సెలవులతో చార్జీలకు రెక్కలు | Sakshi
Sakshi News home page

పెరిగిన ప్రైవేటు బస్సు చార్జీలు...

Published Sat, Aug 12 2023 12:12 AM

రద్దీగా చైన్నె కోయంబేడు బస్టాండ్‌ (ఫైల్‌)  - Sakshi

సాక్షి, చైన్నె: శనివారం నుంచి వరుసగా సెలవులు రావడంతో చైన్నెలోని వివిధ పనులు, ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లు స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో ఆమ్నీ ప్రైవేటు బస్సు చార్జీలు 30 శాతం పెంచేశారు. ఇక విమానచార్జీలు 40 శాతం పెరిగాయి. రాష్ట్రంలోని వివిధ నగరాలు, జిల్లాలకు చెందిన వారు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అధికంగా ఉద్యోగాలు, వివిధ పనులు చేసుకుంటున్నారు.

అలాగే, విద్యాసంస్థల్లో వివిధ కోర్సులను అభ్యసిస్తున్న వాళ్లు మరీ ఎక్కువే. వీరంతా సెలవులు దొరికితే చాలు తమ స్వస్థలాలకు వెళ్లిపోవడం జరుగుతోంది. ఈ పరిస్థితులలో శని, ఆదివారం సెలవు దినాలు, సోమవారం ఒక్క రోజు సెలవు పెట్టుకుంటే చాలు మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవం సెలవు కలిసి వచ్చినట్టైంది. దీంతో వరుసగా నాలుగు రోజులు సెలవు తీసుకుని తమ స్వస్థలాలకు బయలుదేరిన వాళ్లే ఎక్కువ.

పెరిగిన చార్జీలు
శుక్రవారం సాయంత్రం నుంచి చైన్నెలోని కోయంబేడు ప్రభుత్వ బస్టాండ్‌ రద్దీ మయంగా మారింది. దక్షిణ తమిళనాడు వైపు వెళ్లే రైళ్లు కిక్కిరిశాయి. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌ల వైపుగా వెళ్లే వారికి కోసం మెట్రో రైలు సేవలను సైతం పెంచారు. విమానాశ్రయం మార్గంలో సైతం ట్రాఫిక్‌ రద్దీ పెరిగింది. చైన్నె నుంచి పలు రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాలకు వెళ్లే స్వదేశీ విమాన చార్జీలకు రయ్యు మంటూ టేకాఫ్‌ తీసుకున్నాయి.

చైన్నె నుంచి తమిళనాడులోని ఇతర నగరాలకు చార్జీలు, ఇతర రాష్ట్రాలకు చార్జీలు రూ. 2 వేల నుంచి 5 వేలు పెరగడం గమనార్హం. 40 శాతం మేరకు విమానచార్జీలు పెరి గాయి. ఇక, ప్రభుత్వ బస్సులు కిక్కిరిసి వెళ్లడం, రైళ్లలో రిజర్వేషన్లు దొరక్కపోవడంతో ఆమ్మీ ప్రైవేటు బస్సులను ఆశ్రయించిన వాళ్లు మరీ ఎక్కువ. దీంతో ఆమ్నీ బస్సుల చార్జీలు అమాంతంగా పెంచేశారు.

30 శాతం మేరకు చార్జీలను ఆమ్నీ యాజమాన్యం పెంచడంతో గత్యంతరం లేని పరిస్థితులలో స్వస్థలాలకు వెళ్లేందుకు జనం భారమైనా పయనం చేయక తప్పలేదు. ఈ రద్దీని పరిగణించిన ప్రభుత్వం ఆగమేఘాలపై 500 ప్రత్యేక బస్సు లను రోడ్డెక్కించింది. ఇదిలా ఉండగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్రం పిలుపునిచ్చిన నేపథ్యంలో తిరుప్పూర్‌లో జాతీయ జెండాల తయారీ వేగం పుంజుకుంది.

Advertisement
Advertisement