ఎక్కడి వారు అక్కడే.. గప్‌ చుప్‌! | Sakshi
Sakshi News home page

ఎక్కడి వారు అక్కడే.. గప్‌ చుప్‌!

Published Sat, Oct 14 2023 1:40 AM

- - Sakshi

రాజన్న సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడే తనిఖీలు.. సోదాలతో పోలీస్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇతర జిల్లాల నుంచి డబ్బు, మద్యం జిల్లాలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ జిల్లాకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ నిరంతరం ఎన్నికల నిర్వహణపై ఉద్యోగులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్‌.. ఆఫ్‌లైన్‌ నిఘా..!
జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో సోషల్‌ మీడియాతోపాటు ప్రత్యక్షంగా నిఘా పటిష్టం చేశారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో పరిశీలిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో పోలీస్‌శాఖ ఆద్వర్యంలో ప్రత్యేకంగా ఐదు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, గంభీరావుపేట మండలం పెద్దమ్మ, ముస్తాబాద్‌ మండలం బదనకల్‌, వేములవాడ మండలం ఫాజుల్‌నగర్‌, బోయినపల్లి మండలం నర్సింగాపూర్‌ చెక్‌పోస్టుల్లో 30 మంది రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు.

వాట్సాప్‌తోపాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో మెస్సేజ్‌లపై నిరంతర నిఘా పెట్టారు. గ్రూప్‌ అడ్మిన్స్‌ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సూచించారు.

ప్రత్యేక బృందాలు..
జిల్లాలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు జరుగకుండా పోలీస్‌, రెవెన్యూశాఖల అధికారులతో పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. ఎలక్షన్‌ నిర్వహణ ప కడ్బందీగా సాగడానికి ఎన్నికల నియమావళి అమలుకు కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌తోపాటు టోల్‌ఫ్రీ నంబర్‌ 1950 ఏర్పాటు చేశారు. ఎన్‌జీఆర్‌ఎస్‌, సీ విజిల్‌ యాప్‌కు వచ్చే ఫిర్యాదులపై స్పందించేలా ఆదేశాలిచ్చారు.

ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, స్టాటిస్టిక్‌ సర్వేలైన్స్‌, వీడియో సర్వేలైన్స్‌ మూడు చొప్పున పద్దెనిమిది బృందాలు పని చేస్తున్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి హెచ్చరించారు.

సోదాలు.. దాడులు!
► జిల్లాలోని అన్ని బెల్టు షాపుల కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు పోలీసులుసోదాలు చేస్తూ మద్యం సీజ్‌ చేస్తున్నారు.
► ఐదు చెక్‌పోస్టుల్లో రెండు షిఫ్టుల్లో సిబ్బంది జిల్లాకు వచ్చిపోయే వాహనాలు అన్నింటిని చెక్‌ చేస్తున్నారు.
► రూ.50వేలకు మించి నగదు తీసుకెళ్లడానికి ఆస్కారం లేదు కాబట్టి నగదు రవా ణాపై ప్రత్యేక దృష్టి సారించారు.
► ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల్లో పొలిటికల్‌ లీడర్స్‌ ఫొటోలు, ప్రకటలు లేకుండా చూస్తున్నారు.
► జిల్లా నలుమూలల్లో ప్రత్యేక బలగాలు, అధికారులు నిరంతరం విధులు నిర్వర్తిస్తున్నారు.

Advertisement
Advertisement