చంపేస్తామంటూ బెదిరింపులు.. షకీబ్‌ క్షమాపణ

17 Nov, 2020 18:09 IST|Sakshi

ఢాకా/కోల్‌కతా: కాళీమాత పూజలో పాల్గొనడంపై వివాదం చెలరేగడంతో బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ క్షమాపణలు కోరాడు. తన మతాన్ని తాను గౌరవిస్తానని, తన చర్య వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వీడియో విడుదల చేశాడు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని కకుర్‌గచ్చిలో ఈ నెల 12న కాళీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షకీబ్‌ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘కోల్‌కతా నా ఇల్లు వంటిది. ఇక్కడికి వచ్చే ఏ అవకాశాన్ని నేను వదులుకోను. మనుషుల మధ్య బంధాలు అనేవి బలంగా ఉంటే ఎలాంటి భేద భావాలు ఉండవు’’ అని పేర్కొన్నాడు. (చదవండి: అండర్‌-19 బంగ్లాదేశ్‌ మాజీ ఆటగాడి ఆత్మహత్య)

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ ఆల్‌రౌండర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ వర్గం.. ముస్లిం అయి ఉండి పూజలో ఎలా పాల్గొంటావు అంటూ ట్రోలింగ్‌కు దిగారు. ఈ క్రమంలో మోషిన్‌ తలుక్దార్‌ అనే వ్యక్తి.. ఏకంగా షకీబ్‌ను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో షకీబ్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా వీడియో సందేశాన్ని పోస్ట్‌ చేశాడు. ముస్లిం అయినందుకు గర్విస్తున్నానని, ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడు. ‘‘నా మతాన్ని కించపరచాలనే ఉద్దేశం ఎంతమాత్రం లేదు. ఆ వేదిక మీద మతం గురించి గానీ, అందుకు సంబంధించిన విషయాల గురించి గానీ నేను మాట్లాడలేదు. ఇస్లాం శాంతిని పెంపొందిస్తుందని నేను విశ్వసిస్తాను.

నా మతాచారాలన్నింటిని పాటించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అయితే తప్పు చేయడం మానవ సహజం. నేను కూడా అంతే. నా ప్రతీ పొరబాటును సరిచేసుకుంటూ ఉన్నతమైన ముస్లింగా ఎదిగేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. అయితే ఒక్క విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. మనుషులను విడదీసే ఏ విషయం గురించైనా మాట్లాడకపోవడమే మంచిది. ఐకమత్యమే మహాబలం. ముస్లింలంతా ఎల్లప్పుడూ కలిసే ఉండాలి. నిజానికి ఆరోజు నేను పూజను ప్రారంభించలేదు.

ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను అంతే. పశ్చిమ బెంగాల్‌ మంత్రి ఫిర్హాద్‌ హకీం పూజను ఆరంభించారు. ఏదేమైనా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే నన్ను క్షమించండి’’ అని వివరణ ఇచ్చాడు. గత ఏడాది అక్టోబర్‌ 29న షకీబ్‌పై ఐసీసీ విధించిన బ్యాన్‌ గడువు నవంబర్‌ 10తో ముగిసిన విషయం తెలిసిందే. కాగా బుకీల గురించి బోర్డుకు సరైన సమయంలో సమాచారం ఇవ్వలేదన్న ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్గతేడాది అక్టోబర్‌ 29న ‌ షకీబ్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. ఇందులో భాగంగా ఓ ఏడాది పాటు క్రికెట్‌ ఆడకుండా నిషేధం విధించగా... మరో ఏడాదిపాటు సస్పెన్షన్‌ అమలులో ఉంటుందని తెలిపింది. నవంబరు 10తో నిషేధం ముగియనుండటంతో దేశవాళీ టోర్నీలతో షకీబ్‌ మళ్లీ మైదానంలోకి దిగే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా