దుమ్ములేపిన శార్దూల్‌, తుషార్‌.. విఫలమైన పృథ్వీ షా

2 Mar, 2024 17:54 IST|Sakshi
దుమ్ములేపిన శార్దూల్‌ ఠాకూర్‌ (PC: BCCI)

రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ రెండో సెమీ ఫైనల్లో ముంబై- తమిళనాడు తలపడుతున్నాయి. శరద్‌ పవార్‌ క్రికెట్‌ అకాడమీలో శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన తమిళనాడు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో ముంబై పేసర్ల దెబ్బకు కేవలం 146 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. తొలుత.. ‘లార్డ్‌’ శార్దూల్‌ ఠాకూర్‌.. తమిళనాడు ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని డకౌట్‌గా వెనక్కిపంపాడు.

ఆ తర్వాత మరో ఇద్దరు ఫాస్ట్‌బౌలర్లు మోహిత్‌ అవస్థి, తుషార్‌ దేశ్‌పాండే తమిళ బ్యాటర్ల పనిపట్టారు. మోహిత్‌.. ఎన్‌ జగదీశన్‌(4) రూపంలో వికెట్‌ దక్కించుకోగా.. ప్రదోష్‌ పాల్‌(8), కెప్టెన్‌ సాయి కిషోర్‌(1), ఇంద్రజిత్‌ బాబా(11) వికెట్లు పడగొట్టాడు.

ఇక ప్రమాదకరంగా మారుతున్న విజయ్‌ శంకర్‌(44)ను శార్దూల్‌ ఠాకూర్‌ అవుట్‌ చేసి మరోసారి బ్రేక్‌ అందించగా.. అర్ధ శతకం దిశగా వెళ్తున్న వాషింగ్టన్‌ సుందర్‌(43)ను స్పిన్నర్‌ తనుశ్‌ కొటియాన్‌ పెవిలియన్‌కు పంపాడు.

ఓవరాల్‌గా తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో పేసర్లు శార్దూల్‌ రెండు, తుషార్‌ దేశ్‌పాండే మూడు, మోహిత్‌ అవస్థి ఒక వికెట్‌ తీయగా.. స్పిన్నర్లు తనుశ్‌ కొటియాన్‌, ముషీర్‌ ఖాన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

ఈ క్రమంలో తొలిరోజే తమిళనాడు ఆలౌట్‌ చేసి.. బ్యాటింగ్‌ మొదలుపెట్టిన ముంబైకి కూడా శుభారంభం లభించలేదు. ఓపెనర్లు పృథ్వీ షా(5), భూపేన్‌ లల్వానీ(15) పూర్తిగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం నాటి ఆట పూర్తయ్యేసరికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. తమిళనాడు కంటే ప్రస్తుతం 101 పరుగులు వెనుకబడి ఉంది.

whatsapp channel

మరిన్ని వార్తలు