Sakshi Funday Story On Indian Tennis Player Ramesh Krishnan - Sakshi
Sakshi News home page

Ramesh Krishnan: దిగ్గజాలకు సైతం ముచ్చెమటలు పట్టించిన భారత టెన్నిస్‌ యోధుడు

Published Sun, Jun 11 2023 3:35 PM

Sakshi Funday Story On Indian Tennis Player Ramesh Krishnan

1989 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌  టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ.. వరల్డ్‌ నంబర్‌వన్, డిఫెండింగ్‌ చాంపియన్‌ మాట్స్‌ విలాండర్‌ మరోసారి ఫేవరెట్‌గా బరిలో నిలిచాడు. తొలి రౌండ్‌లో గెలిచి ముందంజ వేసిన విలాండర్‌ ముందుకు దూసుకుపోవడంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. ఎప్పటిలాగే రెండో రౌండ్‌ మ్యాచ్‌కి అతను సిద్ధమయ్యాడు. ఎదురుగా భారత్‌కి చెందిన రమేశ్‌ కృష్ణన్‌ ప్రత్యర్థిగా ఉన్నాడు. విలాండర్‌తో పోలిస్తే రమేశ్‌ స్థాయి చాలా చిన్నది. కాబట్టి మ్యాచ్‌ ఏకపక్షమే అని అంతా అనుకున్నారు.

కానీ అలా జరగలేదు. ఆ టెన్నిస్‌ కోర్ట్‌లో చెలరేగిపోయాడు రమేశ్‌. పవర్‌ఫుల్‌ ఆటతో కదం తొక్కిన అతను భారత టెన్నిస్‌ సింగిల్స్‌ చరిత్రలో అతి పెద్ద సంచలనాన్ని నమోదు చేశాడు. వరుస సెట్లలో విలాండర్‌ను చిత్తు చేసి ఔరా అనిపించాడు. అలా దశాబ్దన్నర పాటు సాగిన కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన రమేశ్‌ భారత టెన్నిస్‌పై తనదైన ముద్ర వేశాడు. తండ్రి బాటలో ఆటను ఎంచుకున్న అతను నాటితరంలో పురుషుల సింగిల్స్‌లో భారత్‌ తరపున ఏకైక ప్రతినిధిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన దాదాపు దశాబ్ద కాలం వరకు కూడా టెన్నిస్‌లో మన వైపు నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. 1960ల్లో రామనాథన్‌ కృష్ణన్‌ రాకతో పరిస్థితి కాస్త మారింది. వింబుల్డన్‌  బాలుర టైటిల్‌ని గెలిచిన ఆసియా తొలి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న రామనాథన్‌  గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లోనూ నిలకడగా రాణించాడు. 1966లో భారత డేవిస్‌ కప్‌ జట్టు మొదటిసారి ఫైనల్‌ చేరడంలో కూడా ఆయనదే కీలక పాత్ర. ఆయన కొడుకైన రమేశ్‌ కృష్ణన్‌ కూడా తండ్రి బాటలోనే టెన్నిస్‌ని ఎంచుకున్నాడు. ఆటపై రమేశ్‌ ఆసక్తిని చూసిన రామనాథన్‌ ఎలాంటి ఇబ్బంది రాకుండా సౌకర్యాలు కల్పించి అన్ని రకాలుగా ప్రోత్సహించాడు. దాని ఫలితాలు వెంటనే కనిపించాయి.

జూనియర్‌ స్థాయిలో సత్తా చాటిన రమేశ్‌ టెన్నిస్‌లో దూసుకుపోయాడు. జూనియర్‌ గ్రాండ్‌స్లామ్స్‌లో వరుస విజయాలతో తన రాకెట్‌ పదును చూపించాడు. 1979లో వింబుల్డన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ జూనియర్‌ టోర్నీలలో చాంపియన్‌ గా నిలవడంతో రమేశ్‌ ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. ఈ ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో కూడా ముందంజ వేసిన రమేశ్‌ వరల్డ్‌ నంబర్‌వన్‌ గా ఎదిగాడు. 

గ్రాండ్‌స్లామ్‌లోనూ సత్తా చాటి..
జూనియర్‌ స్థాయిలో మంచి ఫలితాలతో వెలుగులోకి వచ్చిన రమేశ్‌ సీనియర్‌ విభాగంలోనూ ఎన్నో ప్రతికూలతలను అధిగమించి చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించాడు. 80వ దశకంలో అంతర్జాతీయ టెన్నిస్‌ మరింత ఆధునికంగా మారుతూ వచ్చింది. పవర్‌ గేమ్‌తో పాటు కొత్త తరహా శిక్షణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ సమయంలో యూరోపియన్‌ సర్క్యూట్‌కి చెందిన ఆటగాళ్లతో పోలిస్తే భారత టెన్నిస్‌ ఎంతో వెనుకబడి ఉంది. ఇలాంటి స్థితిలోనూ రమేశ్‌ సింగిల్స్‌లో తన ప్రభావం చూపడం విశేషం. సాధారణ టోర్నీలతో పోలిస్తే గ్రాండ్‌స్లామ్‌లకు మరింత సాధన అవసరమని అతను భావించాడు.

