Sakshi News home page

ఎలక్షన్స్‌ వచ్చినపుడే టికెట్‌ అనేది పాత ముచ్చట.. ఇప్పుడు మా ముచ్చట ఇనుకోండ్రి!

Published Fri, Jul 28 2023 4:19 PM

Telangana Assembly Elections 2023 Nalgonda BC Leaders Expecting Tickets - Sakshi

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీలకు అతీతంగా బీసీ నేతలు ఏకమవుతున్నారా? తమకూ ఒక అవకాశం ఇవ్వాలని తమ పార్టీలను కోరుతున్నారా? పోటీ చేయడానికి తగిన గ్రౌండ్ చేసుకుంటున్నారా? ఇంతకీ టిక్కెట్లు ఆశిస్తున్న బీసీ నేతలు ఎవరు? ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నారు? పార్టీలు బీసీ నేతల్ని ప్రోత్సహించడానికి సిద్దంగా ఉన్నాయా? వివరాలేంటో చూద్దాం..

ఉమ్మడి నల్గొండ రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న జిల్లా. అయితే ఇక్కడ పార్టీ ఏదైనా రెడ్డి సామాజికవర్గానిదే పై చేయిగా ఉంటుంది. అయితే జిల్లాలోని కొందరు బీసీ నేతలు తమకూ ఓ ఛాన్స్‌ ఇవ్వాలని కోరుతున్నారట. అప్పటికప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోరితే లాభం ఉండదనే ఉద్దేశంతో రెండు మూడేళ్లుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట.

సామాజిక కార్యక్రమాలతో ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారట. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం పోటీ పడుతున్న బీసీ నేతల సంఖ్య పెరిగిపోయిందట. అధికార బీఆర్ఎస్‌లోనే బీసీ నేతల పోటీ ఎక్కువగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. 

బీర్లకు చేయి అందిస్తే..
యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్ తనకే ఇవ్వాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య కోరుతున్నారు. గత మూడున్నరేళ్లుగా నియోజకవర్గ కాంగ్రెస్‌కు అన్నీ తానై వ్యవహరిస్తున్నానని ఆయన అంటున్నారు. 

పార్టీ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై పనిచేస్తున్నారు. తన పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు కులవృత్తులవారికి పనిముట్లను పంపిణీ చేస్తూ వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేటాయించే స్థానం ఆలేరు ఒక్కటే అన్న ప్రచారం సాగుతోంది. మిగతా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఓసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు ఉండటంతో వారిని కాదని అక్కడ బీసీలకు సీటు ఇచ్చే అవకాశం లేదు. ఇది అయిలయ్యకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. 
(మణిపూర్‌ ఘటనే కనిపిస్తోందా?.. పార్లమెంట్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాధితురాలు)

మునుగోడుపై రవి ఆశలు
మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి నారబోయిన రవి టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన భార్య జెడ్పీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రవి ఉప ఎన్నికల సందర్భంలో కూడా టిక్కెట్ ఆశించారు. ఆశావహుల లిస్ట్‌లో కూడా ఆయన పేరు ప్రముఖంగానే వినిపించింది. 

నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి 38 వేల వరకు ఓట్లు ఉన్నాయని తనకు అవకాశం ఇవ్వాలని జిల్లా మంత్రితో పాటు అధిష్టాన పెద్దలను కూడా నారబోయిన రవి కోరుతున్నారట. ఇప్పటికే ఆయన నియోజకవర్గం అంతా వాల్ రైటింగ్ విస్తృతంగా రాయించడంతో పాటు పోస్టర్లు కూడా ఖాళీ లేకుండా అతికిస్తూ జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.  

ఉత్తమ్‌ కాదంటే నాకే!
కోదాడ నియోజకవర్గంలో మొదటి నుంచి గులాబీ టికెట్ ఆశిస్తున్నవారిలో వనపర్తి లక్ష్మీనారాయణ ఒకరు. ఈయన పెరిక సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్నారు. లక్ష్మీనారాయణ భార్య శిరీష కోదాడ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా కొనసాగుతున్నారు. 

గత నాలుగేళ్లుగా కోదాడ టికెట్ ఆశిస్తూ లక్ష్మీనారాయణ అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గపు ఓట్లు కూడా నిర్ణయాత్మకంగా ఉండటంతో తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని లక్ష్మీనారాయణ నమ్మకం.

కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, ఆయన్ను మార్చి మరో వ్యక్తికి టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఒకవేళ మల్లయ్యను మారిస్తే మాత్రం తనను పరిగణలోకి తీసుకోవాలని పార్టీ పెద్దల వద్ద లక్ష్మీనారాయణ ప్రస్తావిస్తున్నారట. 

టికెట్‌ ఇవ్వకపోతే.. సెపరేట్‌ రూట్‌
హుజూర్ నగర్‌లో పిల్లుట్ల రఘు అనే సామాజిక కార్యకర్త కూడా ఎప్పటి నుంచో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ ప్లాన్ లో భాగంగానే నియోజకవర్గంలో గత నాలుగేళ్లుగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఎవరు టికెట్ ఇచ్చినా పోటీ చేసేందుకు ప్రణాళిక తయారు చేసుకుంటున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలను కలిసి తన కోరిక వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ నియోజకవర్గం నుంచి ఉత్తమ్‌కుమార్‌ను కాదని రఘుకు టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదనేది బహిరంగ విషయమే. 
(చదవండి: ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు)

ఒకవేళ కుటుంబంలో ఒకరికే టికెట్ అనే కాంగ్రెస్ సూత్రంలో భాగంగా ఉత్తమ్ ఫ్యామిలీలో ఒకరికే టికెట్ ఆయన హుజూర్ నగర్‌లో కాకుండా కోదాడలో పోటీ చేయొచ్చని.. అలా జరిగితే తనకు అవకాశం ఇవ్వాలని రఘు కోరుతున్నారట. కాంగ్రెస్ నాయకత్వం ఆయన అభ్యర్థనను ఏవిధంగా తీసుకుంటుదనేది కీలకంగా మారనుంది.

మరోవైపు మిగిలిన పార్టీల నేతలను కూడా కలిసి తాను చేసిన సామాజిక కార్యక్రమాలను చెప్తూ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. ఏ పార్టీ నుంచి అవకాశం రాకపోతే ఇండిపెండెంట్‌గా అయినా బరిలో దిగేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీలకు అతీతంగా బీసీ నేతలు టికెట్ రేసులోకి దూసుకువస్తున్నారు. పార్టీలు అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని ప్రకటించడంతో జిల్లా రాజకీయాలు రంజుగా మారనున్నాయి.
-సాక్షి, పొలిటికల్‌ డెస్క్‌.

Advertisement

తప్పక చదవండి

Advertisement