IPL 2022: Gujarat Titans Captain Hardik Pandya Big Statement, Says We Are Not Here Prove Anything - Sakshi
Sakshi News home page

IPL 2022: కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: హార్దిక్‌ పాం‍డ్యా

Published Sat, Mar 19 2022 9:10 AM

Gujarat Titans Captain Hardik Pandya Says We Are Not Here Prove Anything - Sakshi

గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్‌కు కెప్టెన్‌గా ఇదే డెబ్యూ ఐపీఎల్‌ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతేడాది వరకు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన హార్దిక్‌ పాండ్యాను గుజరాత్‌ టైటాన్స్‌ మెగావేలానికి ముందే రూ.15 కోట్లతో రిటైన్‌ చేసుకుంది. అయితే గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున 12 మ్యాచ్‌ల్లో 127 పరుగులు మాత్రమే చేసిన హార్దిక్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక ఒక్కసారి కూడా బౌలింగ్‌ చేయలేకపోయాడు.

అంతకముందు గాయంతో 9 నెలలు జట్టుకు దూరమైన పాండ్యా గతేడాది అక్టోబర్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌ ద్వారా రీఎంట్రీ ఇచ్చినప్పటికి దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఆల్‌రౌండర్‌ కోటాలో జట్టులోకి వచ్చిన హార్దిక్‌ సరైన ఫామ్‌ కనబరచలేక జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. అప్పటినుంచి టీమిండియాకు దూరంగా ఉన్న హార్దిక్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా నియమించడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ విషయం పక్కనబెడితే.. ఇటీవలే ఎన్‌సీఏ అకాడమీలో నిర్వహించిన ఫిట్‌నెస్‌ టెస్టులో హార్దిక్‌ పాసయ్యాడు. బౌలింగ్‌ విషయంలో క్లారిటీ లేనప్పటికి ఐపీఎల్‌ మార్గాన్ని సుగమం చేసుకున్నాడు. మరో వారం రోజుల్లో ఐపీఎల్‌ 15వ సీజన్‌ మొదలుకానున్న  నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ తన జట్టు సన్నాహకాల గురించి స్పందించాడు.

''నా కొత్త టీమ్‌తో చాలా సంతోషంగా ఉన్నా. కొత్త టీమ్‌.. అందులోనూ నేను కెప్టెన్‌గా ఉండడం కాస్త ఆసక్తి కలిగిస్తుంది. నిజాయితీగా చెప్పాలంటే మేం కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏం లేదు. మా జట్టులో అంతా మంచి క్రికెట్‌ ఆడే ఆటగాళ్లు ఉన్నారు. మా చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎప్పటికప్పుడు ఆహ్లదకరంగా ఉంచడంతో పాటు ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చేలా సిద్దమయ్యాం. మాకు పెద్దగా ఆశలు లేవు.. మ్యాచ్‌ గెలవడమే మా ప్రధాన లక్ష్యం. ఐపీఎల్‌లో ఒక జట్టుకు డెబ్యూ కెప్టెన్‌గా వ్యవహరించనుండడం కాస్త సవాల్‌తో కూడుకున్నప్పటికి దానిని సమర్థంగా నిర్వహించాలని భావిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తన తొలి మ్యాచ్‌ను మరో కొత్త జట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మార్చి 28న ఆడనుంది.

చదవండి: SA vs BAN: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే తొలి విజయం

రైనాకు హ్యాండ్‌ ఇచ్చిన ఫ్రాంచైజీలు.. కారణం ఇదే అంటున్న కుమార సంగక్కర 

Advertisement
Advertisement