WC 2023: తిలక్‌ వర్మను ఎందుకు ఎంపిక చేసినట్లు? అతడు అవసరమా?: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

4 Sep, 2023 13:39 IST|Sakshi
తిలక్‌ వర్మ (PC: BCCI)

Former Cricketer Comments On India's provisional World Cup squad Reports: టీమిండియా సెలక్టర్ల తీరుపై మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అసహనం వ్యక్తం చేశాడు. ఐసీసీ ఈవెంట్‌కు అక్కర్లేదనుకున్న వాళ్లను ఆసియా కప్‌-2023 టోర్నీకి ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించాడు. హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మను కాదని సూర్యకుమార్‌ యాదవ్‌ను సెలక్ట్‌ చేయడం వెనుక ఉద్దేశమేమిటో అర్థం కాలేదని వాపోయాడు.

యువ సంచలనం తిలక్‌
టీమిండియా యువ సంచలనం తిలక్‌.. వెస్టిండీస్‌ పర్యటనలో టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 173 పరుగులు సాధించి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాదు.. ఒక వికెట్‌ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌. ఇక దేశవాళీ వన్డేల్లోనూ తిలక్‌ రికార్డు మెరుగ్గా ఉంది.

దేశవాళీ వన్డేల్లో హిట్‌
ఇప్పటి వరకు 25 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. మొత్తంగా ఐదు సెంచరీలు, 5 అర్ధ శతకాల సాయంతో 101.64తో 1236 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఎడమచేతి వాటం తిలక్‌ వర్మకు ఉన్న అదనపు అర్హతగా పేర్కొంటూ ఆసియా వన్డే కప్‌ టోర్నీకి అతడిని ఎంపిక చేసినట్లు చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్పష్టం చేశాడు.

అయితే, ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడిన భారత జట్టులో తిలక్‌ వర్మకు చోటు దక్కలేదు. అదే విధంగా.. నేపాల్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లోనూ ఆడించే పరిస్థితి కనబడటం లేదు. మరోవైపు.. వరల్డ్‌కప్‌-2023కి ఇదే ప్రొవిజినల్‌ జట్టు అన్న బీసీసీఐ.. 15 మంది సభ్యుల టీమ్‌ నుంచి తిలక్‌ వర్మతో పాటు యువ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణను తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి.


సూర్యకుమార్‌ యాదవ్‌తో తిలక్‌ వర్మ

సూర్యకుమార్‌ వన్డే జట్టులో అవసరమా?
ఈ విషయంపై స్పందించిన ఆకాశ్‌ చోప్రా.. ‘‘సూర్యకుమార్‌ ఆటంటే నాకూ ఇష్టమే. కానీ అతడిని వన్డే ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో తెలియడం లేదు. ఒకవేళ పార్ట్‌టైమ్‌ స్పిన్నర్లు కావాలనుకుంటే.. అతడు బౌలింగ్‌ చేయలేడు కదా!

తిలక్‌ను ఎందుకు సెలక్ట్‌ చేశారు?
వన్డేల్లో అతడి రికార్డు కూడా ఏమాత్రం బాగోలేదు. ఆసియా కప్‌ జట్టులో తిలక్‌ వర్మకు చోటిచ్చారు. అసలు అప్పుడు అతడిని ఎందుకు సెలక్ట్‌ చేశారు? పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడించలేదు. నేపాల్‌తో ఆడే జట్టులోనూ అతడికి చోటు దక్కకపోవచ్చు. తిలక్‌కు వన్డే ప్రపంచకప్‌ ప్రొవిజినల్‌ జట్టులో స్థానం ఇవ్వనపుడు ఆసియా కప్‌కు ఎంపిక చేసి ఉపయోగం ఏమిటి?’’ అని అసహనం వ్యక్తం చేశాడు. 

సొంతగడ్డపై టీమిండియా..
అదే విధంగా.. శార్దూల్‌ ఠాకూర్‌ను నంబర్‌ 8 బ్యాటర్‌గా దింపే క్రమంలో ప్రసిద్‌  కృష్ణకు కూడా ఉద్వాసన పలికి ఉంటారని ఆకాశ్‌ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్‌ వేదికగా ఐసీసీ టోర్నీ ఆరంభం కానుంది. పుష్కరకాలం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌ ఈవెంట్‌లో ఆతిథ్య టీమిండియా హాట్‌ ఫేవరెట్‌ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ఆసియా వన్డే కప్‌-2023కి భారత జట్టు:
రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణ.
స్టాండ్‌ బై: సంజూ శాంసన్‌.

చదవండి: ఆసియాకప్‌ మ్యాచ్‌లపై నీలినీడలు.. ఇది నాకు ముందే తెలుసు!

మరిన్ని వార్తలు