Sakshi News home page

APL 2 Winner: టైటిల్ విజేత రాయలసీమ కింగ్స్

Published Sun, Aug 27 2023 9:27 PM

Andhra Premier League 2023 Final: Rayalaseema Beat Coastal Riders won Title - Sakshi

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 విజేతగా రాయలసీమ కింగ్స్ అవతరించింది. ఆదివారం నాటి ఫైనల్లో కోస్టల్ రైడర్స్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  విశాఖపట్నంలోని డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో రాయలసీమ కింగ్స్ ఆదివారం కోస్టల్ రైడర్స్ తో తలపడింది.

టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న రాయలసీమ కింగ్స్ కోస్టల్ రైడర్స్ ను 155 పరుగులకు కట్టడి చేసింది. రైడర్స్ బ్యాటర్లలో ఓపెనర్ ధరణి కుమార్ 30 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

కింగ్స్ బౌలర్లలో షేక్ కలీముద్దీన్ మూడు వికెట్లతో చెలరేగాడు. హరీష్ శంకర్ రెడ్డి రెండు వికెట్లు తీయగా, జాగర్లపూడి రామ్, బోదాల వినయ్, కెప్టెన్ హనుమ విహారి తలా ఒక వికెట్ తీశారు.

లక్ష్య ఛేదనకు దిగిన రాయలసీమ కింగ్స్ కు ఓపెనర్ తోట శ్రావణ్ 24 పరుగులతో శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ కోగటం హనీష్ రెడ్డి డకౌట్ కాగా, వన్ డౌన్ బ్యాటర్ తన్నీరు వంశీకృష్ణ 3 పరుగులకే నిష్క్రమించాడు. ఇలా జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో హనుమ విహారి 29 బంతుల్లోనే 46 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. బోదాల కుమార్ 53 పరుగులతో అతడికి అండగా నిలిచాడు.

ఆఖరిలో గిరినాథ్ రెడ్డి 17 బంతుల్లో 29 పరుగులతో రాణించి విహారితో కలిసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో విజేడి (వి.జయదేవన్ సిస్టం) పద్ధతి ద్వారా విజేతను నిర్ణయించారు. 16.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసిన రాయలసీమ కింగ్స్ ఛాంపియన్ గా అవతరించింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోస్టల్ రైడర్స్ ను ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది.

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ స్కోర్లు
కోస్టల్ రైడర్స్- 155/8 (18 ఓవర్లు)
రాయలసీమ కింగ్స్- 160/5 (16.3 ఓవర్లు)

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

What’s your opinion

Advertisement