MLC 2023: Seattle Orcas Wins Against MI New York, As Heinrich Klaasen Fires With Blasting Hundred - Sakshi
Sakshi News home page

MLC 2023: విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన క్లాసెన్‌.. ప్లే ఆఫ్స్‌కు ముంబై 

Published Wed, Jul 26 2023 8:36 AM

Seattle Orcas Wins Against MI New York, As Heinrich Klaasen Fires With Blasting Hundred - Sakshi

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో తొలి సెంచరీ నమోదైంది. ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌తో నిన్న (జులై 25) జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాడు, సీయాటిల్‌ ఆర్కాస్‌ ప్లేయర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ (44 బంతుల్లో 110 నాటౌట్‌; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర శతకం బాది చరిత్ర సృష్టించాడు. ఫలితంగా ఆర్కాస్‌ జట్టు.. ఎంఐ న్యూయార్క్‌పై 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.  

తొలుత పూరన్‌, ఆఖర్లో బౌల్ట్‌..
ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ న్యూయార్క్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. తొలుత నికోలస్‌ పూరన్‌ (34 బంతుల్లో 68; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), మధ్యలో పోలార్డ్‌ (18 బంతుల్లో 34; ఫోర్‌, 3 సిక్సర్లు), ఆఖర్లో ట్రెంట్‌ బౌల్ట్‌ (6 బంతుల్లో 20 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు) రెచ్చిపోగా.. టిమ్‌ డేవిడ్‌ (16 బంతుల్లో 18; ఫోర్‌, సిక్స్‌), డేవిడ్‌ వీస్‌ (13 బంతుల్లో 19; 3 ఫోర్లు) తలో చేయి వేశారు. ఆర్కాస్‌ బౌలర్లలో ఇమాద్‌ వసీం, హర్మీత్‌ సింగ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. గానన్‌, ఆండ్రూ టై తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

రాణించిన నౌమాన్‌.. శతక్కొట్టిన క్లాసెన్‌
195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్కాస్‌.. 19.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లలో డికాక్‌ (9) విఫలం కాగా.. నౌమాన్‌ అన్వర్‌ (30 బంతుల్లో 51; 6 ఫోర్లు, 3  సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. ఆతర్వాత బరిలోకి దిగిన జయసూర్య డకౌట్‌ కాగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన క్లాసెస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి అజేయ శతకంతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఓ పక్క బంతితో బౌల్డ్‌ (4-0-31-4), రషీద్‌ ఖాన్‌ (4-1-41-2) చెలరేగుతున్నా ఏమాత్రం తగ్గని క్లాసెన్‌.. ఆండ్రూ టై (4 నాటౌట్‌) సహకారంతో తన జట్టును గెలిపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓడినా.. ఆర్కాస్‌, సూపర్‌ కింగ్స్‌, వాషింగ్టన్‌ ఫ్రీడం జట్లతో పాటు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. శాన్‌ ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌, లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌ లీగ్‌ నుంచి నిష్క్రమించాయి.

Advertisement
Advertisement