Sakshi News home page

#Virat Kohli: ఛ.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది! నీకే ఎందుకిలా?

Published Thu, Nov 2 2023 4:54 PM

WC 2023 Ind Vs SL: Virat Kohli Falls For 88 Fans Reacts Century Miss - Sakshi

WC 2023- Ind Vs SL- Virat Kohli Again Miss Century: వంద సెంచరీల రికార్డుకు చేరవయ్యే క్రమంలో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి గురువారం మరో ముందడుగు వేస్తాడనుకుంటే నిరాశే మిగిలింది. కోహ్లి బ్యాట్‌ నుంచి శతకం కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్‌ ఆశలపై లంక పేసర్‌ దిల్షాన్‌ మధుషాంక నీళ్లు చల్లాడు. 

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక  తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. లంక ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది.

ఆరంభంలోనే టీమిండియాకు షాక్‌
లంక స్పీడ్‌స్టర్‌ మధుషాంక బౌలింగ్‌లో.. ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(4) బౌల్డ్‌ అయ్యాడు. సొంతమైదానం ముంబైలోని వాంఖడేలో హిట్‌మ్యాన్‌ ఈ మేరకు పూర్తిగా విఫలమయ్యాడు.

ఈ క్రమంలో మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఓవైపు కోహ్లి.. మరో ఎండ్‌లో గిల్‌ ఇద్దరూ నిలకడగా.. పోటీపడుతూ ఆడుతూ లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకుని శతకాల కోసం పోటీపడ్డారు.

సెంచరీ కోసం పోటాపోటీ
ఓ దశలో కోహ్లికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోయిన గిల్‌.. సెంచరీ దిశగా పరుగులు తీశాడు. అయితే, దురదృష్టవశాత్తూ 30వ ఓవర్‌ ఆఖరి బంతికి అవుటయ్యాడు. మధుషాంక బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ కుశాల్‌ మెండిస్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి 92 పరుగుల వద్ద నిష్క్రమించాడు. 

మధుషాంక మరోసారి దెబ్బకొట్టాడు
ఈ క్రమంలో కోహ్లి ఆచితూచి ఆడుతూ వంద పరుగులు పూర్తి చేసుకుంటాడని భావించిన అభిమానులకు గట్టి షాక్‌ తగిలింది. మధుషాంక బౌలింగ్‌లో బంతిని తప్పుగా అంచనా వేసిన కోహ్లి 32వ ఓవర్‌ మూడో బంతికి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది
వాంఖడే వేదికగా అంతర్జాతీయ క్రికెట్‌లో 79వ సెంచరీ నమోదు చేస్తాడని భావిస్తే 88 పరుగులకే అవుటయ్యాడు. దీంతో తీవ్ర నిరాశకు గురైన కింగ్‌ కోహ్లి ఫ్యాన్స్‌  సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది. నీకే ఎందుకిలా కోహ్లి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

ఇది మూడోసారి
కాగా ప్రపంచకప్‌-2023లో సెంచరీకి చేరువగా వచ్చి కోహ్లి మిస్‌ కావడం ఇది మూడోసారి. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 85, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 95 పరుగుల వద్ద పెవిలియన్‌ చేరిన కోహ్లి.. తాజాగా 88 పరుగులు చేసి నిష్క్రమించాడు. 
చదవండి: అయ్యో శుబ్‌మన్‌.. సెంచరీ జస్ట్‌ మిస్‌! సారా రియాక్షన్‌ వైరల్‌

Advertisement

What’s your opinion

Advertisement