పరుగుల ప్రవాహం కొనసాగిస్తున్న పుజారా.. మరో శతకం | Sakshi
Sakshi News home page

పరుగుల ప్రవాహం కొనసాగిస్తున్న పుజారా.. మరో శతకం

Published Fri, Feb 9 2024 5:00 PM

Ranji Trophy 2024 SAU VS RAJ: Cheteshwar Pujara Scores 62nd First Class Hundred - Sakshi

రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో సౌరాష్ట్ర ఆటగాడు, భారత వెటరన్‌ బ్యాటర్‌ చతేశ్వర్‌ పుజారా పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఓ డబుల్‌ సెంచరీ, రెండు హాఫ్‌ సెంచరీలు (8 ఇన్నింగ్స్‌ల్లో 76.86 సగటున 522 పరుగులు) చేసిన పుజారా తాజాగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో పుజారా 199 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో సెంచరీ మార్కును చేరుకున్నాడు.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో పుజారాకు ఇది 62వ శతకం.  జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (33/2) బరిలోకి దిగిన పుజారా.. షెల్డన్‌ జాక్సన్‌తో (70 నాటౌట్‌) కలిసి నాలుగో  వికెట్‌కు భారీ భాగస్వామ్యం (150కి పైగా) నమోదు చేశాడు. తొలి రోజు ఆటలో 80 ఓవర్ల తర్వాత సౌరాష్ట్ర స్కోర్‌ 224/3గా ఉంది. పుజారా, షెల్డన్‌ జాక్సన్‌ క్రీజ్‌లో ఉన్నారు. రాజస్థాన్‌ బౌలర్లలో అనికేత్‌ చౌదరీ, మానవ్‌ సుతార్‌, అజయ్‌ కుక్నా తలో వికెట్‌ పడగొట్టారు. 

కాగా, పుజారా రంజీల్లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ టీమిండియా సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగే మిగతా మూడు టెస్ట్‌లకు భారత జట్టును ఇవాళ (ఫిబ్రవరి 9) ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో పుజారా మరో శతక్కొట్టి సెలక్టర్లను ఆకర్శించాడు. ఇప్పటికే కోహ్లి సేవలు దూరం కావడంతో సెలెక్టర్లు పుజారాను తప్పక ఎంపిక చేయవచ్చు.

మరోవైపు మరో మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా గాయపడ్డాడని తెలుస్తుంది. ఒకవేళ కోహ్లి మిగతా సిరీస్‌కు అందుబాటులోకి వచ్చినా శ్రేయస్‌ స్థానంలో అయినా పుజారా జట్టులోకి వచ్చే అవకాశం​ ఉంటుంది. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌ రాజ్‌కోట్‌ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు చెరో మ్యాచ్‌ గెలిచిన విషయం తెలిసిందే.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు..

  • సునీల్‌ గవాస్కర్‌- 81
  • సచిన్‌ టెండూల్కర్‌- 81
  • రాహుల్‌ ద్రవిడ్‌- 68
  • చతేశ్వర్‌ పుజారా- 62

Advertisement
Advertisement