ఐసీసీ అగ్రపీఠంపై కొత్త ఆటగాడు.. ఐదేళ్ల తర్వాత..! | Sakshi
Sakshi News home page

ఐసీసీ అగ్రపీఠంపై కొత్త ఆటగాడు.. ఐదేళ్ల తర్వాత..!

Published Wed, Feb 14 2024 3:03 PM

Mohammad Nabi Claimed No 1 Spot In Latest Mens ODI All Rounder Rankings - Sakshi

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు మొహమ్మద్‌ నబీ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ స్థానంలో దాదాపు ఐదేళ్ల పాటు కొనసాగిన బంగ్లా ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ రెండో స్థానానికి పడిపోయాడు. గాయం కారణంగా షకీబ్‌ వన్డేలకు దూరంగా ఉండటం.. ఈ మధ్యలో నబీ సత్తా చాటడంతో వీరిద్దరి ర్యాంక్‌లు తారుమారయ్యాయి.

ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డేలో సెంచరీతో పాటు వికెట్‌ తీయడంతో నబీ అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో భారత ఆటగాడు రవీంద్ర జడేజా 10వ స్థానంలో కొనసాగుతున్నాడు.

వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్‌-10లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో డబుల్‌ సెంచరీతో చెలరేగిన లంక ఆటగాడు పథుమ్‌ నిస్సంక 10 స్థానాలు మెరుగుపర్చుకుని 18వ స్థానానికి చేరగా.. మూడో వన్డేలో 97 పరుగులతో అజేయంగా నిలిచిన నిస్సంక సహచరుడు అసలంక 5 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు.

పాక్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత ఆటగాళ్లు శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వరుసగా 2, 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. 

బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. కేశవ్‌ మహారాజ్‌ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత బౌలర్లు సిరాజ్‌, బుమ్రా, కుల్దీప్‌ నాలుగు, ఐదు, తొమ్మిది స్థానాల్లో నిలిచారు.  

టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేసిన కేన్‌ విలియమ్సన్‌ టాప్‌ ప్లేస్‌ను మరింత పదిలం చేసుకోగా.. భారత ఆటగాళ్లు విరాట్‌ ఏడులో, పంత్‌, రోహిత్‌ శర్మ 12, 13 స్థానాల్లో నిలిచారు. 

టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఈ విభాగంలో బుమ్రా టాప్‌లో కొనసాగుతుండగా.. అశ్విన్‌ 3, రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో నిలిచారు. సిరాజ్‌, షమీ 19, 20 స్థానాల్లో కొనసాగుతున్నారు.  

టెస్ట్‌ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఈ విభాగంలో జడేజా, అశ్విన్‌, అక్షర్‌ 1, 2, 5 స్థానాల్లో కొనసాగుతున్నారు. 

టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. భారత ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ టాప్‌లో కొనసాగుతుండగా.. యశస్వి జైస్వాల్‌ ఆరో ప్లేస్‌లో నిలిచాడు.

టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఆదిల్‌ రషీద్‌ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత బౌలర్లు అక్షర్‌ పటేల్‌, రవి భిష్ణోయ్‌ ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement