‘బాబర్‌ ఆజం పెళ్లి చేసుకోవాలనుకుంటే?.. ఒప్పుకోను!’ | Sakshi
Sakshi News home page

‘బాబర్‌ ఆజం పెళ్లి చేసుకోవాలనుకుంటే?.. ఒప్పుకోను!’

Published Thu, Apr 25 2024 3:25 PM

Pakistan Actor Comments On Babar Draws Response Forced To Make Account: Report - Sakshi

‍పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ బాబర్‌ ఆజంకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వన్డేల్లో సుదీర్ఘకాలం పాటు నంబర్‌ వన్‌ ర్యాంకులో కొనసాగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఇటీవలే తిరిగి పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా పునర్నియమితుడయ్యాడు.

ఇక బాబర్‌ ఆజంకు తరచూ ఎదురయ్యే ప్రశ్నల్లో పెళ్లి గురించి తప్పక ప్రస్తావన ఉంటుంది. వరల్డ్‌క్లాస్‌ క్రికెటర్‌గా ఎదిగిన 29 ఏళ్ల ఈ మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచిలర్‌ ఎవరిని పెళ్లాడబోతున్నాడన్న అంశంపై గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేస్తుంటారు కూడా! 

ఈ విషయమై పాకిస్తాన్‌కు చెందిన ఓ నటికి చేదు అనుభవం ఎదురైంది. బాబర్‌ ఫ్యాన్స్‌ దెబ్బకు ఆమె అకౌంట్‌ను కాసేపు ప్రైవేట్‌ అకౌంట్‌గా మార్చుకోవాల్సి వచ్చింది. నజీష్‌ జహంగీర్‌ అనే బుల్లితెర నటికి ఇన్‌స్టాగ్రామ్‌లో 12 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఈ క్రమంలో ఓ అభిమాని ఆమెను.. ‘‘బాబర్‌ ఆజం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాన’’ని అడిగితే ఏం చెప్తారు? అని అడిగాడు. ఇందుకు బదులుగా.. ‘‘సారీ చెప్తాను’’ అంటూ సున్నితంగా తిరస్కరిస్తాననే అర్థంలో సమాధానమిచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఆమె తన ఇన్‌స్టాస్టోరీలో పోస్ట్‌ చేసిందన్న వార్త వైరల్‌ అయింది.

అంతేకాదు.. ‘‘బాబర్‌ మాకు సోదరుడి వంటి వాడు. కానీ అతడి అభిమానులు ఇలా నెగిటివిటీ ప్రచారం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు’’ అని నజీష్‌ ఆగ్రహం వ్యక్తం చేసిందన్నట్లు మరో ఇన్‌స్టా స్టోరీ కూడా తెరమీదకు వచ్చింది.

ఈ క్రమంలో బాబర్‌ ఫ్యాన్స్‌ ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్‌ చేయగా.. వేధింపులను తట్టుకోలేక నజీష్‌ తన అకౌంట్‌ను సోమవారం కాసేపు ప్రైవేట్‌గా పెట్టినట్లు సామా టీవీ వెల్లడించింది. అయితే, మరుసటి రోజే ఆమె మళ్లీ తన అకౌంట్‌ను పబ్లిక్‌ చేసేసింది. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 వైఫల్యం తర్వాత బాబర్‌ ఆజం పాక్‌ కెప్టెన్‌గా వైదొలిగాడు.

దీంతో అతడి స్థానంలో టెస్టులకు షాన్‌ మసూద్‌, టీ20లకు షాహిన్‌ ఆఫ్రిది కెప్టెన్‌గా ఎంపికయ్యారు. అయితే, వీరి సారథ్యంలో జట్టు ఘోర వైఫల్యాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో షాహిన్‌పై వేటు వేసిన పాక్‌ బోర్డు.. పగ్గాలను తిరిగి బాబర్‌ ఆజంకు అప్పగించింది. షాన్‌ మసూద్‌ను మాత్రం టెస్టుల సారథిగా కొనసాగిస్తోంది. 

ఇక మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాబర్‌ సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బిజీ అయ్యాడు. వర్షం కారణంగా తొలి టీ20 రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలిచింది. ఇరుజట్ల మధ్య గురువారం నాలుగో టీ20 జరుగనుంది. 

Advertisement
Advertisement