కౌలుకు తీసుకుని కబ్జా | Sakshi
Sakshi News home page

కౌలుకు తీసుకుని కబ్జా

Published Mon, Sep 11 2023 12:18 AM

- - Sakshi

కోవూరు: టీడీపీ నేతల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్‌ భూములను సైతం కబ్జా చేస్తున్నారు. కౌలు పేరిట తీసుకుని భూ యజమానులను బెదిరించి స్వాహా చేస్తున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రధాన అనుచరుడిగా చలామణి అవుతున్న బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి నిర్వాకానికి పాల్పడ్డాడు. రూ.1.25 కోట్ల విలువైన ఐదెకరాలను కౌలుకు తీసుకుని ఆక్రమించాడు. బాధితులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించడంతో సదరు నేత కబ్జా పర్వం వెలుగులోకి వచ్చింది.

వివరాలు..బుచ్చిరెడ్డిపాళెం మండలం కట్టుబడిపాళేనికి చెందిన కాకుమాను కృష్ణకుమారి, కాకుమాను మాధురిదేవికు వవ్వేరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లలో 1023–ఏ,బీ, 1024–ఏ,బీ, 512–1బీ,బీలో ఐదెకరాల భూమి ఉంది. వంశపారంపర్యంగా వచ్చిన ఈ భూమిని అదే ప్రాంతానికి చెందిన నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి కౌలుకు ఇచ్చారు. పొలం యజమానులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.

ఇదే అదనుగా నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి ఎలాగైనా భూమిని సొంతం చేసుకోవాలని భావించాడు. రెవెన్యూ అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేసి రెవెన్యూ రికార్డుల్లో తన తల్లి నెల్లూరు మీనాక్షమ్మ పేరుపై భూమిని నమోదు చేయించుకున్నాడు.

గత మూడేళ్లుగా కౌలు చెల్లించలేదు. భూమిని సైతం అప్పగించలేదు. దీంతో భూయజమానులు గట్టిగా నిలదీయగా పొలం తనదని, మీకు కౌలు చెల్లించాల్సిన అవసరం లేదని బెదిరించాడు. దీంతో భూయజమానులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించగా మీనాక్షమ్మ పేరుపై భూములు నమోదై ఉన్నాయి. దీంతో తహసీల్దార్‌ ఈ నెల 16న భూ హక్కు పత్రాలతో విచారణకు హాజరుకావాలని నెల్లూరు ప్రభాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బుచ్చిఎస్సై వీరప్రతాప్‌ చీటింగ్‌ కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement