అపూర్వ జోడీ... అద్భుత విజయం | Sakshi
Sakshi News home page

అపూర్వ జోడీ... అద్భుత విజయం

Published Mon, Jun 19 2023 3:31 AM

Satwik Chirag win Indonesia Open Mens Doubles title - Sakshi

సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి(భారత్‌) జోడి ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–­1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో అపూర్వ విజ­యం సాధించింది. పురుషుల  డబుల్స్‌ విభాగంలో తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. జకార్తాలో జరి­గిన ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 21–17, 21–18తో ప్రపంచ మూడో  ర్యాంక్‌ జోడీ ఆరోన్‌–సో వుయ్‌ యిక్‌ (మలేసియా)పై గెలుపొందింది. భారత్‌ జోడీకి 92,500 డాలర్ల (రూ.75 లక్షల 77 వేలు) ప్రైజ్‌మనీతో పాటు 12,000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. కాగా, విజేతలుగా నిలిచిన ఏపీ  క్రీడాకారుడు సాత్విక్‌తో పాటు చిరాగ్‌ను  సీఎం జగన్‌ అభినందించారు. 

జకార్తా వేదికగా ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. గతంలో ఏ భారతీయ బ్యాడ్మింటన్‌ జోడీకి సాధ్యంకాని ఘనతను సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం సుసాధ్యం చేసి  చూపించింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీలో ఈ భారత జంట తొలిసారి విజేతగా అవతరించింది. తద్వారా డబుల్స్‌ విభాగంలో ఈ ఘనత సాధించిన మొదటి జోడీగా కొత్త చరిత్ర సృష్టించింది.

గత ఐదేళ్లుగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ లో తమ విజయాలతో భారత డబుల్స్‌ విభాగానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీ తాజా గెలుపుతో తమ స్థాయిని మరింత ఎత్తుకు పెంచుకుంది. క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ జంటను ఓడించి సంచలనం సృష్టించిన సాత్విక్‌–చిరాగ్‌... ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ జోడీని కూడా బోల్తా కొట్టించి ఔరా అనిపించింది.   

జకార్తా: నిరీక్షణ ముగిసింది. డబుల్స్‌ విభాగంలో భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఖాతాలో తొలిసారి వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీ టైటిల్‌ చేరింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్‌ మరోసారి భారత్‌కు కలిసొచ్చింది. గతంలో సైనా నెహ్వల్, కిడాంబి శ్రీకాంత్‌ సింగిల్స్‌ విభాగాల్లో విజేతగా నిలువగా... పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం మొదటిసారి చాంపియన్‌గా అవతరించింది.

తమ కెరీర్‌లో ఫైనల్‌ చేరుకున్న తొలి సూపర్‌–1000 టోర్నీలోనే సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం టైటిల్‌ సాధించడం విశేషం. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంక్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి 21–17, 21–18తో ప్రపంచ మూడో ర్యాంక్‌ జంట, ప్రస్తుత ప్రపంచ చాంపియన్స్‌గా ఉన్న ఆరోన్‌ చియా–సో వుయ్‌ యిక్‌ (మలేసియా)పై గెలుపొందింది.

ఈ మ్యాచ్‌కు ముందు 2017 నుంచి ఇప్పటి వరకు ఆరోన్‌ చియా–సో వుయ్‌ యిక్‌లతో ఎనిమిదిసార్లు తలపడిన సాత్విక్‌–చిరాగ్‌లకు ఎనిమిదిసార్లూ ఓటమి ఎదురుకాగా... తొమ్మిదో ప్రయత్నంలో తొలిసారి ఈ మలేసియా టాప్‌ జోడీపై గెలిచారు.  

విజేతగా నిలిచిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి 92,500 డాలర్ల (రూ. 75 లక్షల 77 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 12,000 ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌ ఆరోన్‌ చియా–సో వుయ్‌ యిక్‌ జంటకు 43,750 డాలర్ల (రూ. 35 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 10,200 ర్యాంకింగ్‌ పాయింట్లు  లభించాయి.  

పక్కా వ్యూహంతో... 
గతంలో మలేసియా జోడీ చేతిలో ఎదురైన ఎనిమిది పరాజయాలను విశ్లేషించి ఈసారి ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో భారత జోడీ బరిలోకి దిగింది. ఎలా ఆడితే తమ ప్రత్యర్థి జంట ఆట కట్టించే అవకాశముందో అదే రకంగా సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం ఆడింది. సుదీర్ఘ ర్యాలీలను ఆడుతూనూ పదునైన స్మాష్‌ షాట్‌లతో వాటికి ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చి సాత్విక్‌–చిరాగ్‌ సత్తా చాటుకున్నారు.

తొలి గేమ్‌ ఆరంభంలో ఒకదశలో 3–7తో వెనుకబడిన సాత్విక్‌–చిరాగ్‌ నెమ్మదిగా తేరుకున్నారు. వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 9–7తో ఆధిక్యంలోకి వచ్చారు. అనంతరం మలేసియా జోడీ స్కోరును 9–9 వద్ద సమం చేసినా... సాత్విక్‌–చిరాగ్‌ తమ వ్యూహాలకు మరింత పదును పెట్టి ప్రత్యర్థి జంటపై ఒత్తిడి పెంచి వరుసగా మూడు పాయింట్లతో 12–9తో మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు ఆ తర్వాత భారత జోడీ ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి గేమ్‌ను దక్కించుకుంది.

రెండో గేమ్‌లో స్కోరు 8–7 వద్ద సాత్విక్‌–చిరాగ్‌ వరుసగా మూడు పాయింట్లు గెలిచి 11–7తో... ఆ తర్వాత స్కోరు 14–11 వద్ద ఈసారి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 18–11తో ఆధిక్యాన్ని పెంచుకున్నారు. చివర్లో 20–14 వద్ద వరుసగా సాత్విక్‌–చిరాగ్‌ వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయి ఆధిక్యం 20–18కి తగ్గడంతో ఒత్తిడికి లోనయ్యారు. అయితే మలేసియా జోడీ అనవసర తప్పిదంతో భారత జోడీకి ఒక పాయింట్‌ రావడంతో విజయం ఖాయమైంది. 

వరల్డ్‌ టూర్‌ టోర్నీలు అంటే... 
ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) వరల్డ్‌ టూర్‌ను ఆరు స్థాయిలుగా విభజించారు. ఏడాదిలో నాలుగు సూపర్‌–1000 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ: 12 లక్షల 50వేల డాలర్లు), ఆరు సూపర్‌–750 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ: 8 లక్షల 50 వేల డాలర్లు), ఏడు సూపర్‌–500 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ: 4 లక్షల 20 వేల డాలర్లు)...11 సూపర్‌–300 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ: 2 లక్షల 10 వేల డాలర్లు) ఉంటాయి.

వీటితోపాటు సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ (మొత్తం ప్రైజ్‌మనీ: 20 లక్షల డాలర్లు) కూడా జరుగుతుంది. దాంతోపాటు సూపర్‌–100 టోర్నీలు (ఒక్కో టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ: 1 లక్ష డాలర్లు) కూడా నిర్వహిస్తారు. టోర్నీ స్థాయిని బట్టి ర్యాంకింగ్‌ పాయింట్లలో, ప్రైజ్‌మనీలో తేడా  ఉంటుంది. సూపర్‌–1000 టోర్నీలలో అత్యధిక పాయింట్లు, అత్యధిక ప్రైజ్‌మనీ లభిస్తుంది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement