Everyone Should Learn Life Lessons From Elon Musk Mistakes - Sakshi
Sakshi News home page

అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌ చేసిన తప్పిదాలివే! మీకు తెలుసా?

Published Sat, Nov 5 2022 9:31 PM

Life Lessons From Elon Musk Mistakes - Sakshi

ఎలన్‌ మస్క్‌.. విపరీతమైన ధోరణులతో నిత్యం వార్తల్లో నిలుస్తూ అశేష అభిమానుల్ని సంపాదించుకున్న మల్టీబిలియనీర్‌. ప్రపంచంలోనే అంత్యంత ధనవంతుడిగా.. నిత్యం ఏదో ఒకరంగా వార్తల్లో నిలుస్తూ సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుంటారు. అయితే.. చరిత్రలోనే విజయవంతమైన వ్యాపారిగా పేరు దక్కించుకున్న ఎలన్‌ మస్క్‌.. గుడ్డిగా అనుసరించడం ఏమాత్రం సరికాదన్నది మేధావులు అభిప్రాయం. అందుకు ఆయన చుట్టూరా ముసురుకునే వివాదాలే కారణం.  

1. అనవసరపు జోక్యాలు!

వ్యాపారంలో ఓర్పు చాలా అవసరం. అది లేకుంటే ఇబ్బందులు ఎదురుకాక తప్పదు. ఈ సోషల్‌ మీడియా కాలంలో విమర్శలను సైతం తేలికగా తీసుకోవాలి. కానీ, ఎలన్‌ మస్క్‌ అలా కాదు. తనపై వచ్చే విమర్శలతో పాటు తనకు సంబంధం లేని వ్యవహారాల్లోనూ జోక్యం ద్వారా వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ వివాదాలతోనూ వ్యాపారాలను దారుణంగా దెబ్బ తీశాడు కూడా!.

టెస్లాపై వివాదాస్పద కథనాలు ప్రచురిస్తున్న ఓ రైటర్‌కు.. స్వయంగా ఫోన్‌లు చేసిన మస్క్‌..  అంతుచూస్తానంటూ బెదిరింపులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. 

మీడియాలో టెస్లా ఆదాయం మీద వచ్చిన కథనాలపై అనుచితంగా కామెంట్లు చేయడంతో.. టెస్లా షేర్లు ఆరు శాతం ఢమాల్‌ అన్నాయి. 

ఇక.. 2018 థాయ్‌లాండ్‌ గుహలో చిక్కుకుపోయిన చిన్నారుల బృందాన్ని రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌ను ఉద్దేశించి మస్క్‌ చేసిన కామెంట్లు కలకలమే రేపాయి. బ్రిటిష్‌ డైవర్‌ను ఉద్దేశించి అనుచిత కామెంట్లు చేసి.. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొన్నాడు మస్క్‌. అయితే.. ఆ దావాలో మస్క్‌దే పైచేయి అయినా వ్యక్తిగతంగా మాత్రం ఎంతో డ్యామేజ్‌ జరిగింది. 

ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయ్‌ మస్క్‌ఖాతాలో.. సహనం ఎంతో అవసరం అనే పాఠం నేర్పిస్తుంటుంది ఇలాంటి సందర్భాల్లో!.

2. ఆదాయవ్యయాలను కనిపెట్టాల్సిందే!

ఆదాయం మాటొచ్చేసరికి ప్రముఖంగా వినిపించే పదం పొదుపు. అయితే.. అంతకు మించి ఆదాయవ్యయాలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ఉండాలి. అంతా సవ్యంగా ఉంటుందని అనుకుంటున్న టైంలోనూ ఆర్థికవసరాలు.. నిల్వకన్నా ఎక్కువ అవసరం పడొచ్చు. టెస్లా సీఈవో మస్క్‌.. నగదు ప్రవాహం అంచున ఉండడం అలవాటు చేసుకున్నాడు. బహుశా ఏ బిలీయనీర్‌ ఇలా డబ్బు రాకపోకల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉండడేమో!.

ముఖ్యంగా టెస్లా మోడల్‌ 3 టైంలో.. కంపెనీని చావో రేవో అనే స్థితికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో ఆర్థిక నిపుణులు పరిస్థితి ఇలాగే కొనసాగితే.. టెస్లా ఇబ్బందులు ఎదుర్కొవచ్చని సలహా ఇచ్చారు. ఒకానొక సమయంలో టెస్లా దివాలా తీసే స్థాయికి వచ్చిందంటూ మస్క్ స్వయంగా అంగీకరించాడు. బహుశా ఈ అనుభంతోనే.. నష్టాల్లో కొనసాగుతున్న ట్విటర్‌ను తిరిగి గాడిన పెట్టేందుకు సంస్కరణలకు శ్రీకారం చుట్టాడేమో. ఉద్యోగుల తొలగింపు అనే వివాదాస్పద నిర్ణయం ఇందులోనే భాగమేమో!.

వ్యాపారాల్లో వచ్చేపోయే ఆదాయం కోసం ఒక ప్రణాళికను అభివృద్ధి చేయాలి. అంతా సవ్యంగా ఉన్న సమయాల్లో.. ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తే పరిస్థితి మరోలా మారవచ్చనే పాఠం ఎలన్‌ మస్క్‌ నేర్పించాడు కూడా.

3. తొందరపాటు వద్దు

ట్విటర్‌తో సాగిన డీల్‌ ఇందుకు పెద్ద ఉదాహరణ. ఏప్రిల్‌ 2022లో.. ఓ ఇంటర్వ్యూలో ట్విటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ఆలోచన బయటపెట్టాడు. ఆ తర్వాత అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాడు. అయితే.. ఫేక్‌ అకౌంట్ల తాకిడి మరీ ఎక్కువగా ఉందని గుర్తించి.. ఈ డీల్‌ గాడికి ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సుమారు 40 బిలియన్‌ డాలర్లకు పైగా విలువైన ఒప్పందం.. అదీ అర్థాంతరంగా ఆగిపోయిందని జోరుగా చర్చ నడిచింది. ఆపై స్వయంగా మస్క్‌ ఒప్పంద రద్దు ప్రకటన చేయడంతో.. ట్విటర్‌ ఆయన మీద దావాకు కూడా సిద్ధమైంది. ఈ తరుణంలో గత్యంతరంగా లేనిస్థితిలోనే అనూహ్యంగా ట్విటర్‌ డీల్‌ను క్లోజ్‌ చేసి టేక్‌ఓవర్‌ చేశాడు మస్క్‌. 

ఎలన్‌ మస్క్‌-ట్విటర్‌ డీల్‌ నేర్పే పాఠం.. ఎలాంటి వ్యవహారాల్లోనైనా తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం. ముఖ్యంగా ఆర్థిక సంబంధ వ్యవహారాల్లో. ఒకటికి పదిసార్లు అన్నీ కూలంకశంగా పరిశీలించుకున్నాకే ముందుకెళ్లాలి. 

4. సోషల్‌ మీడియా వాడకం

ఎలన్‌ మస్క్‌ విషయంలో అత్యంత చర్చనీయాంశం ఇదే. పదకొండున్నర కోట్ల మంది యూజర్లు ట్విటర్‌లో ఆయన్ని ఫాలో అవుతున్నారు. ఇక సీక్రెట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ సంగతి మాత్రం ఒక మిస్టరీ!. సోషల్‌ మీడియాలో ఆయన వైఖరి.. ఎప్పటికప్పుడు హాట్‌ టాపిక్‌. పోటీదారు కంపెనీలపై చేసే వెకిలి కామెంట్లు.. విభిన్నంగా చేసే ప్రమోషన్లు, నర్మగర్భంగా నడిపించే వ్యవహారాలు.. ఎలన్‌ మస్క్‌ గురించి నెటిజన్స్‌లో ఒకరకమైన క్యూరియాసిటీని క్రియేట్‌ చేశాయి. అయితే.. 

ఊహకందని చేష్టలతో ‘థగ్‌ లైఫ్‌’ ట్యాగ్‌ తగిలించుకున్న ఎలన్‌ మస్క్‌.. అదే సోషల్‌ మీడియా ద్వారా వివాదాల్లో నిలుస్తుంటాడు. మీమ్స్‌, కుళ్లు జోకులు, డబుల్‌ మీనింగ్‌ డైలాగులు.. ఒక్కోసారి స్థాయిని దాటేసి విమర్శలకు దారి తీస్తుంటాయి కూడా. అయితే స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేసే వంకతో సోషల్‌ మీడియాలో ఆయన చేసే పనులు.. ఆయన్ని చిక్కుల్లో పడేసిన సందర్భాలు కోకొల్లలు. తద్వారా ఆయనకి ఆర్థికంగా జరిగిన నష్టమే ఎక్కువ కూడా!.

సోషల్‌ మీడియా పవర్‌ఫుల్‌ టూల్‌.  ఆ విషయం తన ఫాలోయింగ్‌ ద్వారా మస్క్‌ ఏనాడో అర్థం చేసుకుని ఉండొచ్చు. అయితే అది సహేతుకంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండాలనే మంత్రాన్ని మస్క్‌ ఏనాడూ జపించింది లేదు. అందుకే ఏదైనా లిమిట్‌లో ఉండాలని పెద్దలు అంటుంటారు. అది సోషల్‌ మీడియా వాడకం అయినా కూడా!. 

5. నిశిత పరిశీలన.. ముందు జాగ్రత్త

ఓవర్‌కాన్ఫిడెన్స్‌.. జీవితంలో కొంప ముంచే ప్రధాన అంశం. విజయానికి ఇదొక అడ్డుపుల్లగా కూడా అభివర్ణించాడు తత్వవేత్త అరిస్టాటిల్‌. 2019లో టెస్లా సైబర్‌ ట్రక్‌ను ఆవిష్కరించే క్రమంలో.. ఇదొక బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనమని, కావాలంటే పరీక్షించుకోవాలని సవాల్‌ విసిరాడు మస్క్‌. అయితే.. పరీక్షలో ఓ పెద్ద బేరింగ్‌ రాయి విసరగా.. అది బద్ధలైంది. హ్యూమనాయిడ్‌ రోబో ‘ఆప్టిమస్‌’ దాదాపు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది ఎలన్‌ మస్క్‌కి. 

లక్ష్యాలు నిర్ధేశించుకోవడం తప్పేం కాదు. కానీ, నిశిత పరిశీలన తప్పనిసరి. సాధ్యాసాధ్యాలను అంచనా వేసుకోవడంలో తప్పు జరిగితే అది విఫలం వైపు అడుగులు వేయిస్తుంది. భారీ ఎత్తున్న నష్టం కూడా కలగజేస్తుంది. పరిశీలన.. ముందుజాగ్రత్తలు లేకుంటే ఎలన్‌ మస్క్‌కు ఎదురైన నష్టం.. అవమానాలు ఎవరికైనా ఎదురుకావొచ్చు. 

ఎలన్‌ మస్క్‌.. ఓ అసాధారణ వ్యక్తి. ముమ్మాటికీ ఓ అపారమేధావే. లేకుంటే టెస్లా, స్పేస్‌ఎక్స్‌.. ఇలాంటివి ప్రపంచాన్ని శాసించేవా?. విచిత్రమైన ఆలోచనలు ఆచరణలోకి వచ్చేవా?.. సంపాదనలో అతన్ని కొట్టేవాళ్లు దరిదాపుల్లో లేరు కావొచ్చు. కానీ, ప్రతీ మనిషిలో కొన్ని లోపాలు ఉంటాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆయన ఎంత గొప్ప సాధించిన ఆయన జీవితం నుంచి లోపాలను మినహాయించుకోవడం.. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగితే మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా విజయాల్ని అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.

Advertisement
Advertisement