అప్రమత్తతతో ప్రాణ నష్టం జరగలేదు | Sakshi
Sakshi News home page

అప్రమత్తతతో ప్రాణ నష్టం జరగలేదు

Published Wed, Dec 6 2023 12:50 AM

- - Sakshi

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

కావలి: మిచాంగ్‌ తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందస్తుగా చేపట్టిన అప్రమత్తత చర్యల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని, కాలువలకు, చెరువులకు పడిన గండ్లకు, కోతకు గురైన రహదారులకు ఎఫ్‌డీఆర్‌ నిధులతో మరమ్మతులు చేపడతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కావలి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. తొలుత దగదర్తి – చెన్నూరు మార్గంలో కోతకు గురైన రహదారిని పరిశీలించారు. బోగోలు మండలం రామస్వామిపాళెంలో నీట మునిగిన ఎస్టీకాలనీ వాసులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పునరావాస కేంద్రానికి తరలించి ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో అన్ని సహాయక చర్యలు కొనసాగించేలా జిల్లా యంత్రాంగానికి ఆదేశాలిచ్చామన్నారు. కొంతమేర వరినార్లు నీట మునిగాయని, ఉద్యాన పంటలు స్వల్పంగా దెబ్బతిన్నాయని, వరి నార్లు దెబ్బతిన్న రైతులకు వెంటనే విత్తనాలను సబ్సిడీపై అందజేస్తామని, అన్నదాతలను ఆదుకుంటామని తెలిపారు. పునరావాస కేంద్రాల్లోని ఒక్కో కుటుంబానికి రూ.2,500, ఒక్కొక్కరికి రూ.1,000 అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారని తెలిపారు. ఇళ్లు నీట మునిగిన ప్రాంతాల్లో ప్రజలకు ఉచితంగా 25 కేజీల బియ్యం, పామాయిల్‌ ప్యాకెట్‌, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ ఉర్లగడ్డల చొప్పున ప్రతి కుటుంబానికి అందించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్‌ లైన్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. వారి వెంట జేసీ కూర్మనాథ్‌, కావలి ఆర్డీఓ శీనానాయక్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు ఉన్నారు.

నెల్లూరులో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తూ..
1/3

నెల్లూరులో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తూ..

సంగం: పునరావాస కేంద్రంలో ఆర్డీఓ మధులత
2/3

సంగం: పునరావాస కేంద్రంలో ఆర్డీఓ మధులత

నెల్లూరులో కూలిన చెట్టును తొలగిస్తూ..
3/3

నెల్లూరులో కూలిన చెట్టును తొలగిస్తూ..

Advertisement
Advertisement