World Cup 2023: We Are Willing To Make It Happen: Rabada Keen To See South Africa Win - Sakshi
Sakshi News home page

WC 2023: అప్పుడేమో అలా! ఈసారి మాత్రం వరల్డ్‌కప్‌ ట్రోఫీ మాదే: సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌

Published Fri, Aug 18 2023 7:11 PM

WC 2023 We All Willing To Make It Happen: Rabada Keen To See South Africa Win - Sakshi

అప్పటి దాకా అదరగొట్టడం... అభిమానుల్లో అంచనాలు పెంచేయడం... మేజర్‌ ఈవెంట్లలో కీలక సమయంలో చేతులెత్తేయడం.. కనీసం ఫైనల్‌ కూడా చేరలేక చతికిలపడటం.. మీరు ఊహించిన పేరు నిజమే! ఈ ప్రస్తావన సౌతాఫ్రికా గురించే!

1992 నుంచి వరల్డ్‌కప్‌ టోర్నీలో పోటీపడుతున్న దక్షిణాఫ్రికా ఇంత వరకు ఒక్క వన్డే ట్రోఫీ కూడా గెలవలేదు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లలో విజయం అంచులదాకా వెళ్లి బోల్తా పడటం.. ‘చోకర్స్‌’ అనే ‘నామధేయం’ తమకు సరిగ్గా సరిపోతుందని మళ్లీ మళ్లీ నిరూపించుకోవడం ప్రొటిస్‌కు బాగా అలవాటు.

ఈసారి ట్రోఫీ గెలుస్తాం
అయితే, ఈసారి ఆ అపఖ్యాతిని కచ్చితంగా చెరిపేసుకుంటాం అంటున్నాడు సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్‌ కగిసో రబడ. ప్రపంచకప్‌ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా భారత్‌లో బరిలోకి దిగుతామని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు జరగనిది.. ఇప్పుడు చేసి చూపిస్తామంటూ ధీమా వ్యక్తం చేశాడు.

ప్రొటిస్‌ పేస్‌ దళానికి నాయకత్వం వహిస్తున్న 28 ఏళ్ల రబడ ఈ మేరకు మాట్లాడుతూ.. ‘‘సౌతాఫ్రికా క్రికెట్‌ గురించి బయట నడుస్తున్న డ్రామా, చర్చల గురించి మేము అస్సలు పట్టించుకోము. నిజమే ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆడుతూ.. ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవకపోతే ఎలా ఉంటుందో తెలుసు.

ప్రతి క్రికెటర్‌ కల అదే!
తీవ్రమైన నిరాశ కలుగుతుంది కదా! ఈ విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈసారి దానిని సాధ్యం చేసి చూపించాలని నేను... మేమంతా బలంగా కోరుకుంటున్నాం. వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలవడం ఎవరికైనా ఇష్టమే కదా!

ప్రతి ఒక్క క్రికెటర్‌ కల అదే! ఒక్కసారి జట్టును ప్రకటిస్తే.. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు’’ అంటూ ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు. కాగా ఇప్పటి వరకు నాలుగుసార్లు వరల్డ్‌కప్‌ సెమీస్‌ వరకు చేరుకున్న సౌతాఫ్రికా ఒక్కసారి కూడా ముందడుగు వేయలేకపోయింది.

అప్పుడలా..
ఆఖరిగా.. 2019 వరల్డ్‌కప్‌లో మాంచెస్టర్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 10 పరుగుల తేడాతో గెలిచి.. విజయంతో టోర్నీని ముగించింది. అయితే, ఈసారైనా కప్‌ గెలుస్తారంటూ.. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు మాత్రం ఫాఫ్‌ డుప్లెసిస్‌ బృందం నిరాశనే మిగిల్చింది. ఇదిలా ఉంటే.. భారత్‌ వేదికగా అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే!

చదవండి: టీమిండియా క్యాప్‌ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్‌!

Advertisement
Advertisement