ్‌ బలహీనంగా మారడంతో ఆయనకున్న కొద్దిపాటి ఓటు బ్యాంకుకు గండి పడుతున్నట్లు నిర్థారించుకున్నారు. ఇక బీజేపీకి ఉన్న ఓట్లే తక్కువ కావడంతోపాటు అవి టీడీపీకి బదిలీ అవడం కష్టమేనని తేల్చారు. బీజేపీతో కలవడం వల్ల టీడీపీకి ఉన్న స్వల్ప మైనారిటీల ఓట్లు కూడా దూరమైనట్లు గుర్తించారు. జనసేన, బీజేపీకి కేటాయించిన 31 సీట్లలో ఆ పార్టీలు గెలిచే సీట్లు అరడజను కూడా లేవని వారి సర్వేలో నిర్థారణ అయినట్లు సమాచారం.  
 
అమ్ముకుంటే గెలిచేది ఎలా? 
అనేక సీట్లను తాము సూచించిన వారికి కాకుండా బయట వ్యక్తులకు కేటాయించడాన్ని రాబిన్‌ శర్మ తీవ్రంగా తప్పబట్టినట్లు తెలిసింది. నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు, పలు సమీకరణాలు, రకరకాల పొందికల ఆధారంగా తాము ప్రతిపాదించిన వారికి సీట్లు ఇవ్వకపోవడం ప్రధాన తప్పిదంగా ఆయన ప్రస్తావిస్తున్నారు. సర్వేలను పట్టించుకోకుండా, పార్టీ కోసం పని చేసిన వారిని వదిలేసి బయట వ్యక్తులకు సీట్లు ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. డబ్బు మూటలతో అప్పటికప్పుడు దిగిన ఎన్నారైలు,  పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు సీట్లు అమ్ముకుంటే ఇక గెలవడం ఎలా సాధ్యమని ఆయన నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం అర్బన్‌ సీటును పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న ప్రభాకర చౌదరికి కాకుండా పెద్దగా తెలియని దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌కి కేటాయించడంపై రగడ జరిగిన విషయం తెలిసిందే. ఇలా బయట వ్యక్తులకు సీట్లు ఇచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాలు 30 వరకూ ఉన్నట్లు రాబిన్‌ శర్మ చెబుతున్నారు. స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా 8 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏలూరు ఎంపీ స్థానాన్ని రాయలసీమకు చెందిన వ్యక్తికి ఇవ్వడం లాంటి అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. తాము చేసిన సర్వేలు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు విరుద్ధంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ నిర్ణయాలు తీసుకున్నారని, దీంతో తమ బృందాలు మూడేళ్లుగా పడ్డ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరులా వృథా అయిందని రాబిన్‌ బృందం వాపోతున్నట్లు సమాచారం.  
 
దిద్దుకోలేని తప్పులు.. గెలవడం దుర్లభం 
తమ వ్యూహాలకు అనుగుణంగా పార్టీ నడుచుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల దిద్దుకోలేని తప్పులు జరిగాయని రాబిన్‌ శర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీతో కలిసి పని చేయడంలో అర్థం లేదని ఆయన తేల్చి చెప్పడంతో చంద్రబాబు బుజ్జగించి కొద్దిరోజులు ఆపినట్లు తెలిసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, తీసుకున్న నిర్ణయాలపైనా రాబిన్‌ బృందం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన చంద్రబాబు తన పలుకుబడి ఉపయోగించి రాబిన్‌ శర్మ గురువైన ప్రశాంత్‌ కిశోర్‌ను పిలిచి మధ్యవర్తిత్వం చేయాలని కోరారు. దీంతో పీకే జోక్యం చేసుకుని సర్దుబాటు చేయడంతో ప్రస్తుతం అయిష్టంగానే రాబిన్‌ శర్మ బృందం టీడీపీ కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే సందర్భంలో పీకే సైతం సంక్షేమ పథకాలు, విశ్వసనీయత విషయాల్లో సీఎం జగన్‌తో చంద్రబాబు పోటీ పడలేరని చెప్పినట్లు తెలిసింది. వ్యూహకర్తలు ఇచ్చిన ఈ షాకులతో చంద్రబాబు అయోమయంలో మునిగిపోయారు. రాబిన్‌ శర్మ చెప్పినట్లు అభ్యర్థులను మార్చలేక, కొనసాగించలేక సతమతమవుతున్నారు. అభ్యర్థులను మార్చాలంటే లోకేష్‌ వారి వద్ద నుంచి రూ.కోట్లలో వసూలు చేసిన డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలి. అందుకు చినబాబు ససేమిరా అనడంతో చంద్రబాబు కక్కలేక మింగలేక మిన్నకుండిపోయారు.    

Advertisement
Advertisement