తెలంగాణలో అధికారంలోకి వస్తాం

23 Nov, 2023 04:39 IST|Sakshi

బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి

సూర్యాపేట: తెలంగాణలో ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ నాయకత్వంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని బహుజన సమాజ్‌ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సూర్యాపేట మండలంలోని గాం«దీనగర్‌లో బహుజన రాజ్యాధికార సభ నిర్వహించారు. ఈ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌.. అన్నీ సంపన్న వర్గాల కోసం నడుస్తున్న పార్టీలని అన్నారు.

కానీ బీఎస్పీ ఒక్కటే బహుజన వర్గాల కోసం ప్రజల విరాళాలతో పనిచేస్తోందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకుని నడుస్తున్న ఏకైక పార్టీ బీఎస్పీ అని చెప్పారు. దేశంలో మిగిలిన పార్టీలన్నీ ఓట్ల ముందు తాయిలాలు ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. ఇది గమనించిన వట్టె జానయ్య యాదవ్‌ లాంటి వారు బహుజన జెండాను ఎత్తుకోవడం ఆహా్వనించదగిన పరిణామమని అన్నారు. వట్టె జానయ్యపై జరిగిన దాడి యాదృచ్ఛికం కాదని.. అది బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు జరిపించిన వ్యూహాత్మక దాడి అని ఆరోపించారు. ‘మేము తక్కువగా చెప్పి.. ఎక్కువగా పనిచేస్తాం’అని పేర్కొన్నారు.

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ 1,300 మంది విద్యార్థుల ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం భోగాలు అనుభవిస్తోందన్నారు. అమరవీరుల కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో కూడా కేసీఆర్‌కు తెలియకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో గడీల పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. సభలో సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థి వట్టె జానయ్యయాదవ్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు