Ind vs Eng: ‘బజ్‌బాల్‌’ను కట్టడి చేసి.. బ్యాటింగ్‌లో అదరగొట్టి! | Sakshi
Sakshi News home page

Ind vs Eng 5th Test Day 1: బౌలర్లు అలా.. బ్యాటర్లు ఇలా! టీమిండియాదే పైచేయి

Published Thu, Mar 7 2024 5:21 PM

Ind vs Eng 5th Test: Kuldeep Ashwin Shines Rohit Jaiswal 50s Ind Dominance Day 1 - Sakshi

ముగిసిన తొలి రోజు ఆట

India vs England, 5th Test Day 1 Highlights: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా పైచేయి సాధించింది. ‘బజ్‌బాల్‌’ విధానంతో దూకుడు ప్రదర్శించాలనుకున్న స్టోక్స్‌ బృందాన్ని కట్టడి చేసి.. స్పిన్‌ మాయాజాలంతో చుక్కలు చూపించింది.

స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే భారత్‌ 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ధర్మశాలలో గురువారం నామమాత్రపు ఆఖరి టెస్టు మొదలైంది.

టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, భారత స్పిన్నర్లు ఆది నుంచే అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తూ.. ఇంగ్లిష్‌ జట్టును తిప్పలు పెట్టారు. ఓపెనర్‌ జాక్‌ క్రాలే(79) ఒక్కడే పట్టుదలగా నిలబడగా.. మిగతా వాళ్లలో ఒక్కరి నుంచి కూడా అతడికి సహకారం అందలేదు.

కుల్దీప్‌, అశ్విన్‌ స్పిన్‌ మాయ (Kuldeep Yadav- Ravichandran Ashwin Spin Magic)
ఈ క్రమంలో 218 పరుగులకే ఇంగ్లండ్‌ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. టీమిండియా స్పిన్నర్లలో కుల్దీప్‌ యాదవ్‌ ఐదు(5/72) వికెట్లతో చెలరేగగా.. వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్‌ అశ్విన్‌ నాలుగు(4/51) వికెట్లతో రాణించాడు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్‌(1/17) దక్కింది.

అర్ధ శతకాలతో చెలరేగి భారత ఓపెనర్లు (Yashasvi Jaiswal- Rohit Sharma)
ఇక తొలి రోజే ఇంగ్లండ్‌ ఆట కట్టించిన టీమిండియా.. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ సూపర్‌ ఫిఫ్టీ(58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో ఇరదగీశాడు. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా అర్ధ శతకంతో చెలరేగాడు.

అయితే, షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో అనూహ్య రీతిలో యశస్వి స్టంపౌట్‌గా వెనుదిరగగా.. శుబ్‌మన్‌ గిల్‌ క్రీజులోకి వచ్చాడు. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా స్కోరు 135/1 కాగా.. రోహిత్‌ శర్మ 52, శుబ్‌మన్‌ గిల్‌ 26 పరుగులతో అజేయంగా ఉన్నారు. 

Advertisement
Advertisement