రైజర్స్‌... విన్నర్స్‌  | Sakshi
Sakshi News home page

రైజర్స్‌... విన్నర్స్‌ 

Published Sat, Apr 6 2024 1:46 AM

Chennai lost by 6 wickets on srh - Sakshi

సొంతగడ్డపై హైదరాబాద్‌కు మరో విజయం

6 వికెట్లతో చెన్నై పరాజయం

సన్‌రైజర్స్‌ బౌలర్ల సమష్టి ప్రదర్శన 

రాణించిన అభిషేక్‌ శర్మ, మార్క్‌రమ్‌  

ఉప్పల్‌ మైదానంలో ఒక్కసారిగా ఎంత మార్పు! గత మ్యాచ్‌లో రెండు జట్లు పోటీ పడి పరుగుల వరద పారించడంతో 38 సిక్సర్లతో ఏకంగా 523 పరుగులు నమోదయ్యాయి. కానీ ఇప్పుడు చెన్నై ఒక్కో పరుగు కోసం శ్రమించింది.

అసలు మెరుపులు, భారీ షాట్లే లేకుండా సాధారణ స్కోరుకే పరిమితమైంది. గత మ్యాచ్‌లో ఆడింది కాకుండా మరో పిచ్‌పై ఈ మ్యాచ్‌ జరిగినా... పిచ్‌కంటే కూడా సన్‌రైజర్స్‌ బౌలర్లు ప్రభావం చూపించి ప్రత్యర్థిని కట్టిపడేశారు.

నియంత్రణతో కూడిన తమ చక్కటి బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌ ఒకప్పటి తమ బలాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించడంలో హైదరాబాద్‌కు  ఇబ్బందీ ఎదురు కాలేదు. అభిషే శర్మ బలమైన పునాది వేశాక మార్క్‌రమ్‌ బ్యాటింగ్‌ జట్టును విజయం దిశగా నడిపించింది.   

సాక్షి, హైదరాబాద్‌: సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుసగా తమ రెండో మ్యాచ్‌లోనూ విజయాన్ని నమోదు చేసింది. తొలి పోరులో మెరుపు బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను శాసించిన జట్టు... ఇప్పుడు బౌలింగ్‌ బలంతో తమ ఖాతాలో మరో గెలుపును వేసుకుంది. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రైజర్స్‌ 6 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శివమ్‌ దూబే (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా... అజింక్య రహానే (30 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్‌), రవీంద్ర జడేజా (23 బంతుల్లో 31 నాటౌట్‌; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం హైదరాబాద్‌ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసింది.

అభిషే శర్మ (12 బంతుల్లో 37; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్క్‌రమ్‌ (36 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్‌), హెడ్‌ (24 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కుటుంబసభ్యులతో హాజరై మ్యాచ్‌ మొత్తాన్ని తిలకించారు. మ్యాచ్‌ ముగిశాక అభిషే శర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డును ఆయన అందజేశారు.  



రాణించిన దూబే... 
ఒక్క దూబే క్రీజ్‌లో ఉన్నంత సేపు మినహా మిగిలిన చెన్నై ఇన్నింగ్స్‌ మొత్తం పేలవంగా సాగింది. సన్‌రైజర్స్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌లో పరుగులు సాధించడంలో చెన్నై బ్యాటర్లు విఫలమయ్యారు. ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర (12) విఫలం కాగా... రుతురాజ్‌ గైక్వాడ్‌ (21 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడలేకపోయాడు. పవర్‌ప్లేలో జట్టు 48 పరుగులు చేసింది.

ఈ దశలో దూబే ధాటిని చూపించాడు. షహబాజ్, మర్కండే బౌలింగ్‌లలో ఒక్కో సిక్స్‌ బాదిన అతను నటరాజన్‌ ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టాడు. దూబే, రహానే 8 పరుగుల వ్యవధిలో వెనుదిరిగాక స్కోరు వేగం మరింత తగ్గిపోయింది.   

అలవోకగా... 
ఓపెనర్‌ అభిషే మెరుపు బ్యాటింగ్‌తో రైజర్స్‌కు ఘనారంభం అందించాడు. అతను చెలరేగుతుంటే హెడ్‌ ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాడు. ముకేశ్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో అభిషే 3 సిక్స్‌లు, 2 ఫోర్‌లు బాదడంతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. చహర్‌ ఓవర్లోనూ వరుసగా 6, 4 కొట్టిన అతను తర్వాతి బంతికి వెనుదిరిగాడు. అనంతరం హెడ్, మార్క్‌రమ్‌ కలిసి కొన్ని చక్కటి షాట్లతో వేగాన్ని కొనసాగించారు.

6 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 78 పరుగులకు చేరింది. హెడ్‌ను తీక్షణ వెనక్కి పంపించగా... 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే మార్క్‌రమ్‌ పెవిలియన్‌ చేరాడు. ఈ దశలో 36 బంతుల్లో 34 పరుగులే చేయాల్సి ఉండటంతో  హైదరాబాద్‌ అలవోకగా లక్ష్యం చేరింది. ఆంధ్ర ఆటగాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి (14 నాటౌట్‌) మరో 11 బంతులు మిగిలి ఉండగానే సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు.  

స్కోరు వివరాలు 
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రచిన్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) భువనేశ్వర్‌ 12; రుతురాజ్‌ (సి) సమద్‌ (బి) షహబాజ్‌ 26; రహానే (సి) మార్కండే (బి) ఉనాద్కట్‌ 35; దూబే (సి) భువనేశ్వర్‌ (బి) కమిన్స్‌ 45; జడేజా (నాటౌట్‌) 31; మిచెల్‌ (సి) సమద్‌ (బి) నటరాజన్‌ 13; ధోని (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–25, 2–54, 3–119, 4–127, 5–160. బౌలింగ్‌: 
అభిషే 1–0–7–0, భువనేశ్వర్‌ 4–0–28–1, నటరాజన్‌ 4–0–39–1, కమిన్స్‌ 4–0–29–1, మయాంక్‌ మార్కండే 2–0–21–0, షహబాజ్‌ అహ్మద్‌ 1–0–11–1, జైదేవ్‌ ఉనాద్కట్‌ 4–0–29–1.  

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) రచిన్‌ (బి) తీక్షణ 31; అభిషే (సి) జడేజా (బి) చహర్‌ 37; మార్క్‌రమ్‌ (ఎల్బీ) (బి) అలీ 50; షహబాజ్‌ (ఎల్బీ) (బి) అలీ 18; క్లాసెన్‌ (నాటౌట్‌) 10; నితీశ్‌ కుమార్‌ రెడ్డి (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు 6; æమొత్తం (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 166.  వికెట్ల పతనం: 1–46, 2–106, 3–132, 4–141. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 3.1–0– 32–1, ముకేశ్‌ చౌదరి 1–0–27–0, తీక్షణ 4–0–27–1, తుషార్‌ 2–0–20–0, రవీంద్ర జడేజా 4–0–30–0, మొయిన్‌ అలీ 3–0–23–2, రచిన్‌ రవీంద్ర 1–0–3–0.  

ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్‌ X  బెంగళూరు 
వేదిక: జైపూర్‌ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement