Ind vs Pak: ఫైనల్లో పాక్‌తో భారత క్రికెట్‌ జట్టు ఢీ! సై అంటే సై.. | IBSA World Games 2023: Ind Vs Pak In Final Visually Challenged Mens Cricket, Check Details - Sakshi
Sakshi News home page

Ind vs Pak In Final: ఫైనల్లో పాక్‌తో భారత క్రికెట్‌ జట్టు ఢీ! ఆసీస్‌తో పోరుకు మహిళలు సిద్ధం

Published Sat, Aug 26 2023 10:43 AM

IBSA World Games 2023: Ind vs Pak In Final Visually Challenged Mens Cricket - Sakshi

IBSA World Games 2023: చంద్రయాన్-3 సాఫ్ట్‌ ల్యాండ్‌ నేపథ్యంలో చంద్రునిపై భారత మువ్వన్నెల పతాకం గర్వంగా రెపరెపలాడిన సంతోషాన్ని యావత్‌ దేశం సంబరంగా జరుపుకొంటున్న తరుణంలో.. భారత అంధ  క్రీడాకారులు బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో సత్తా చాటారు. ప్రపంచ అంధ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో  జరుగుతున్న  క్రీడాకారుల పోటీలలో ఆకాశమే హద్దుగా ముందుకు సాగుతున్నారు.

మహిళా, పురుష జట్లు
గత వారం రోజులుగా జరుగుతున్న ఈ పోటీలలో భారత  క్రీడాకారులు క్రికెట్ , జూడో , అథ్లెటిక్స్ విభాగంలో పాల్గొంటున్నారు. పురుషుల క్రికెట్లో భారత్ , ఇంగ్లండ్,  పాకిస్తాన్ , బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా .. మహిళల క్రికెట్ విభాగంలో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా  దేశాల జట్లు తలపడ్డాయి.

ఫైనల్లో పాకిస్తాన్‌తో ఢీ
ఈ క్రమంలో.. పురుషుల క్రికెట్లో  భారత్ నాలుగు లీగ్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. ఇక శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో  బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. శనివారం నాటి ఫైనల్లో దాయాది జట్టు పాకిస్తాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా భారత కాలమానం ప్రకారం 3:30 గంటలకు జరిగే  ఫైనల్  మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థితో అమీతుమీ తేల్చుకోనుంది.

మహిళా జట్టు కూడా ఫైనల్‌కు
మహిళల క్రికెట్‌ విభాగంలో భారత జట్టు మూడు మ్యాచ్‌లకు మూడు గెలిచి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఆగష్టు 26 నాటి తుదిపోరులో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో ఫైనల్లో తలపడనుంది . 

క్రీడాకారులకు అరకొర ఏర్పాట్లు
యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఉన్న మన ప్రవాసాంధ్రులు  ముఖ్యంగా సోలిహల్ యునైటెడ్ క్రికెట్ క్లబ్ (SUCC, UK) సభ్యులు కలిసి ఈ క్రికెట్ జట్టు సభ్యులందరికీ కావాల్సిన భోజనా-వసతి సదుపాయాలని సమకూరుస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్రణవ గ్రూప్ కూడా వీరికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.

తగిన సహకారం అందిస్తే
కాగా జట్టు యాజమాన్యం, ప్రభుత్వం మరింత బాధ్యతగా ఏర్పాట్లు చేసినట్లయితే ఇంకా  అంధ క్రికెట్‌లో మనవాళ్లు ఎన్నో విజయాలు సాధిస్తారని ప్రవాసాంధ్రులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. 2012 నుంచి భారత పురుషుల జట్టు 3 సార్లు టీ20, రెండుసార్లు  వన్డే  ప్రపంచ కప్, ఒకసారి ఆసియ కప్ గెలిచి సత్తా చాటింది. ఎన్ని విజయాలు సాధించినా  జట్టుకు, క్రీడాకారులకు తగినంత గుర్తింపు , ప్రోత్సాహం  లభించడం లేదని క్రికెట్‌ అభిమానులు ఉసూరుమంటున్నారు.

భారత పురుషుల అంధ క్రికెట్‌ జట్టు
అజయ్‌ కుమార్‌రెడ్డి(కెప్టెన్‌), వెంకటేశ్వరరావు(వైస్‌ కెప్టెన్‌), బసప్ప వడ్డగోల్‌, మహ్మద్‌ జాఫర్‌ ఇక్బాల్‌, మహారాజా శివసుబ్రమణియన్‌, ఓంప్రకాశ్‌ పాల్‌, మరేశ్‌భాయిబలుభాయి తుంబ్డా, నీలేశ్‌ యాదవ్‌, పంకజ్‌ భుయే, రాంబీర్‌ సింగ్‌, నకుల బద్రానాయక్‌, ఇర్ఫాన్‌ దివాన్‌, ప్రకాశ జయరామయ్య, దీపక్‌మాలిక్‌, సునిల్‌ రమేశ్‌, దుర్గారావు తొంపాకి, దినేశ్‌భాయయి చమాయ్దాభాయి రాథ్వా.

మహిళల క్రికెట్‌ జట్టు:
వర్ష(కెప్టెన్‌), వలసనైని రావణ్ణి, సిము దాస్‌, పద్మినితుడు, కలికా సంధ్య, ప్రియ, గంగవ్వ నీలప్ప హరిజన్‌, సాండ్రా డేవిస్‌ కరిమలిక్కల్‌, బసంతి హన్స్‌దా, ప్రీతి ప్రసాద్‌, సుష్మా పటేల్‌, ఎం.సత్యవతి, ఫులాసరేన్‌(వైస్‌ కెప్టెన్‌), ఝిలిబిరువా, గంగా శంభాజీ కదం, దీపికా టీసీ.

చదవండి: Asia Cup: కోహ్లి కాదు.. యో- యో టెస్టులో అతడే టాప్‌! స్కోరెంతంటే?

Advertisement
Advertisement