దూసుకొచ్చిన మృత్యువు.. రక్షించేందుకు సోదరుడి యత్నం.. ఆపై..

23 Jul, 2023 06:34 IST|Sakshi

మెదక్‌: వరినాట్ల పనుల్లో నిమగ్నమైన అన్నదమ్ములపై దమ్ముయంత్రం (కెజివీల్స్‌ ట్రాక్టర్‌) మృత్యురూపంలో దూసుకొచ్చింది. దీంతో తమ్ముడు మృతి చెందగా.. అన్న తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా శివ్వంపేటలో శనివారం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన ఎనగండ్ల నరేశ్‌, తమ్ముడు ఎనగండ్ల రమేశ్‌(35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం వరినాట్లు వేసేందుకు దుక్కి సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. రమేశ్‌ వొరం చదును చేస్తున్న సమయంలో మూర్చవ్యాధితో బురదమడిలో పడికొట్టుకుంటున్నాడు. అక్కడే దమ్ము యంత్రం నడుపుతున్న నరేశ్‌ గమనించి తమ్ముడిని రక్షించేందుకు ట్రాక్టర్‌ను ఆఫ్‌ చేయకుండానే కిందికి దూకి పరుగెత్తుకుంటూ వచ్చాడు.

దీంతో ట్రాక్టర్‌ ఒక్కసారిగా రమేశ్‌ తలపై, నరేశ్‌ కాళ్లపై నుంచి వెళ్లడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న కూలీలు ఇద్దరిని తూప్రాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా రమేశ్‌ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నరేశ్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం కొంపల్లిలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు