England Steven Finn Retires From Professional Cricket - Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ క్రికెట్‌లో మరో వికెట్‌ పడింది.. రిటైర్మెంట్‌ ప్రకటించిన బ్రాడ్‌ సహచరుడు

Published Mon, Aug 14 2023 4:31 PM

England Steven Finn Retires From Professional Cricket - Sakshi

ఇంగ్లండ్‌ క్రికెట్‌లో మరో వికెట్‌ పడింది. నెల రోజుల వ్యవధిలో నాలుగో ఆటగాడు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. యాషెస్‌ సిరీస్‌-2023 సందర్భంగా తొలుత స్టువర్ట్‌ బ్రాడ్‌, ఆతర్వాత మొయిన్‌ అలీ, కొద్ది రోజుల గ్యాప్‌లో ఇంగ్లండ్‌ టీ20 వరల్డ్‌కప్‌ విన్నర్‌ అలెక్స్‌ హేల్స్‌, తాజాగా త్రీ టైమ్‌ యాషెస్‌ సిరీస్‌ విన్నర్‌, బ్రాడ్‌ సహచరుడు, ఫాస్ట్‌ బౌలర్‌ స్టీవెన్‌ ఫిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

2010లో అం‍తర్జతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఫిన్‌.. 2017 వరకు ఇంగ్లండ్‌ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఈ మధ్య కాలంలో అతను మూడు సార్లు యాషెస్‌ సిరీస్‌ విన్నింగ్‌ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. గతకొంతకాలంగా మోకాలి గాయంతో బాధ పడుతున్న ఫిన్‌.. తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిన్‌ ఓ స్టేట్‌మెంట్‌ ద్వారా వెల్లడించాడు.

గత ఏడాది కాలంగా మోకాలి గాయం బాధిస్తుందని, గాయంతో పోరాటంలో తాను ఓడిపోయానని, తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నానని ఫిన్‌ తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. 2005లో మిడిల్‌సెక్స్‌ తరఫున కెరీర్‌ను ప్రారంభించిన ఫిన్‌.. 2010-16 మధ్యలో ఇంగ్లండ్‌ తరఫున 36 టెస్ట్‌లు ఆడి 125 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు.

2011లో వన్డే అరంగ్రేటం చేసిన ఫిన్‌ 69 వన్డేల్లో 102 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. 2011-15 మధ్యలో 21 టీ20 ఆడిన ఫిన్‌ 27 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్‌ల్లో ఫిన్‌ ఓ హాఫ్‌ సెంచరీ కూడా చేశాడు. కౌంటీల్లో 2005 నుంచి 2022 వరకు మిడిల్‌సెక్స్‌కు ఆడిన ఫిన్‌.. ఆతర్వాత ససెక్స్‌ను మారాడు. ససెక్స్‌ తరఫున ఫిన్‌ కేవలం 19 మ్యాచ్‌లే ఆడాడు. ససెక్స్‌కు ఆడుతుండగానే మోకాలి గాయం బారిన పడిన 34 ఏళ్ల ఫిన్‌, కెరీర్‌ను కొనసాగించలేక రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

Advertisement
Advertisement