BAN VS ENG 3rd ODI: చరిత్ర సృష్టించిన షకీబ్‌ అల్‌ హసన్‌

7 Mar, 2023 07:41 IST|Sakshi

వైట్‌ బాల్‌ క్రికెట్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా చలామణి అవుతున్న బంగ్లాదేశ్‌ దిగ్గజ ఆటగాడు షకీబ్‌ అల్‌ హసన్‌ మరో అరుదైన రికార్డు సాధించాడు. చట్టోగ్రామ్‌ వేదికగా నిన్న (మార్చి 6) వరల్డ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన ((71 బంతుల్లో 75; 7 ఫోర్లు), (10-0-35-4))తో అదరగొట్టిన షకీబ్‌.. రెహాన్‌ అహ్మద్‌ వికెట్‌ పడగొట్టడం ద్వారా వన్డేల్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.

తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బంగ్లాదేశ్‌ బౌలర్‌గా, ఓవరాల్‌గా 14వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్రలో షకీబ్‌కు ముందు కేవలం ఇద్దరు మాత్రమే 200 వన్డే వికెట్ల మైలురాయిని అధిగమించారు. ముష్రఫే మోర్తజా 218 వన్డేల్లో 269 వికెట్లు, అబ్దుర్‌ రజాక్‌ 153 వన్డేల్లో 207 వికెట్లు పడగొట్టగా.. షకీబ్‌ 227 వన్డేల్లో 4.45 ఎకానమీ రేట్‌తో 300 వికెట్లు పడగొట్టాడు. 

ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక వన్డే వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో స్పిన్‌ దిగ్గజం, శ్రీలంక బౌలర్‌ ముత్తయ్య మురళీథరన్‌ (534) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత వసీం అక్రమ్‌ (502), వకార్‌ యూనిస్‌ (416), చమిందా వాస్‌ (400), షాహిద్‌ అఫ్రిది (395), షాన్‌ పొలాక్‌ (393), గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ (381), బ్రెట్‌ లీ (380), లసిత్‌ మలింగ (338), అనిల్‌ కుంబ్లే (337), సనత్‌ జయసూర్య (323), జవగల్‌ శ్రీనాథ్‌ (315), డేనియల్‌ వెటోరీ (305), షకీబ్‌ అల్‌ హసన్‌ (300), షేన్‌ వార్న్‌ (293) వరుసగా 2 నుంచి 15 స్థానాల్లో ఉన్నారు.

బంగ్లా-ఇంగ్లండ్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌ తొలి రెండు వన్డేల్లో గెలుపొందడంతో నామమాత్రంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆతిధ్య బంగ్లా జట్టు 48.5 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌటైంది. షాంటో (50), ముష్ఫికర్‌ రహీమ్‌ (70), షకీబ్‌ (75) అర్ధసెంచరీలతో రాణించారు. జోప్రా ఆర్చర్‌ 3, సామ్‌ కర్రన్‌, ఆదిల్‌ రషీద్‌ తలో 2 వికెట్లు, క్రిస్‌ వోక్స్‌, రెహాన్‌ అహ్మద్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

247 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి ఇంగ్లండ్‌.. షకీబ్‌ (4/35) విజృంబించడంతో 43.1 ఓవర్లలో 196 పరగులకు ఆలౌటై 50 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జేమ్స్‌ విన్స్‌ (38) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లా పర్యటనలో ఇంగ్లండ్‌ తదుపరి 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. మార్చి 9, 12, 14 తేదీల్లో 3 టీ20లు జరుగనున్నాయి. 

మరిన్ని వార్తలు