జలసిరులే జగన్నినాదం | Sakshi
Sakshi News home page

జలసిరులే జగన్నినాదం

Published Thu, Dec 21 2023 12:48 AM

- - Sakshi

జిల్లాలో అధికశాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. గత టీడీపీ ప్రభుత్వంలో సాగునీరు, వ్యవసాయ రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలో సాగునీరు, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి కీలకమైన సంగం, నెల్లూరు బ్యారేజ్‌ల నిర్మాణాలను పూర్తి చేశారు. అలాగే సోమశిల హైలెవల్‌ కెనాల్‌, ఉత్తర కాలువ ఆధునికీకరణ కోసం రూ.వందల కోట్లు కేటాయించి పనులు పూర్తి చేస్తున్నారు.

జిల్లాలో వ్యవసాయ

రంగానికి మహర్దశ

సాగునీటి ప్రాజెక్టుల పనుల

వేగవంతానికి సీఎం వైఎస్‌ జగన్‌ కృషి

నెల్లూరు, సంగం బ్యారేజీలు పూర్తి చేసి జాతికి అంకితం

టీడీపీ పాలనలో వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అందరికీ అన్నం పెట్టే రైతన్నల అభ్యున్నతే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. జిల్లాలో సాగునీరు, వ్యవసాయ రంగాలపై దృష్టి సారించి పలు ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల పొలాలకు సాగునీరు అందిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన నెల్లూరు బ్యారేజ్‌ పనులను ఆయన తనయుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేశారు. ఈ బ్యారేజ్‌ ద్వారా సర్వేపల్లి, జాఫర్‌ సాహెబ్‌ కాలువల కింద సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల పరిధిలో 99,525 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు. ఈ బ్యారేజ్‌లో నిత్యం 0.4 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా సాగు, తాగునీటికి ఎలాంటి ఢోకా లేదు. నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జి నిర్మాణానికి 2008లో శ్రీకారం చుట్టి అప్పట్లో రూ.147.20 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించారు. వైఎస్సార్‌ హయాంలోనే రూ.86.92 కోట్లు ఖర్చు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బ్యారేజ్‌ నిర్మాణ పనులు అటకెక్కాయి. కమీషన్ల కోసం కక్కుర్తి పడి డిజైన్లలో మార్పులు చేసి అంచనా వ్యయాన్ని రూ.274.83 కోట్లకు సవరించినప్పటికీ పనులు చేపట్టడంలో విఫలమయ్యారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ బ్యారేజ్‌ నిర్మాణం పూర్తయింది.

ఎంజీఆర్‌ సంగం బ్యారేజ్‌

సంగం వద్ద పెన్నా జలాలను నిల్వ చేసి తద్వారా ఆయకట్టుకు నీరు అందించేలా వైఎస్సార్‌ హయాంలోనే ప్రణాళిక రూపొందించారు. జలయజ్ఞంలో భాగంగా సంగం బ్యారేజ్‌ నిర్మించి 3.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా రూ.335.80 కోట్లతో అంచనాలు రూపొందించారు. వైఎస్సార్‌ హయాంలోనే రూ.30.85 కోట్లు ఖర్చు చేశారు. ఆపై టీడీపీ హయాంలో బ్యారేజ్‌ పనులను నిర్లక్ష్యం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.131.12 కోట్ల తో ఈ బ్యారేజ్‌ నిర్మాణాన్ని పూర్తి చేశారు.

ఆనం సంజీవరెడ్డి సోమశిల లింక్‌ కెనాల్‌

సోమశిల హై లెవల్‌ లిఫ్ట్‌ కెనాల్‌ ప్రాజెక్ట్‌ ద్వారా సోమశిల రిజర్వాయర్‌ నుంచి 5 టీఎంసీలు సాగు, తాగునీరు అందించడానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఉత్తర కాలువ నుంచి ప్రారంభమయ్యే ఈ లింక్‌ కెనాల్‌ ద్వారా 90 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణే లక్ష్యంగా పనులు ప్రారంభించారు. ఈ కెనాల్‌ అంచనా వ్యయం మొదటి విడతలో రూ.840.90 కోట్లు కాగా ప్రభుత్వం ఇప్పటికే రూ.604.5 కోట్లు ఖర్చు చేసి 62.38 శాతం పనులు పూర్తి చేసింది. ప్రస్తుతం రెండో దశ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు.

సోమశిల అప్రాన్‌ పనులు

సోమశిల జలాశయం వద్ద వరదలకు దెబ్బతిన్న అప్రాన్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ భవిష్యత్తులో భారీ వరదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం రూ.117 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆ పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే గతంలో జలాశయానికి దిగువన ఉన్న శివాలయానికి కుడివైపున ఉన్న రిటైనింగ్‌ వాల్‌ ఎత్తు పెంపునకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఉత్తర కాలువ ఆధునికీకరణ

జిల్లాలో మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉత్తర కాలువ ఆధునికీకరణ కోసం రూ.640 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సోమశిల జలాశయం నుంచి కందుకూరు నియోజకవర్గం రాళ్లపాడు జలాశయం వరకు సుమారు 101 కి.మీ. పొడ వున్న ఉత్తర కాలువ నీటి తరలింపు సామర్థ్యం 350 క్యూసెక్కుల నుంచి 700 క్యూసెక్కులకు పెంచేలా కాలువ ఆధునికీకరణ చేస్తున్నారు. ఈ పనులు పూర్త యితే 1.10 లక్షల ఎకరాల ఆయకట్టు పెరగనుంది.

సర్వేపల్లి కాలువ

నెల్లూరులో సర్వేపల్లి కాలువ రక్షణ గోడల నిర్మాణానికి ప్రభుత్వం రూ.99.95 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం 60 శాతం పనులు పూర్తి కాగా ఇప్పటి వరకు రూ.60 కోట్లు ఖర్చు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా జిల్లాలోని భూములు సస్యశ్యామలం అవుతున్నాయంటూ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సోమశిల–కండలేరు వరద కాలువ ఆధునికీకరణ

సోమశిల–కండలేరు వరద కాలువ (45 కి.మీ. పొడవు) ఆధునికీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.960 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే 30 శాతం పనులు పూర్తయ్యాయి. వరద కాలువ నీటి విడుదల సామర్థ్యం రోజుకు ఒక టీఎంసీ మాత్రమే ఉండగా, ఆ సామర్థ్యాన్ని రెండు టీఎంసీల పెంచేలా ప్రభుత్వం ఆధునికీకరణ పనులు నిర్వహిస్తోంది.

1/1

Advertisement
Advertisement