Sakshi News home page

తప్పు చేయం.. తలవంపులు తీసుకురాం

Published Sat, Jun 24 2023 1:02 AM

- - Sakshi

ఆత్మకూరు: దివంగత మంత్రి, తన సోదరుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆలోచనలు ఎంతో ముందుచూపుతో ఉన్నతంగా ఉండేవని, ఆయనతో ఉండే అనుబంధంతో తాను చిన్న వయసులోనే ఈ విషయాన్ని గమనించానని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. పట్టణంలో ఏడీఎఫ్‌, ఎంజీఆర్‌ ఫౌండేషన్ల ద్వారా సొంత నిధులతో నిర్మించిన ఎంజీఆర్‌ మున్సిపల్‌ బస్టాండ్‌ను శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్‌ పాల్గొన్న ఈ సభలో ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి మాట్లాడారు. 1995లో లండన్‌లో చదువు పూర్తి చేసుకొని దేశంలో అడుగుపెట్టిన గౌతమ్‌రెడ్డి అప్పట్లో మాల్‌ లాంటివి లేకపోవడంతో అది ఏర్పాటు చేసే ఆలోచన చేశారన్నారు.

తాను ఎమ్మెల్యేగా ఎన్నికై సరిగ్గా ఈ రోజుతో ఏడాది పూర్తయిందని, ఇచ్చిన మాట మేరకు తొలి కానుకగా మున్సిపల్‌ బస్టాండ్‌ను ప్రజలకు అంకితం చేస్తున్నానని తెలిపారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పలు వినతులు అందాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఏడీఎఫ్‌ ద్వారా రూ.10 కోట్ల సొంత నిధులు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఆత్మకూరు నుడా పరిధిలో చేరడం సంతోషకరమని, పేదలకు మరో 15 వేల ఇళ్లు నిర్మించేందుకు అవకాశం కలిగిందని తెలిపారు.

ఇప్పటికే రెండు జాబ్‌మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించగా, శనివారం మరో 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా 23 కంపెనీలతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో మరో జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. నారంపేట వద్ద ఏర్పాటు చేసిన ఇండస్ట్రి యల్‌ పార్కులో ఆరు నెలల్లో ఓ పరిశ్రమ ఏర్పాటు కానుందని, అక్కడ 3 వేల మందికి ఉద్యోగాలు కల్పి ంచేలా పరిశ్రమలు తీసుకురానున్నట్లు తెలిపారు. రానున్న మూడేళ్లలో సోమశిల హైలెవల్‌ కెనాల్‌ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. తద్వారా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని మెట్ట మండలాలకు సాగు, తాగునీరు లభిస్తుందన్నారు.

నియోజకవర్గంలో రెండు జాతీయ రహదారులు ఉండగా, మరో జాతీయ రహదారి రానుందన్నారు. వేర్‌హౌసింగ్‌, లాజిస్టిక్‌ పార్కు ఏర్పాటుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని త్వరలోనే ఆ పనులు వేగవంతమయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తప్పు చేయం.. తలవంపులు తీసుకురాం
మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
ఆత్మకూరు: గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నామని, తమ కుటుంబీకులు తప్పు చేయబోరని, ప్రజలకు తలవంపులు తీసుకురామని నెల్లూరు మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరులో ఎంజీఆర్‌ బస్టాండ్‌ ప్రారంభోత్సవం అనంతరం బహిరంగసభలో ఆయన మాట్లాడారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సేవలు వినియోగించుకున్న కాంగ్రెస్‌ పార్టీ అనంతరం చెప్పుడు మాటలతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఇబ్బందులకు గురిచేయడంతో ఎంపీ పదవికి సైతం రాజీనామా చేసి ఆ కుటుంబం వెంట నడిచామన్నారు.

ఆత్మకూరు ప్రాంతానికి తమ కుటుంబం తరపున చిరుకానుకగా ఈ బస్టాండ్‌ను సొంత నిధులతో నిర్మించిన అందజేసినట్లు తెలిపారు. దివంగత వైఎస్సార్‌ వల్లనే వెలుగొండ ప్రాజెక్ట్‌, సోమశిల హైలెవల్‌ కెనాల్‌ రూపురేఖలు దాల్చాయని, వాటిని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా త్వరలోనే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సీఎం ఆశీర్వాదంతో తన సోద రుడు మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఉదయగిరి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారన్నారు. 600 వాగ్దానాలిచ్చి, వాటి ని తుంగలో తొక్కి, మళ్లీ కొత్త మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మబోరన్నారు.

తండ్రీ, కొడుకులు, దత్తపుత్రుడు అబద్దాలు చెబుతూ ప్రజలను నమ్మించేందుకు పాదయాత్ర,బస్సుయాత్ర చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వీరికితోడు పచ్చపత్రికలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో తిరిగి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి సతీమణి కీర్తిరెడ్డి, కుమార్తె అనన్య, కుమారుడు అర్జున్‌, తల్లి మణిమంజరి పాల్గొన్నారు.

Advertisement
Advertisement