రికార్డు ఛేజింగ్‌..90 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి | Sakshi
Sakshi News home page

రికార్డు ఛేజింగ్‌..90 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి

Published Tue, Feb 20 2024 8:47 AM

Railways register highest successful run chase in 90-year-old history of Ranji Trophy - Sakshi

రంజీ ట్రోఫీలో రైల్వేస్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. 90 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలోనే అత్య‌ధిక ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించిన జ‌ట్టుగా రైల్వేస్‌ రికార్డులెక్కింది. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో భాగంగా త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రైల్వేస్‌ జట్టు.. ఈ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు సౌరాష్ట్ర పేరిట ఉండేది.

2019-20 సీజన్‌లో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 372 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర ఛేజ్‌ చేసింది. తాజా మ్యాచ్‌తో సౌరాష్ట్ర ఆల్‌టైమ్‌ రికార్డును రైల్వేస్‌ బ్రేక్‌ చేసింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రైల్వేస్‌ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రైల్వేస్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ప్రిథమ్‌ సింగ్‌(169 నాటౌట్‌),మహ్మద్‌ సైఫ్‌(106) అద్బుత సెంచరీలతో చెలరేగారు.

అంతకుముందు త్రిపురా రెండో ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి రైల్వేస్‌ ముందు 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కాగా తొలి తొలి ఇన్నింగ్స్‌లో త్రిపురా 149 పరుగులకు ఆలౌట్‌ కాగా.. రైల్వేస్‌ సైతం 105 పరుగులకే కుప్పకూలింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్న రైల్వేస్‌ రికార్డు విజయాన్ని నమోదు చేసింది.
 

Advertisement
Advertisement