TS Siddipet Assembly Constituency: TS Election 2023: సిద్దిపేటపై అక్కసు ఎందుకు? విపక్షాలపై మంత్రి హరీశ్‌రావు ఫైర్‌..!
Sakshi News home page

TS Election 2023: సిద్దిపేటపై అక్కసు ఎందుకు? విపక్షాలపై మంత్రి హరీశ్‌రావు ఫైర్‌..!

Published Tue, Sep 12 2023 5:40 AM

- - Sakshi

సిద్దిపేట: సిద్దిపేట అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో సామూహిక భవనాల నిర్మాణం కోసం రూ.1.20కోట్ల ప్రొసీడింగ్‌ పత్రాలను పంపిణీ చేశారు. పత్తి మార్కెట్‌ యార్డులో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాడు సమైక్య పాలనలో సిద్దిపేట గోస పడిందని, స్వరాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక పోతున్నారని చెప్పారు. అన్నీ సిద్దిపేట, గజ్వేల్‌ ప్రాంతాలకేనా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఉద్యమంలో సిద్దిపేట ప్రజలు పాల్గొన్న సమయంలో కాంగ్రెస్‌, బీజేపీలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఉద్యమాన్ని ముందు ఉండి నడిపిన గడ్డ సిద్దిపేట అని, అప్పుడు ముందు ఉన్నాం.. ఇప్పుడూ అభివృద్ధిలో ముందుంటామని చెప్పారు.

రాబోయే రోజుల్లో బాజాప్త మరింత ప్రగతి సాధిస్తామన్నారు. అరవై ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదేళ్లలో జరిగిందన్నారు. ఈనెల 15న సిద్దిపేటకు రైలు రానుందని వెల్లడించారు. దసరాకు వెయ్యి పడకల ఆస్పత్రి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. తల్లిదండ్రుల కంటే పిల్లలు ఉపాధ్యాయుల వద్దనే ఎక్కువ సమయం గడుపుతారని, ఎంత ఎత్తుకు ఎదిగినా విద్య నేర్పిన గురువును మరువొద్దని ఉద్బోధించారు.

దేశానికి మోడల్‌గా తెలంగాణ..
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికి మోడల్‌గా నిలుస్తుందని హరీశ్‌రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని రామంచ శివారులో నూతనంగా నిర్మించిన రంగనాయకస్వామి బీ ఫార్మసీ కళాశాలను సబితారెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు.

ఐటీ, వైద్య రంగంలో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు 3 లక్షల ఐటీ ఉద్యోగాలుంటే నేడు 10 లక్షలకు చేరిందన్నారు. ధాన్యం ఉత్పత్తిలోనూ మొదటి స్థానంలో ఉందన్నారు. 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ అని, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరంట్‌ ఇవ్వలేకపోతున్నారని పేర్కొన్నారు.

ఎస్‌ఈ కార్యాలయం ప్రారంభం..
పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ ఈఈ కార్యాలయ ప్రాంగణంలో ఎస్‌ఈ కార్యాలయాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, వైస్‌ చైర్మన్‌ రాజిరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌ రెడ్డి, సుడా చైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మంజుల, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజిత, పట్టణ అధ్యక్షుడు సంపత్‌, ఎంపీపీ మాణిక్యరెడ్డి, సర్పంచ్‌ సంతోషి, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, ఎస్‌ఈ జోగారెడ్డి, ఈఈ శ్రీనివాసరావు, జెడ్పీ వైస్‌ చైర్మెన్‌ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆలయ నిర్మానానికి రూ.50 లక్షలు..
అభివృద్ధిలో సిద్దిపేట రాష్ట్రానికి, తెలంగాణ దేశానికి ఆదర్శమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట అర్బన్‌ మండలం తడకపల్లిలో ముదిరాజ్‌, రెడ్డి, కురుమ, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, లైబ్రరీ భవనం, అంగన్వాడీ భవనం, రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తడకపల్లి ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని, లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గ్రామంలో రూ. 50 లక్షలతో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. సర్పంచ్‌ మంగ భాస్కర్‌, ఎంపీటీసీ శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ ఎల్లం, అర్బన్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు ఎద్దు యాదగిరి, ఎంఈఓ యాదవ రెడ్డి పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసి ఆదరించండి..
అభివృద్ధిని చూసి ఆదరించండని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఒకప్పుడు పని దొరకక వలసలు పోయిన మనం.. నేడు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకునే స్థాయికి ఎదిగామన్నారు. సోమవారం రాంపూర్‌లో ఓపెన్‌ జిమ్‌, సిద్దన్నపేట వరకు రోడ్డు, వడ్డెర కమ్యూనిటీహాల్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం రైతులకు స్పింక్లర్లు పంపిణీ చేశారు. జేపీ తండాలో పంచాయతీ భవనం, ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉమా, సర్పంచ్‌లు లక్ష్మి, బిక్షపతినాయక్‌, పరశురాములు, లింగంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

హరీశ్‌తో పోటీ పడలేరు: సబిత..
సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు మెజార్టీతో ఎవరూ పోటీ కూడా పడే పరిస్థితిలో ఉండరని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. దేశానికి అభివృద్ధిలో తెలంగాణనే మోడల్‌ అంటే.. తెలంగాణకే సిద్దిపేట మోడల్‌గా నిలిచిందని కితాబిచ్చారు. ఉద్యమంలో ఏదైతే తపన, ఆరాటం ఉండేదో ఇప్పుడు కూడా అదే స్ఫూర్తి హరీశ్‌రావు ఉన్నారన్నారు. తొమ్మిదేళ్లలో వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. త్వరలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Advertisement
Advertisement