తెలంగాణ ఎన్నికలు.. రంగంలోకి 20వేల కేంద్ర బలగాలు | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎన్నికలు.. రంగంలోకి 20వేల కేంద్ర బలగాలు

Published Fri, Oct 20 2023 11:08 AM

20k Central Forces For Telangana For Assembly Elections - Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు కేంద్ర బలగాలను పంపించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో, రెండు రోజుల్లో రాష్ట్రానికి కేంద్ర బలగాలు రానున్నాయి.

వివరాల ప్రకారం.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 100 కంపెనీల నుంచి 20వేల కేంద్ర బలగాలు తెలంగాణకు రానున్నాయి. రెండు రోజుల్లో బలగాలు రాష్ట్రానికి చేరుకోనున్నాయి. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు కేంద్ర హోం శాఖ బలగాలను రాష్ట్రానికి పంపించనుంది.  ఒక్కో కంపెనీలో.. అస్సాం రైఫిల్స్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌, సశస్త్ర సీమాబల్‌ వంటి బలగాలకు చెందిన 60-80 మంది వరకు సిబ్బంది ఉంటారు. ఈ క్రమంలో మొత్తం 20 వేల మందికి పైగా కేంద్ర బలగాల సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కానున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకొని ఈ బలగాలు బందోబస్తు నిర్వహించనున్నాయి. కీలక ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాల ఏర్పాటుతో పాటు సరిహద్దుల్లోనూ తాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేసుకోనున్నాయి. ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ బృందాలు పలు విడతల్లో కవాతు జరపనున్నాయి. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియను చేపట్టనున్నాయి. ఓటర్లలో భయాందోళనలకు తావులేకుండా చేయడంలో భాగంగా ఫ్లాగ్‌మార్చ్‌ల ద్వారా భరోసా కల్పించనున్నాయి.

ఈ సిబ్బంది సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ఎంపిక చేసిన కొన్నింటి వద్ద సొంతంగానే విధులు నిర్వర్తించనున్నారు. మరికొన్ని కేంద్రాల వద్ద స్థానిక పోలీసులతో కలిసి బందోబస్తులో పాల్గొంటారు. మరోవైపు పోలింగ్‌ సమయంలో ఆయా కేంద్రాల వద్ద ఈ బలగాల బందోబస్తు కీలకం కానుంది. పోలింగ్‌ ముందురోజే ఆ కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకొని బందోబస్తులో నిమగ్నం కానున్నారు. అలాగే ఈవీఎంలను భద్రపరిచే కేంద్రాలు వీరి అధీనంలోనే ఉండనున్నాయి. ముందు వాటిని భద్రపరిచిన కేంద్రాల నుంచి పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లడం.. పోలింగ్‌ అనంతరం తిరిగి స్ట్రాంగ్‌రూం కేంద్రాలకు తరలించడం వంటి ప్రక్రియ కేంద్ర బలగాల నియంత్రణలోనే జరగనుంది. బందోబస్తు మాత్రమే కాకుండా.. డబ్బు, మద్యం వంటివాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు చేపట్టే తనిఖీల్లోనూ ఈ బలగాలు నిమగ్నం కానున్నాయి. 

ఇది కూడా చదవండి: ప్రగతి భవన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

Advertisement
Advertisement