Ranji Trophy 2024: ఏడేళ్ల తర్వాత..! | Ranji Trophy 2024: Tamil Nadu Qualified To Ranji Trophy Semis After 7 Years, Check Score Details Inside - Sakshi
Sakshi News home page

Ranji Trophy 2024 Quarter Finals: ఏడేళ్ల తర్వాత..!

Published Sun, Feb 25 2024 6:48 PM

Tamil Nadu Qualified To Ranji Trophy Semis After 7 Years - Sakshi

తమిళనాడు క్రికెట్‌ జట్టు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యింది. ఇవాళ (ఫిబ్రవరి 25) ముగిసిన 2024 సీజన్‌ మూడో క్వార్టర్‌ ఫైనల్లో సౌరాష్ట్రను ఓడించడం ద్వారా ఈ జట్టు సెమీస్‌కు అర్హత సాధించింది.

ఈ మ్యాచ్‌లో తమిళనాడు ఇన్నింగ్స్‌ 33 పరుగుల తేడాతో విజయం సాధించి, ఈ సీజన్‌లో సెమీస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. కెప్టెన్‌ సాయికిషోర్‌ ఆల్‌రౌండ్‌ షోతో ఇరగదీసి (9/93, 60 పరుగులు) తమిళనాడును సెమీస్‌కు చేర్చాడు.

లుత బ్యాటింగ్‌ చేసిన సౌరాష్ట్ర.. సాయికిషోర్‌ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో 183 పరుగులకే కుప్పకూలింది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హార్విక్‌ దేశాయ్‌ (83) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన తమిళనాడు.. సాయికిషోర్‌ (60), ఇంద్రజిత్‌ (80), భూపతి కుమార్‌ (65) అర్దసెంచరీలతో రాణించడంతో 338 పరుగులు చేసి ఆలౌటైంది. సౌరాష్ట్ర బౌలర్లలో చిరాగ్‌ జానీ 3, ఉనద్కత్‌, పార్థ్‌ భట్‌, డి జడేజా తలో 2 వికెట్లు పడగొట్టారు.

తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే పరిమితమైన సౌరాష్ట్ర సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఇంకా దారుణమైన ప్రదర్శన చేసి 122 పరుగులకే చాపచుట్టేసింది. సాయికిషోర్‌ (4/27), సందీప్‌ వారియర్‌ (3/18), అజిత్‌ రామ్‌ (2/35) సౌరా​ష్ట్ర బ్యాటింగ్‌ లైనప్‌ను కకావికలం చేశారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో పుజారా టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

సమాంతరంగా జరుగుతున్న మిగతా క్వార్టర్‌ ఫైనల్స్‌లో.. విదర్భ-కర్ణాటక, ముంబై-బరోడా, మధ్యప్రదేశ్‌-ఆంధ్రప్రదేశ్‌ జట్లు తలపడుతున్నాయి. వీటిలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే విజయపు అంచుల్లో (గెలుపుకు 75 పరుగుల దూరంలో ఉంది, చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి) నిలిచింది. మిగతా రెండు మ్యాచ్‌లు నిదానంగా సాగుతున్నాయి. 

సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 50 పరుగులు చేసిన విదర్భ.. కర్ణాటకపై 224 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. వికెట్‌ నష్టానికి 21 పరుగులు చేసిన ముంబై బరోడాపై 57 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడు మ్యాచ్‌ల్లో మరో రెండు రోజుల ఆట మిగిలింది.

Advertisement
Advertisement