Faheem Ashraf Tests Positive for Covid, Ruled Out of 2nd Test Against Australia - Sakshi
Sakshi News home page

PAK VS AUS 2nd Test: పాక్ జట్టులో కరోనా కలకలం

Published Thu, Mar 10 2022 3:57 PM

Faheem Ashraf Tests Positive For Covid, Ruled Out Of 2nd Test Against Australia - Sakshi

ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌ ప్రారంభానికి ముందు పాకిస్థాన్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులోని కీలక ఆల్‌రౌండర్‌ ఫహీమ్‌ అష్రాఫ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఫహీమ్‌ కరాచీ వేదికగా ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌కు దూరం కానున్నాడు. ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా తొలి టెస్ట్‌కు కూడా ఆడని ఫహీమ్‌ను ఐదు రోజుల ఐసోలేషన్‌కు తరలించినట్లు పాక్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. ఫహీమ్‌ కంటే ముందు పాక్‌ పేసర్‌ హరీస్ రౌఫ్ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో అతను తొలి టెస్ట్‌ ద్వారా అరంగేట్రం చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

కాగా, 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాక్‌ గడ్డపై అడుగుపెట్టిన ఆసీస్‌.. పర్యటనలో భాగంగా 3 టెస్ట్‌లు, 3 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్‌ ఆడనుంది. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌ నిర్జీవమైన పిచ్‌ కారణంగా పేలవ డ్రాగా ముగిసింది. బౌలర్లకు ఏమాత్రం సహకరించని పిచ్‌పై ఇరు జట్ల ఆటగాళ్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంతో తొలి టెస్ట్‌లో పరుగుల వరద పారింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. ఇమామ్‌ ఉల్‌ హక్‌ (157; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజహర్‌ అలీ (185; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు భారీ శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌ను 476/4 వద్ద డిక్లేర్‌ చేసింది

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ ఆతిధ్య జట్టుకు ధీటుగా బదులిచ్చింది. ఆసీస్‌ టాపార్డర్‌ బ్యాటర్లు నలుగురు ( ఉస్మాన్‌ ఖ్వాజా (97), వార్నర్‌ (68), లబూషేన్‌ (90), స్టీవ్‌ స్మిత్‌ (78) అర్ధ సెంచరీలతో రాణించటంతో తొలి ఇన్నింగ్స్‌లో 459 పరుగులకే ఆలౌటైంది. పాక్‌ బౌలర్లలో నౌమాన్‌ అలీ 6 వికెట్లు, షాహీన్‌ అఫ్రిది 2, నసీమ్‌ షా, సాజిద్‌ ఖాన్‌లు తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌.. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌ (242 బంతుల్లో 136 నాటౌట్‌; 15 ఫోర్లు, సిక్స్‌), ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (223 బంతుల్లో 111 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయమైన శతకాలతో విజృంభించడంతో ఆఖరి రోజు మ్యాచ్‌ ముగిసే సమయానికి పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 252 పరుగులు చేసింది. 
చదవండి: PAK Vs AUS: రెండో ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన పాక్‌ ఓపెనర్‌

Advertisement
Advertisement