కోచ్‌ హ్యారీ హాప్‌మన్‌ శిక్షణలో అతని ఆట మరింత పదునెక్కింది. ఈ కోచింగ్‌తో పట్టుదలగా పోటీలకు సిద్ధమైన అతను తన సత్తా చూపించాడు. కెరీర్‌లో మూడుసార్లు అత్యుత్తమంగా గ్రాండ్‌స్లామ్‌ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. 1981, 1987లలో యూఎస్‌ ఓపెన్‌ , 1986 వింబుల్డన్‌ లో చివరి ఎనిమిది మందిలో ఒకడిగా  సఫలమయ్యాడు. 1986లో యూఎస్‌లో ఒక చాలెంజర్‌ టోర్నీలో విజేతగా నిలిచిన సమయంలో అప్పుడే కెరీర్‌ ఆరంభంలో ఉన్న ఆండ్రీ అగస్సీని ఓడించాడు. రమేశ్‌ కెరీర్‌లో విలాండర్‌తో పాటు మరో ఇద్దరు దిగ్గజాలపై సాధించిన విజయాలు ఉన్నాయి. జపాన్, హాంకాంగ్‌ ఓపెన్‌లలో అతను జిమ్మీ కానర్స్, ప్యాట్‌ క్యాష్‌లను ఓడించి సంచలనం సృష్టించాడు. 

డేవిస్‌ కప్‌ విజయాల్లో..
భారత జట్టు తరఫున డేవిస్‌ కప్‌ విజయాల్లోనూ రమేశ్‌ పోషించిన పాత్ర ఎంతో ప్రత్యేకమైంది. 1987లో మన బృందం ఫైనల్‌కి చేరడానికి రమేశ్‌ ఆటనే ప్రధాన కారణం. తండ్రి రామనాథన్‌ భారత్‌కి డేవిస్‌ కప్‌ ఫైనల్‌ చేర్చిన 21 ఏళ్ల తర్వాత కొడుకు రమేశ్‌ నేతృత్వంలో భారత్‌ మరోసారి తుది పోరుకు అర్హత సాధించడం విశేషం. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో అతని అత్యుత్తమ ఆటే జట్టును ఫైనల్‌కి చేర్చింది.

జాన్‌ ఫిట్జ్‌గెరాల్డ్‌పై నాలుగు సెట్‌ల పోరులో అతను సాధించిన అద్భుతమైన విజయమే జట్టును ముందంజలో నిలిపింది. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డ.. సిడ్నీలో 3–2 తేడాతో ఓడించి ఫైనల్‌కి చేరడం అప్పట్లో పెద్ద వార్తాంశంగా మారింది. ఫైనల్లో మన టీమ్‌ స్వీడన్‌ చేతిలో ఓడినా భారత టెన్నిస్‌ చరిత్రలో ఈ డేవిస్‌ కప్‌ విజయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో అప్పటి కొత్త కుర్రాడు లియాండర్‌ పేస్‌తో కలసి రమేశ్‌ డబుల్స్‌ బరిలోకి దిగగా, ఈ జోడి క్వార్టర్‌ ఫైనల్‌ వరకు వెళ్లగలిగింది. 

అత్యుత్తమ ర్యాంక్‌..
రమేశ్‌ కృష్ణన్‌ కెరీర్‌లో సింగిల్స్‌ విభాగంలో ఎనిమిది ఏటీపీ టైటిల్స్‌ ఉన్నాయి. దీంతో పాటు మరో 4 చాలెంజర్‌ టోర్నీలను కూడా అతను గెలుచుకున్నాడు. న్యూయార్క్‌ (యూఎస్‌), ఆక్లాండ్, వెల్లింగ్టన్‌ (న్యూజిలాండ్‌), టోక్యో (జపాన్‌ ), హాంకాంగ్, మెట్జ్‌ (ఫ్రాన్స్‌), స్టట్‌గార్ట్‌ (జర్మనీ), మనీలా (ఫిలిప్పీన్స్‌).. ఇలా వేర్వేరు దేశాల్లో అతను ట్రోఫీలు గెలవడాన్ని చూస్తే భిన్న వేదికలపై రమేశ్‌ ప్రదర్శన, రాణించిన తీరు అతని ఆట ప్రత్యేకత ఏమిటో చూపిస్తాయి. రమేశ్‌ తన కెరీర్‌లో అత్యుత్తమంగా వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 23వ స్థానానికి చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో నాడు అతను సాధించిన ఘనత చిన్నదేమీ కాదు.

రమేశ్‌ కృష్ణన్‌ తర్వాత  2007లో మహిళల సింగిల్స్‌లో సానియా మీర్జా (27వ ర్యాంక్‌) మాత్రమే దానికి సమీపంగా రాగలిగింది. 1985లో రమేశ్‌ 23వ ర్యాంక్‌ సాధించగా, 38 ఏళ్లయినా పురుషుల సింగిల్స్‌లో భారత్‌ నుంచి ఎవరూ దరిదాపుల్లోకి రాలేకపోయారంటే ఆ ఘనత విలువేమిటో అర్థమవుతుంది. కెరీర్‌లో ఒక దశలో ఆరేళ్ల వ్యవధిలో నాలుగేళ్లు టాప్‌–50లో కొనసాగిన అతను, వరుసగా పదేళ్ల పాటు టాప్‌–100లోనే ఉండటం విశేషం. భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న రమేశ్‌ కృష్ణన్‌ ఇప్పుడు తన స్వస్థలం చెన్నైలోనే టెన్నిస్‌ అకాడమీ నెలకొల్పి కోచ్‌గా ఆటగాళ్లను తయారు చేస్తున్నాడు. -మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

Advertisement
Advertisement