Amit Shah Visit Hyderabad February 11th IPS Passing Out Parade NCP - Sakshi
Sakshi News home page

ఈ నెల 11న హైదరాబాద్‌కు అమిత్‌ షా.. పోలీస్‌ అకాడమీలోని పరేడ్‌కు హజరు!

Published Thu, Feb 9 2023 2:09 PM

Amit Shah Visit Hyderabad February 11th IPS Passing Out Parade NCP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 11న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌కు రానున్నారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో ఏర్పాటు చేయనున్న పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొననున్నారు. కాగా ఈనెల 11న నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 74ఆర్‌ఆర్‌ బ్యాచ్‌ ఐపీఎస్‌ ప్రొబేషనర్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ జరగనుంది.

ఈ బ్యాచ్‌లో 195 మంది ప్రొబేషనర్లు శిక్షణ పొందారు. ఈ పరేడ్‌కు కేరళ కేడర్‌కు చెందిన శెహన్‌షా నేతృత్వం వహించనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎనిమిది సంవత్సరాల శిక్షణ పందిన శెహన్‌షా.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు మెడల్స్ గెలుచుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేసిన ఆయన సీఐఎస్‌ఎఫ్‌, ఐఆర్‌పీఎఫ్‌లలో సైతం బాధ్యతలు నిర్వర్తించారు.

కరోనా తర్వాత ఇదే
కాగా కోవిడ్ తర్వాత  పూర్తిస్థాయిలో జరగనున్న పాసింగ్ అవుట్ పరేడ్‌ ఇదేనని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏఎస్‌ రాజన్‌ తెలిపారు. ఈ ఏడాదితో ఎన్‌పీఏ 75 వసంతాలు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. 74వ బ్యాచ్‌లో 195 మంది ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ పొందారన్నారు. వీరిలో  166 మంది భారతీయులు, 29 మంది విదేశీ శిక్షణార్థులున్నారు. 37 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నట్లు తెలిపారు. వీరంతా 46 వారాలపాటు కఠోర శిక్షణ పొందినట్లు పేర్కొన్నారు.

ఈసారి ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇండోర్‌, ఔట్ డోర్ సబ్జెక్ట్‌లు కలిపి 17 అంశాలపై ట్రైనింగ్ పొందారు. ఈనెల 11న జరిగే పాసింగ్ ఔట్ పరేడ్‌తో 46 వారాల శిక్షణ పూర్తవుతుంది. ఆ తర్వాత ఢిల్లీకి పంపిస్తారు. అక్కడ మరికొన్ని వారాల శిక్షణ పొందిన తర్వాత వాళ్లకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్తారు. అక్కడినుండి వాళ్ళను నియమించిన జిల్లాలలోకి వెళ్తారు. విధి నిర్వహణలో ఐపీఎస్‌లకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండేందుకు మెంటర్స్ ఉంటారు.’ అని తెలిపారు.

తెలుగు రాష్ట్రాలకు నూతన ఐపీఎస్‌లు
తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు నూతన ఐపీఎస్‌లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణకు కేటాయించిన అయిదుగురిలో అవినాష్‌ కుమార్‌, శేషాద్రిని రెడ్డి, మహేష్‌ బాబా సాహేబ్‌, అంకిత్‌ శంకేశ్వర్‌, శివం ఉపాధ్యాయ ఉన్నారు. ఏపీకి కేటాయించిన ఇద్దరిలో పంకజ్ కుమార్ మీనా, అంకిత్ మహవీర్‌లు ఉన్నారు.

Advertisement
Advertisement